Microplastics in Beauty Products: బ్యూటీ ప్రొడక్ట్స్‌లో మైక్రో ప్లాస్టిక్స్.. జాగ్రత్త తీసుకోకపోతే చర్మ సమస్యలు
Microplastics in Beauty Products: బ్యూటీ ప్రొడక్ట్స్‌లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తీవ్రమైన చర్మ సమస్యల ముప్పు వాటిల్లుతుంది. అసలు మీరు వాడే సౌందర్య ఉత్పత్తుల్లో ఏమున్నాయో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా?
అందంగా కనిపించాలని ఎంతో మంది ఆరాటం. ఆ ఆరాటమే ఎన్నో చర్మ సమస్యలకు కారణం అవుతుంది. మార్కెట్లో దొరికే ఎన్నో కాస్మెటిక్స్ లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్టు అధ్యయనాలు బయటపెట్టాయి. కేవలం 5 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండే మైక్రో ప్లాస్టిక్‌లు సౌందర్య ఉత్పత్తుల్లో ఉన్నట్టు నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఫేస్ వాష్ ఉత్పత్తుల్లో, ఫేషియల్ స్క్రబ్‌లలో ఈ మైక్రోప్లాస్టిక్ లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. కంటికి కనిపించని ఈ మైక్రో ప్లాస్టిక్ మన చర్మం, తద్వారా మన సంపూర్ణ ఆరోగ్యంపైనే తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
ఆందోళనలను పెంచుతుంది
న్యూఢిల్లీకి చెందిన టాక్సిక్స్ లింక్ సంస్థ చేసిన అధ్యయనంలో తొలిసారి మనదేశంలో వినియోగిస్తున్న కాస్మెటిక్ ఉత్పతుల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్టు తేలింది. ఈ అధ్యయనంలో 50 శాతం ఫేస్ వాష్‌లలో, 67 శాతం స్క్రబ్‌లలో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించారు. చివరికి టూత్ పేస్టులో కూడా ఈ మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్టు కనిపెట్టారు. ఇవి చిగుళ్ల మధ్య ఇరుక్కుని అక్కడ తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే అవకాశం ఉంది. కాస్మెటిక్స్ వాడకం ద్వారా గాలిలోకి విడుదలయ్యే మైక్రో ప్లాస్టిక్స్ ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి అక్కడ హానికరమైన మార్పులకు కారణం అవుతుంది.
మైక్రోప్లాస్టిక్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. అవి చర్మ రంధ్రాలలో సులభంగా చేరుతాయి. ఇలా చేరితే అవి చర్మ రంధ్రాల్లోనే బ్యాక్టిరియా పెరిగేలా చేస్తాయి. ఇది మొటిమలతో పాటూ ఇతర సమస్యలకు దారితీస్తుంది.
సూక్ష్మరంధ్రాలలో మైక్రోప్లాస్టిక్‌లు పేరుకుపోవడం వల్ల చర్మానికి సంబంధించిన సహజ సమతుల్యత దెబ్బతింటుంది. చర్మ రంధ్రాల్లో ఇరుక్కుపోయిన మైక్రో ప్లాస్టిక్ వల్ల చర్మంపై దురద, ఎరుపుదనం, చికాకు ఎక్కువవుతాయి. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే అది చివరకు తీవ్రమైన చర్మ సమస్యలు ఏర్పడే ముప్పుంది.
ప్రపంచవ్యాప్తంగా కాస్మెటిక్ ఉత్పతుల్లో మైక్రో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2017లో మైక్రో ప్లాస్టిక్‌లు ఉన్న ఉత్పత్తుల తయారీని అమెరికా నిషేధించింది. 2018 నుంచి మైక్రోప్లాస్టిక్ లు ఉండే టాయిలెట్ క్లీనర్ల ఉత్పత్తిని కూడా నిషేధించింది. అమెరికాతో పాటూ స్వీటన్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఐస్ లాండ్, ఐర్లాండ్ వంటి దేశాల్లో కూడా వీటిపై నిషేధం విధించారు. మనదేశంలో మాత్రం ఇంకా మైక్రో ప్లాస్టిక్‌ల వాడకాన్ని నిషేధించలేకపోతున్నారు.