Siddipet District News : పగటి పూట ఊరు ఊరు తిరుగుతూ బట్టలు అమ్ముతుంటాడు. ఇదే సమయంలో తాళం వేసి ఉన్న ఇండ్ల ను గమనించి రెక్కీ చేస్తాడు. తీరా రాత్రి పూట సమయం చేసుకుని వచ్చి దొంగతనం చేస్తుంటాడు.ఇది ఓ దొంగ స్టైల్. ఇప్పటి వరకు బాగానే వర్కౌట్ అయినప్పటికీ... ఎట్టకేలకు పోలీసులకు చిక్కిపోయాడు.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... రాత్రి పూట ఆ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్ కు పంపించారు. నిందితుని వద్ద నుంచి 13. 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అడిషనల్ డీసీపీ యస్ మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం బర్కత్‌పురాకాలనీకి చెందిన షేక్ సలీమ్ (53) గత కొంతకాలం నుంచి ఊరు ఊరు తిరుగుతూ కట్ పీసులు గల బట్టలు అమ్ముతూ ఉండేవాడు. ఆ బట్టలు అమ్మగా వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు మరియు జల్సాలకు సరిపోకపోవడంతో ఏదైనా దొంగతనం చేసి సులువుగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు.
కుటుంబ అవసరాలు, జల్సాలు తీర్చుకోవాలంటే దొంగతనాలు చేయాలని షేక్ సలీమ్ నిర్ణయించుకున్నాడు. అతడు పగటిపూట బట్టలు అమ్ముతూ తాళం వేసి వున్నా ఇండ్లను గమనించి రెక్కీ చేసి రాత్రి పూట దొంగతనాలు చేసేవాడు. దీంతో సిద్దిపేట జిల్లా కొడకండ్ల గ్రామంలోని బీడ నరసింహులు ఇంట్లో 18 జనవరి 2023 నాడు ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనం చేసి బంగారు ఆభరణాలు,నగదును దోచుకున్నాడు.
ఆ తర్వాత జనవరి 17న అదే గ్రామంలో రాత్రి సమయంలో తాళం వేసివున్న ఇనుప రాడ్ తో ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో నుండి 4 తులాల బంగారు పుస్తెలతాడుతో పాటు రూ.10,000 నగదు తీసుకొని పారిపోయాడు. అనంతరం దాదాపు 12 నెలల తర్వాత మళ్లీ వంటిమామిడి వద్ద 3 తులాల బంగారు గొలుసు, 2 తులాల బంగారు బ్రాస్లెట్,అర తులం బంగారు రింగ్,చిన్న శాంసాంగ్ ఫోన్, రూ .5000 దొంగిలించాడు. ఆ తర్వాత సిద్ధిపేట పట్టణంలో కూడా చోరీలు చేశాడు. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు అందగా... దీనిపై విచారించిన పోలీసులు కుకునూర్ పల్లి కేసును చేధించారు.
దొంగతనాల కేసును సవాల్ గా తీసుకున్న సిద్ధిపేట పోలీసులు(siddipet police commissionerate)... దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. 8 మే తేదీన రాత్రి 9 గంటలకు నిందితుడు కుకునూరు పల్లి బస్టాండ్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్నారు.
అతని చేతిలో ఉన్న కవర్ తనిఖీ చేయగా ఇనుప రాడ్ ఉన్నందున విచారించగా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 13.4 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసి నిందితుని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
టాపిక్