Munakkaya Chicken Curry: మునక్కాడ చికెన్ కర్రీ చేసి చూడండి, ఒక్కసారి రుచి చూస్తే వదల్లేరు
Munakkaya Chicken Curry: మునక్కాడ, చికెన్ కాంబినేషన్ అదిరిపోతుంది. పైగా వీటిలో పోషకాలు కూడా ఎక్కువ. ఇక్కడ మేము మునక్కాడ చికెన్ కర్రీ రెసిపీ ఇచ్చాము.
మునక్కాడ, చికెన్ కర్రీ ఈ రెండూ కూడా పోషకాలను కలిగి ఉంటాయి. ఇక ఈ రెండింటినీ కలిపి వండితే ఆ రుచి అదిరిపోతుంది. మునక్కాడ చికెన్ కాంబినేషన్లో కర్రీ వండితే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. వేడివేడి అన్నంలో ఈ కూరలోని ఇగురును కలుపుకొని చూడండి. రుచి అదిరిపోతుంది. ఇందులో లేత మునక్కాయలను వాడతాము. కాబట్టి కూరకు ప్రత్యేకమైన రుచి సువాసన వస్తాయి. మునక్కాడ చికెన్ కర్రీ రెసిపీ కూడా చాలా సులువు.
మునక్కాడ చికెన్ కర్రీ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు
మునక్కాయలు - రెండు
చికెన్ - అర కిలో
టమోటాలు - రెండు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
చికెన్ మసాలా - రెండు స్పూన్లు
కారం పొడి - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు స్పూను
యాలకులు - రెండు
బిర్యానీ ఆకులు - రెండు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
మునక్కాడ చికెన్ కర్రీ రెసిపీ
1. మునక్కాడలను కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. నూనె వేడెక్కాక యాలకులు, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
5. ఉల్లిపాయలను సన్నగా తరిగి నూనెలో వేసి వేయించాలి.
6. అవి మెత్తగా ఉడికిన తరువాత పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
7. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కారం, చికన్ మసాలా వేసి కలుపుకోవాలి.
8. అందులోనే మునక్కాడ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
9. అవి అయిదు నిమిషాలు వేగాక అందులో చికెన్ ముక్కలు వేసి వేయించాలి.
10. అందులో అరగ్లాసు నీళ్లు వేసి కలపాలి.
11. మూత పెట్టి పావుగంట సేపు ఉడికించుకోవాలి. ఇది ఇగురులాగా అయ్యాక కొత్తిమీర తరుగు చల్లుకోవాలి.
12. ఈ మునక్కాడ చికెన్ కర్రీని అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా టేస్టీగానే ఉంటుంది.
చికెన్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మెదడుకు చికెన్ తినడం వల్ల అనేక పోషకాలు ఉంటాయి. చికెన్ విటమిన్ బి12, కోలిన్ అధికంగా ఉంటాయి. అందుకే పిల్లల మెదడు కోసం చికెన్ అప్పుడప్పుడు తినాలి. నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి కూడా చికెన్ తినాల్సిన అవసరం ఉంది. ఇక ఇందులో మనం మునక్కాయలు అధికంగా వాడాము. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే దగ్గు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు మునక్కాయలు తింటూ ఉండాలి. మునక్కాయను డైట్ లో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.