Masala Egg omelette: మసాలా ఎగ్ ఆమ్లెట్, బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ
Masala Egg omelette: ఉదయాన ప్రోటీన్ నిండిన గుడ్లతో బ్రేక్ ఫాస్ట్ చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజంతా శరీరానికి శక్తి అందుతుంది. మసాలా ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
Masala Egg omelette: కోడిగుడ్లతో చేసిన ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలా అని ఎప్పుడూ ఒకేలా ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్లు, ఎగ్ బుర్జీ వంటివి తినడం వల్ల బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఒకసారి డిఫరెంట్ గా మసాలా ఎగ్ ఆమ్లెట్ తిని చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. రెండు గుడ్లతోనే ఒక మనిషికి సరిపడా మసాలా ఎగ్ ఆమ్లెట్ ను చేసుకోవచ్చు. దీన్ని కేవలం ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ మసాలా ఎగ్ ఆమ్లెట్ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
మసాలా ఎగ్ ఆమ్లెట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
కారం - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక స్పూన్
ధనియాల పొడి - అర స్పూను
మసాలా ఎగ్ ఆమ్లెట్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. ఆ నూనెలో ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
3. అవి సగం వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్లను కొట్టి బాగా గిలక్కొట్టాలి.
4. అందులోనే వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తో పాటు కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాలపొడి, కారం వేసి బాగా గిలక్కొట్టాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి.
6. మీడియం మంట మీద పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి.
7. అంతే మసాలా ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇది ఒక మనిషికి పొట్ట నిండేలా వస్తుంది. రుచి అదిరిపోతుంది. పిల్లలకు ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పొచ్చు.
కోడిగుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని అధ్యయనాలు నిరూపించాయి. ఎన్నో దేశాల ప్రభుత్వాలు ప్రతిరోజూ కోడిగుడ్డును తినమని ప్రోత్సహిస్తున్నాయి. గుడ్లలో విటమిన్లు, ఐరన్, జింక్, పొటాషియం అధికంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైనవి. బ్రేక్ ఫాస్ట్ లో కోడిగుడ్డుతో వండిన ఆహారాలు తినడం వల్ల ఆ రోజంతా మీరు శక్తివంతంగా చురుగ్గా ఉంటారు. ఇది శరీరాన్ని బలోపేతం చేస్తుంది. దీనిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. మనకు ఈ మంచి కొలెస్ట్రాల్ చాలా అవసరం. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి మంచి కొలెస్ట్రాల్ మేలు చేస్తుంది. కాబట్టి గుడ్డుతో చేసిన రెసిపీలను ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి.
టాపిక్