Mindful eating: తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు.. ఆగమాగం కాకండి
Mindful eating: జాగరూకతతో, బుద్దిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొందరు ఆగమాగం తినేస్తారు. ఆకలైందంటే చాలు ఐదారు నిమిషాల్లో తినడం పూర్తయి చేయి కడుగుతారు. శరీరం ఇక్కడే ఉంటుంది. చూపు ఎక్కడో ఉంటుంది. మనసు ఇంకో చోట ఉంటుంది. వాహనానికి పెట్రోల్ కొట్టించినంత సేపు కూడా ఆగరు. అంత వేగంగా భోజనం పూర్తిచేస్తారు. కానీ భోజనం తినేటప్పుడు స్పృహ, జాగరూకత అవసరం. మనం ఏం తింటున్నాం? ఎందుకు తింటున్నాం? ఎంత అవసరం అన్న విషయాల పట్టింపు అవసరం. మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచి ఉంది, మీకు ఎలా అనిపిస్తోంది? వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్దిపూర్వకంగా తినడాన్ని సూచిస్తాయి.
జాగరూతక లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్ధం అనే ఇంద్రియాల పరస్పర చర్య. మిమ్మల్ని ఆగమాగం తినకుండా, ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా జాగరూకతతో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది. ఆనందాన్ని తెచ్చి పెడుతుంది. ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు. మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా తినడమే.
రౌండ్‌గ్లాస్ సంస్థ గ్లోబల్ హెడ్, మెంటల్ హెల్త్ ఎక్స్‌పర్ట్ ప్రకృతి పోద్దార్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. మీరు క్రమంగా జాగరూకతతో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ సూచించారు.
1. మీ ఉద్దేశంపై అవగాహన ఉండాలి
మీరు ఎప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి. అంటే అందుకు గల ఉద్దేశాన్ని గుర్తంచండి. నిజంగా ఆకలిగా ఉందా? లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరికా? లేక మీకోసం ఆ వంటకం చేసి వ్యక్తిని గౌరవించడానికా? బుద్ధిపూర్వకంగా, జాగరూకతగా ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించగలుగుతారు. ఇది మీరు మీ ఫుడ్ ఎంపికను తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది.
2. జాగ్రత్తగా ఉండండి
మీరు ఏం తింటున్నారో గమనించండి. ఎంత తింటున్నారో గమనించండి. అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరు ఏం తింటున్నారో అవగాహన ఉండి దానిని మెచ్చుకోవడం అనేది జాగరూకతతో తినడంలో ముఖ్యం. రౌండ్‌గ్లాస్ మైండ్‌ఫుల్‌నెస్ టీచర్ విశ్వపాణి దీనిపై మాట్లాడుతూ ‘మనం సహజంగా మన జీవితాలను ఆటోపైలట్ మోడ్‌లో ఉంచుతాం. ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం. గమనించడం తెలియకపోతే అనందించడం మరిచిపోతాం. మెచ్చుకోవడం, ఆనందించడం లేకపోతే ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం..’ అని అన్నారు.
3. ఇంద్రియాలకు పనిచెప్పండి
మీ కళ్లతో చూస్తూ తినండి. చెవులతో వింటూ తినండి. అలాగే మీ ముక్కుకూ, నోటికీ పని చెప్పండి. మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నింటినీ నిమగ్నం చేయండి. మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి. ఆ సువాసలను ఆస్వాదించండి. ప్రతి ముద్దనూ, నమలడాన్నీ ఆనందించండి.
4. ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్‌లోకి చేరింది?
మీరు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్‌లో వచ్చి చేరింది? ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయం తీసుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రైతుల చరిత్ర ఏంటి? దానిని ఎవరు పండించారు? ఎంత మంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్‌లో చేరింది? వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి.
బుద్దిపూర్వక లేక జాగరూకతతో కూడిన భోజనం మీరు మరింత బాధ్యతాయుతంగా చేస్తుంది. మీరు పోషకాహారాన్ని ఎంచుకోవడంలో సహాయపడుతుంది. అది మీకు, ఈ విశ్వానికి మేలు చేస్తుంది. మైండ్‌ఫుల్ ఈటింగ్ అనేది అభ్యాసం. ఓపికతో మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. పరిపూర్ణత గురించి పట్టింపు అవసరం లేదు. ఈ క్షణంలో మనసు లగ్నం చేయడమే. దానిపై ఎలాంటి తీర్పూ అవసరం లేదు.
టాపిక్