Moringa Chapati: మునగాకులతో ఇలా చపాతీ చేసుకోండి, బ్రేక్ ఫాస్ట్‌లో అదిరిపోతుంది-moringa chapati recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moringa Chapati: మునగాకులతో ఇలా చపాతీ చేసుకోండి, బ్రేక్ ఫాస్ట్‌లో అదిరిపోతుంది

Moringa Chapati: మునగాకులతో ఇలా చపాతీ చేసుకోండి, బ్రేక్ ఫాస్ట్‌లో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Jun 10, 2024 06:00 AM IST

Moringa Chapati: బ్రేక్ ఫాస్ట్‌లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే రోజంతా ఉత్సాహంగా సాగుతుంది. ఇక్కడ మేము మోరింగా చపాతి ఎలా చేయాలో చెప్పాము. అంటే మునగాకులతో చేసే చపాతీ.

మునగాకు చపాతీ రెసిపీ
మునగాకు చపాతీ రెసిపీ

Moringa Chapati: మునగాకులను మోరింగా అంటారు. వీటితో చేసే చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్‌లో ఓసారి మునగాకు చపాతీలు ప్రయత్నించండి. అల్పాహారంలో అధిక పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా మీరు చురుగ్గా పనిచేయగలుగుతారు. దీని చేయడం చాలా సులువు. మునగాకులను తినమని వైద్యులు కూడా సిఫారసు చేస్తారు. కాబట్టి మునగాకులు తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది

yearly horoscope entry point

మునగాకు చపాతి రెసిపీకి కావలసిన పదార్థాలు

గోధుమపిండి - ఒకటిన్నర కప్పు

మునగాకులు - ముప్పావు కప్పు

కొత్తిమీర తరుగు - అర కప్పు

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - ఒకటి

వెల్లుల్లి తరుగు - అర స్పూను

అల్లం తరుగు - అర స్పూను

కారం - అర స్పూను

పసుపు - పావు స్పూను

యాలకుల పొడి - పావు స్పూను

చాట్ మసాలా - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నీరు - తగినంత

నెయ్యి - ఒక స్పూను

మునగాకు చపాతి రెసిపీ

1. మునగాకు చపాతీ చేయడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకోండి.

2. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అందులోనే సన్నగా తరిగిన మునగాకులు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి బాగా కలపాలి.

3. అందులోనే కారం, పసుపు, యాలకుల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.

4. నీరు వేసి చపాతీ పిండి లాగా కలుపుకోండి.

5. ఆ పిండిని గాలి తగలకుండా మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టండి.

6. ఇప్పుడు చిన్న భాగాన్ని తీసుకొని చపాతీలా ఒత్తుకోండి.

7. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాయండి.

8. నెయ్యి వేడెక్కాక ఈ చపాతీని దానిపై వేసి రెండు వైపులా కాల్చుకోండి.

9. దీన్ని ఏ కూరతో తిన్నా టేస్టీగా ఉంటుంది. రుచి కూడా అదిరిపోతుంది.

మునగాకులను మన ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు కూడా చెబుతున్నారు. మునగ ఆకుల్లో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా క్యాల్షియం, పొటాషియం, ఐరన్ దీని నుండి అధికంగా లభిస్తాయి. అంతేకాదు మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారు మునగాకులతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజూ తింటే అవి అదుపులో ఉంటాయి. ఇక బ్రేక్ ఫాస్ట్ లో మునగాకుతో చేసిన ఆహారాలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

Whats_app_banner