Mothers Day Letter : అమ్మ కోసం ఇలా ప్రత్యేకంగా ప్రేమతో ఒక లేఖ రాయండి-mothers day 2024 write heartwarming letter to your mother to make her feel happy letter ideas ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mothers Day Letter : అమ్మ కోసం ఇలా ప్రత్యేకంగా ప్రేమతో ఒక లేఖ రాయండి

Mothers Day Letter : అమ్మ కోసం ఇలా ప్రత్యేకంగా ప్రేమతో ఒక లేఖ రాయండి

Anand Sai HT Telugu
May 11, 2024 10:30 AM IST

Mothers Day 2024 : ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు మించినది ఏదీ లేదు. అయితే మదర్స్ డే సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా లేఖ రాయండి.

మదర్స్ డే లెటర్ ఐడియా
మదర్స్ డే లెటర్ ఐడియా (Unsplash)

అమ్మ అంటే వెలకట్టలేని ప్రేమ. అమ్మతో సమానం మరొకరు లేరు. ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటాం. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ రోజును అమ్మ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ఆశ ఉంటుంది. అయితే ఏం చేయాలనే ఆలోచన మాత్రం చాలా మందికి ఉండదు.

చాలా మంది అమ్మ కోసం ఖరీదైన బహుమతులు కొంటారు. ఆమెను ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఇలా చేస్తేనే అమ్మ సంతోషపడుతుందని అనుకోకండి. మీరు ఆమె కోసం ప్రత్యేక లేఖ కూడా రాయవచ్చు. అమ్మను సంతోషపెట్టమని మీ హృదయానికి చెప్పండి, ఆమె కచ్చితంగా ఇష్టపడుతుంది. మీ మనసులోని భావాలను అమ్మకు చెప్పండి. మీరు ఎప్పుడూ తనకు చెప్పని విషయాలను లేఖ ద్వారా చెప్పుకొండి. అయితే ఇందుకోసం మీకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అమ్మను సంతోషపెట్టేందుకు కొన్ని రకాల పదాలను వాడండి. మదర్స్ డే సందర్భంగా అమ్మ కోసం ఉత్తరం ఎలా రాయాలో తెలుసుకుందాం.

అమ్మ నువ్వే నా రోల్ మోడల్. నా కష్టకాలంలో నాకు అండగా నిలిచినది నువ్వే. నేను నా జీవితమంతా ఆదర్శవంతమైన వ్యక్తి కోసం వెతుకుతున్నాను, కానీ చివరకు అది నువ్వే అని నేను తెలుసుకున్నాను. నాకు బాగా తెలుసు నువ్వు నాకు బాగాలేనప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు. నాకు మంచి మార్కులు వస్తే నువ్వు ఎంత గర్విస్తావో నాకు బాగా తెలుసు. నేను జీవితంలో ఏదైనా సాధించాను అంటే.. అది నీ వల్లే.. నా ప్రియమైన అమ్మకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. నీ బిడ్డగా నీకు మంచి పేరు తీసుకురావడం మాత్రమే చేయగలను. నీ త్యాగానికి ధన్యవాదాలు.. అమ్మ..

నా ప్రేమను నీతో ఒప్పుకోవడానికి నేను సంకోచిస్తున్నా అమ్మ.. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు కూడా తెలుసు. నువ్ మా కోసం ప్రతిరోజూ చాలా త్వరగా మేల్కొంటావ్. కుటుంబం విషయానికి వస్తే, మరేమీ పరిగణనలోకి తీసుకోరు. మా కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావ్. మా సంతోషం కోసం నీ సంతోషాలను అన్ని వదులుకున్నావ్. మా ఆనందంలో నీ ఆనందం వెతుక్కుంటావ్. నువ్ లేని జీవితం అసలు ఊహించలేను అమ్మ..

నేను తప్పులు చేసినప్పుడు సరిదిద్దావ్. నువ్వు నన్ను ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. నీ త్యాగానికి, ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞుడను. ప్రతిరోజూ మా కోసం రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తావ్. మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటావ్. కుటుంబ సంతోషం కోసం పని చేస్తున్నందుకు ధన్యవాదాలు అమ్మ.. అసలు నీకు ఉన్న ఓపికలో నాకు కొంచెమైనా ఉండి ఉంటే.. ఎంతో బాగుండేది. భూ దేవికి ఉన్నంత ఓర్పు నీకు ఎలా సాధ్యం అమ్మా..

అవునమ్మా.. నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమే. నీ మాట వినకుండా నీతో ఎన్నోసార్లు పోరాడి వాదించాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. అందుకు నన్ను క్షమించు. ఇప్పుడు నేను తల్లిని అయినందున నాకు బాగా అర్థమైంది. నా పిల్లలు నాతో గొడవ పడి వాదించినప్పుడు నేను నీ హృదయాన్ని గాయపరిచాను అని నా మనసులో సూదులతో గుచ్చుకున్నట్టుగా అవుతుంది. నాకు ఎంత వయసొచ్చినా నీ మీద ప్రేమ తగ్గదు. నా జీవితంలో అందమైన క్షణాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు అమ్మ.

నా జీవితంలోకి వచ్చిన మొదటి స్త్రీ నువ్వు. నేను నీ కొడుకుగా పుట్టడం నా పుణ్యం. ఒంటిరి ఆడది ఏమీ సాధించదు అని వేళ్లు చూపే వారికి నువ్వే సమాధానం చెప్పావ్. ఒంటరిగా ఉంటూ కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ పిల్లల కలలను నెరవేర్చిన గొప్ప తల్లివి నువ్వు. మహిళలను ఎలా గౌరవించాలో నీ నుంచి నేర్చుకున్నాను. విలువైన జీవిత పాఠాలు నేర్పిన నీ ప్రేమకు ఎప్పుడూ బానిసనే అమ్మా.

అమ్మ ప్రేమను మాటల్లో వర్ణించలేం. ఆమెకు ప్రత్యేకమైన రోజున కొన్ని మాటలు చెప్పండి. గిఫ్ట్స్ ఎవరైనా ఇస్తారు.. కానీ మీ మనసులోని మాటలను లేఖ రూపంలో చెబితేనే ఆమెకు సంతోషం.

Whats_app_banner