Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు-warangal police arrested four culprits supply ganja in tamarind sacks ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

HT Telugu Desk HT Telugu
Published May 05, 2024 02:45 PM IST

Ganja Smuggling : సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు చింతపండు మాటున గంజాయి సప్లై చేస్తున్నారు. హనుమకొండలో గంజాయిని మరో ఇద్దరు వ్యక్తులకు ఇస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.

చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా
చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా

Ganja Smuggling : సులభంగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఓ ముఠా అక్రమ దందాకు తెరలేపింది. చింతపండు బస్తాల మాటున యువతను టార్గెట్ చేసి గంజాయి రవాణాకు పాల్పడింది. చివరకు విషయం బయటకు పొక్కడంతో శనివారం నలుగురు సభ్యుల ముఠాను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.35 లక్షల విలువైన 9.5 కిలోల గంజాయి(Ganja)తో పాటు నాలుగు సెల్ ఫోన్లు, చింత పండు బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్ట్ కు సంబంధించిన వివరాలను హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి శనివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.

ఏపీలోని కృష్ణా జిల్లా(Krishna District) వీర్లపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన ఈదర కృష్ణ నాగేశ్వరరావు, ప్రస్తుతం ఖమ్మం చింతకాని మండలం కొదుమూరులో ఉంటున్నాడు. కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన అనుమోలు వెంకటరమణ, నాగేశ్వరరావు స్నేహితులు. కాగా ఖర్చులకు తగిన ఆదాయం లేకపోవడంతో ఇద్దరూ సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏపీలోని సీలేరు ప్రాంతానికి చెందిన సురేశ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నారు. సురేశ్ గంజాయి వ్యాపారం చేస్తుండగా.. అతనితో పరిచయం పెంచుకుని ఇద్దరూ అదే దందా చేయడం మొదలు పెట్టారు.

గుట్టుగా వరంగల్ కు సప్లై

సురేశ్ నుంచి గంజాయి(Ganja) దందా మొదలు పెట్టిన ఈదర కృష్ణ నాగేశ్వరరావు, అనుమోలు వెంకటరమణ ఇద్దరూ వరంగల్(Warangal) ను టార్గెట్ చేశారు. ఇక్కడ వారికి పరిచయం ఉన్న హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన మహ్మద్ అబ్దుల్ రహీమ్, హనుమకొండలో తనకు పరిచయం ఉన్న మధ్యప్రదేశ్ కు చెందిన శ్రీకర్ త్రిపాఠికి గుట్టుగా గంజాయి చేరవేయడం ప్రారంభించారు. పోలీసులకు అనుమానం రాకుండా చింతపండు బస్తాల మాటున గంజాయిని వరంగల్ నగరానికి తీసుకొచ్చి హనుమకొండలో మహ్మద్ అబ్దుల్ రహీమ్, శ్రీకర్ త్రిపాఠికి అప్పగించేవారు.

నిందితుల అరెస్ట్

కృష్ణ నాగేశ్వరరావు, వెంకటరమణ ఇద్దరూ ఎప్పటిలాగే శనివారం ఉదయం కూడా చింతపండు బస్తాల మాటునే గంజాయిని హనుమకొండ(Hanamkonda) బస్టాండ్ కు తీసుకొచ్చారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో మహ్మద్ అబ్దుల్ రహీమ్, శ్రీకర్ త్రిపాఠికి అప్పగించేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ బస్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారి కదలికలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. కాగా బస్ లో వచ్చిన ఇద్దరు నిందితులు, స్థానికంగా మరో ఇద్దరు యువకులకు చింతపండు (Tamarind)బస్తాల్లో భద్రపర్చిన గంజాయిని అందజేస్తుండగా.. హనుమకొండ పీఎస్ ఎస్సై శ్రవణ్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా.. నిందితులు గంజాయి క్రయవిక్రయాల విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద ఉన్న రూ.2.35 లక్షల విలువైన 9.5 కిలోల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హనుమకొండ సీఐ సతీష్, ఎస్సై శ్రావణ్ కుమార్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని ఏసీపీ దేవేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం