Munagaku Karam Podi: మునగాకు కారం పొడితో రోజూ ఒక ముద్ద తిన్నా చాలు, రెసిపీ ఇదిగో
Munagaku Karam Podi: మునగాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో మునగాకు కారం పొడి తయారుచేయచ్చు.
Munagaku Karam Podi: మునగాకులు తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయినా వాటిని తినే వాళ్లు చాలా తక్కువ. పప్పు మునగాకు, మునగాకు వేపుడు వంటివి రుచిగా ఉంటాయి. కానీ మునగాకు వాడకం తక్కువే ఉంది. మునగాకును తినలేని వారు ఓసారి మునగాకు కారం పొడిని తయారుచేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కనుక ఈ పొడితో రోజూ ఒక ముద్ద అన్నం తింటే ఎంతో మేలు జరుగుతుంది.
మునగాకు కారంపొడి కావాల్సిన పదార్థాలు
మునగాకులు - ఒక కప్పు
పల్లీలు - ఒక స్పూను
నూనె - ఒకటిన్నర స్పూను
శెనగ పప్పు - ఒక స్పూను
నువ్వులు - ఒక స్పూను
మినప పప్పు - ఒక స్పూను
ఎండు మిర్చి - పది
వెల్లుల్లి రెబ్బలు - పది
ధనియాలు - ఒక స్పూను
చింత పండు - చిన్న ఉండ
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - ఒక స్పూను
మునగాకు కారంపొడి తయారీ ఇలా
1. మునగాకులను నీళ్లలో శుభ్రంగా కడిగి ఒక వస్త్రంలో వేసి తడి లేకుండా ఆరబెట్టాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి అర స్పూను నూనె వేయాలి. అందులో తడి లేని మునగాకులను వేసి వేయించాలి.
3. మునగాకు పొడిపొడిగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో పల్లీలు, నువ్వులు వేసి వేయించాలి.
4. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి, శెనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి.
5. మునగాకుతో పాటూ వేయించిన అన్ని పదార్థాలను మిక్సీ జార్లో వేయాలి. అందులో జీలకర్ర, చింతపండు కూడా వేసి పొడిలా చేయాలి.
6. రుచికి సరిపడా ఉప్పును అందులో వేయాలి. అంతే మునగాకు కారం పొడి రెడీ అయినట్టే.
7. వేడి వేడి అన్నంలో ఈ మునగాకు కారం పొడి వేసి, కాస్త నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. రోజూ ఈ పొడితో ఒక్క ముద్ద అన్నం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.