Meditation tips for students: ఎగ్జామ్స్‌లో సక్సెస్ కోసం ఈ 8 మెడిటేషన్ టిప్స్
Meditation tips for students: ఎగ్జామ్స్ టైమ్‌లో విద్యార్థులు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. సక్సెస్‌ఫుల్‌గా పరీక్షలు పూర్తిచేయొచ్చు. అందుకు వీలుగా ఈ 8 టిప్స్ ఆచరించాలి.
Meditation tips for students: మెడిటేషన్ చూడటానికి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొత్తలో కష్టంగా కూడా ఉంటుంది. పరీక్షల కాలంలో విద్యార్థులు ఏకాగ్రత పెంచుకునేందుకు, ఒత్తిడి తగ్గించుకునేందుకు ధ్యానం ఆచరించడం వల్ల మానసికంగా బలంగా ఉంటారు. మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేందుకు ఈ ప్రక్రియను అనుసరించండి.
1. ప్రశాంతంగా ఉన్న చోటు ఎంచుకోండి
దాదాపు పరీక్షల కాాలంలో తెల్లవారుజామునే మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. లేదంటే రాత్రి పొద్దుపోయే వరకూ సాగుతుంది. రాత్రి సమయంలో కంటే తెల్లవారుజామున మీ మెదడు చురుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు ప్రిపరేషన్‌కు ముందు ధ్యానం చేయడానికి ఆసక్తి కూడా ఉంటుంది. శబ్దాలు కూడా ఎక్కువగా ఉండవు. ఇంట్లో ఒక చోట ప్రశాంతంగా ఉండే ఒక ప్రాంతంలో, లేదా మీకు నచ్చిన చోటు ఎంచుకుని ధ్యానానికి కూర్చోండి.
2. సమయం నిర్ధేశించుకోండి..
ధ్యానం మీకు కొత్తయితే ఎంతసేపు చేయాలన్న అంశం కంగారు పెడుతుంది. ఇక్కడ సమయం ముఖ్యం కాదు. మీరు ఆరంభించడమే ముఖ్యం. చాలాసార్లు ఇప్పటికే ధ్యానం చేయడం ప్రారంభించి వదిలేసి ఉంటారు. అందువల్ల కొత్తలో ఒక 5 లేదా 10 నిమిషాల సమయం పెట్టుకోండి చాలు. ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ సమయాన్ని పెంచుకోవచ్చు.
3. మీ శరీర భంగిమ ఇలా
మీరు నేలపై కూర్చోవచ్చు. లేదా కుర్చీలో అయినా పరవాలేదు. ధ్యానం సులువుగా సాగేందుకు మీరు నేలపై కూర్చొని కాళ్లు ముడుచుకోండి. ఏ భంగిమ అయినా పరవాలేదు. మీరు స్థిరమైన పొజిషన్‌లో కాసేపు కూర్చోగలిగితే చాలు.
4. శ్వాసపై ధ్యాస
మీ మనస్సును మీ శ్వాసపై లగ్నం చేయండి. మీరు పీల్చుకుంటున్న గాలి ఎలా లోపలికి వెళుతోంది.. ఎలా బయటకు వస్తోంది గమనిస్తూ ఉండండి. ధ్యానం అంటేనే శ్వాసపై ధ్యాసగా గుర్తించండి. నెమ్మదిగా గాలి పీల్చుకుని నాలుగైదు సెకెండ్లపాటు ఆ గాలిని అలాగే ఊపిరితిత్తుల నిండా ఆపి.. మళ్లీ నిధానంగా వదలండి. వదిలిన తరువాత కూడా అదే స్థితిలో నాలుగైదు సెకెండ్లు ఉండండి. ఇదే ప్రక్రియను రిపీట్ చేస్తూ ఉండండి. ఇది ప్రాక్టీస్ అయితే మీరు శ్వాస తీరును గమనిస్తూనే మీ మనస్సును మీ నుదిటిపై లాక్ చేసేస్తారు.
5. పరధ్యానం వద్దు
మీరు ధ్యానం కోసం కూర్చున్నా సరే మీ మనసు ఎక్కడికో పరుగులు పెడుతుంది. మీరు చాలాసార్లు ఇది గమనించి ఉంటారు. అందుకే మీరు ధ్యానంపై ఎక్కువ సేపు దృష్టి పెట్టలేరు. ఇది గమనిస్తే మీరు తిరిగి కొద్ది సెకండ్లలోనో, నిమిషాల్లోనో తిరిగి మీరు మెడిటేషన్‌పై దృష్టి పెట్టడానికి వీలుంటుంది.
6. దయతో ఉండండి..
ధ్యానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీ మనసు పరిపరివిధాలుగా పరుగెడుతుంటే మిమ్మల్ని మీరు తిట్టుకోకండి. మీ పట్ల మీరు దయతో ఉండండి. మీ మనస్సు వేరే అంశాలపై నిమగ్నమైతే మిమ్మల్ని మీరు కోల్పోతున్నట్టు భావిస్తుండవచ్చు. మీ ఆలోచనలను ఆపుకోలేకపోతున్నానని ఆందోళన చెందుతుండవచ్చు. కానీ మీరు మెడిటేషన్ చేస్తున్నది మీ మనస్సును లగ్నం చేయడానికేనని గుర్తించండి. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మనస్సు లగ్నం చేయడం సాధ్యమవుతుంది.
7. మీ శరీరం స్పందిస్తున్న తీరు గమనించండి
మీకు ధ్యానంపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ మీ శరీరం రిలాక్స్ అవుతున్న తీరు గమనించండి. ఒకవేళ చుట్టూ శబ్దాల వల్ల మీకు అంతరాయం కలిగితే వదిలేయకండి. తిరిగి ప్రయత్నించండి. మీ ఆలోచనలు, భావోద్వేగాలకు ఎలా బ్రేక్ పడిందో గమనించండి.
8. సౌకర్యమైన సమయాల్లో ప్రయత్నించండి
మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు కదా.. దీనిని క్రమం తప్పకుండా ఆచరించండి. ఉదయమో, రాత్రి పూటో మాత్రమే చేయాలని ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా మీకు సౌకర్యవంతమైన సమయాల్లో ధ్యానం చేస్తూ ఉండండి. పరీక్షల సమయంలో మీకు ప్రశాంతత చాలా అవసరం. అందువల్ల ఎప్పుడు వీలున్నా ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి.