Siddipet Police Checking : సిద్దిపేట పోలీసుల విస్తృత తనిఖీలు- రూ.14 లక్షల నగదు, మద్యం సీజ్-siddipet police checking seized unaccounted 14 lakh cash liquor ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Siddipet Police Checking : సిద్దిపేట పోలీసుల విస్తృత తనిఖీలు- రూ.14 లక్షల నగదు, మద్యం సీజ్

Siddipet Police Checking : సిద్దిపేట పోలీసుల విస్తృత తనిఖీలు- రూ.14 లక్షల నగదు, మద్యం సీజ్

HT Telugu Desk HT Telugu
May 07, 2024 08:32 PM IST

Siddipet Police Checking : సిద్దిపేట జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.14.61 లక్షల నగదు పట్టుబడింది. ఈ నగదు సీజ్ చేసి ఎన్నికల అధికారులకు అప్పగించారు.

సిద్దిపేట పోలీసుల విస్తృత తనిఖీలు
సిద్దిపేట పోలీసుల విస్తృత తనిఖీలు

Siddipet Police Checking : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన వాహనాల తనిఖీలలో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.14. 61 లక్షల నగదును, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట వన్ టౌన్ సీఐ లక్ష్మీబాబు, తన సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఆకస్మిక వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో సిద్దిపేట పట్టణానికి చెందిన యం.రమేష్ అనే యువకుడు తన మోటార్ సైకిల్ లో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళుతున్న రూ. 8,62,000 సీజ్ చేశారు. అదేవిధంగా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన సీహెచ్ రాములు, ఎలాంటి పత్రాలు లేకుండా రూ. 6 లక్షలు తీసుకొని వెళ్తుండగా సీజ్ చేసినట్లు సీఐ లక్ష్మీబాబు తెలిపారు. సీజ్ చేసిన నగదును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించి డబ్బులు రిలీజ్ చేసుకోవచ్చని సూచించారు.

yearly horoscope entry point

అక్రమ మద్యం స్వాధీనం

సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంబాద్ గ్రామంలో పిల్లి శ్రీకాంత్ తన హోటల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా బెల్ట్ షాపు నడుపుతున్నాడని సమాచారంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 5.3 లీటర్ల విస్కీ బాటిల్స్, అక్కన్నపేట, గౌరలెల్లిలో 12 లీటర్ల మద్యం, సుమారు 30 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు మాట్లాడుతూ ఇండ్లలో, హోటళ్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, కిరాణా షాపులలో, ఇతర దుకాణాలలో ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా బెల్ట్ షాప్ నడిపినా, బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడితే సమాచారం అందించాలని కోరారు. జూదం పేకాట ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పీడీఎస్ రైస్, అక్రమ రవాణా చేసినా, పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా,కలిగి ఉన్నా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.

సైబర్ వలలో ఓ బాధితుడు

పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించి ఓ యువకుడు రూ. 15. 21 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ కు పార్ట్ టైం జాబ్ పేరిట ఏప్రిల్ 26న ఫోన్ కు మెసేజ్ వచ్చింది. అది చూసిన బాధితుడు తన వివరాలను నమోదు చేశాడు. దీంతో సైబర్ నేరగాడు అతడికి ఓ వ్యాలెట్ ను క్రియేట్ చేశాడు. బాధితుడు ముందుగా రూ.2 వేలు చెల్లించి, అతడు ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేయడం మొదలుపెట్టాడు. తాను పెట్టిన నగదును సైబర్ నేరగాడు రెట్టింపుగా వ్యాలెట్లో చూపిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బాధితుడు పలుమార్లు మొత్తం రూ. 15 లక్షల 21 వేలు చెల్లించాడు. చివరగా తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ కూడా ఇవ్వాలని అడగగా అతడు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Whats_app_banner