Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి-siddipet teacher went election training died with sunstroke ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

HT Telugu Desk HT Telugu
May 05, 2024 10:10 PM IST

Siddipet : రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో వడదెబ్బ తగిలి ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఎలక్షన్ సంబంధిత శిక్షణ వెళ్లి అస్వస్థతకు గురైన టీచర్...చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు.

వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Siddipet : రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు(summer heat)) భగ్గుమంటున్నాయి. పగటి పూట ప్రజలు బయటకి రావాలంటేనే భయపడిపోతున్నారు. దీనికి తోడు ఉక్కపోత, వడగాల్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బ(Sun Stroke) కారణంగా రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సిద్దిపేట (Siddipet)జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని బాలునాయక్ తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. హుస్నాబాద్ మండలంలోని బాలునాయక్ తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లకావత్ రామన్న(44) సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం యాటకర్లపల్లె ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గజ్వేల్ లో జరుగుతున్న శిక్షణకు శుక్రవారం రామన్న హాజరయ్యాడు. అక్కడే అస్వస్థతకు గురై ఒక్కసారిగా కిందపడిపోయాడు. అది గమనించిన తోటి సిబ్బంది వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించడంతో కాస్త కోలుకున్నాడు. అనంతరం తన కుమారుడు ఇంటికి తీసుకెళ్లాడు.

yearly horoscope entry point

మళ్లీ అస్వస్థతకు గురై

ఇంటికి తీసుకెళ్లాక మళ్లీ రాత్రి వాంతులు చేసుకున్నాడు రామన్న. వెంటనే కుటుంబసభ్యులు కరీంనగర్ (Karimnagar)ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి,అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో వారు వరంగల్ ఎంజీఎం(Warangal MGM) ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రామన్న శనివారం రాత్రి మృతి చెందాడు.

పెరిగిన వడగాల్పులు

వడగాల్పులు(Heat Wave) విపరీతంగా పెరగడంతో, ఉమ్మడి మెదక్ జిల్లాలోని శనివారం చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలోని, రేగోడ్ మండలంలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

నోవాటెల్ పరిశ్రమలో కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి

నోవాటెల్ పరిశ్రమలో కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా(Medak District) మాసాయిపేట మండలం శనివారం జరిగింది. వివరాల ప్రకారం మాసాయిపేట గ్రామానికి చెందిన పెరుమానుల్ల కృష్ణ (44) గత కొద్దిరోజుల నుండి నోవాటెల్ పరిశ్రమలో హమాలీ కార్మికుడుగా(Worker) పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజులాగానే శుక్రవారం కూడా పనికి వెళ్లాడు. పరిశ్రమలో పనిచేస్తున్న క్రమంలో అతడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తోటి కార్మికులు మాసాయిపేటలోని తన ఇంటికి తీసుకొచ్చారు. దీంతో అతనిని కుటుంబసభ్యులు వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య సుజాత,ఒక కొడుకు,కూతురు ఉన్నారు. అతని మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దీంతో కుటుంబీకులు గ్రామస్థుల సహకారంతో మృతదేహంతో పరిశ్రమ ఎదుట తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చివరకు పరిశ్రమ ప్రతినిధులు, లేబర్ కాంట్రాక్టర్ వచ్చి బాధిత కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించి, ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Whats_app_banner

సంబంధిత కథనం