Healthy Tea tips: టీ తాగడం మానలేరా? ఇలా టీ చేసుకుంటే మెడిసిన్‌లా పనిచేస్తుంది-make your tea healthy with these ingredients and tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Tea Tips: టీ తాగడం మానలేరా? ఇలా టీ చేసుకుంటే మెడిసిన్‌లా పనిచేస్తుంది

Healthy Tea tips: టీ తాగడం మానలేరా? ఇలా టీ చేసుకుంటే మెడిసిన్‌లా పనిచేస్తుంది

Koutik Pranaya Sree HT Telugu
Sep 07, 2024 05:00 PM IST

Healthy Tea tips: టీ తాగని వారు మన దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. టీ శరీరానికి అనారోగ్యకరమని ఎంత చెప్పినా టీ తాగడం మానలేరు. టీని ఆరోగ్యంగా చేయడానికి కొన్ని చిట్కాలు పాటించారంటే టీ ఆస్వాదిస్తూ ఆరోగ్యం పొందొచ్చు.

ఆరోగ్యాన్నిచ్చే టీ
ఆరోగ్యాన్నిచ్చే టీ (Shutterstock)

మన దేశంలో టీ ఒక సాధారణ పానీయం మాత్రమే కాదు. ఇది కోట్లాది మంది భారతీయుల భావోద్వేగం☕. ఎండాకాలంలో కూడా వేడి వేడిగా పొగలు గక్కే టీ తాగడం మనకే సాధ్యం. అయితే మనం రోజూ తాగే టీ మన శరీరానికి ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. ఈ విషయం తెలిసినా కూడా ఈ అలవాటు మానుకోలేరు. అందుకే తాగే టీనే కాస్త ఆరోగ్యంగా మార్చేస్తే మేలు కదా. టీ ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్నీ పొందొచ్చు. అదెలాగంటే..

ఎక్కువ సేపు వేడి చేయొద్దు

స్ట్రాంగ్ టీ కావాలనీ, రుచిగా ఉండాలనీ టీని ఎక్కువ సేపు మరగబెడతారు. అలా చేయడం వల్ల టీలోని యాంటీఆక్సిడెంట్లు తొలగిపోయి ఎక్కువ మొత్తంలో టానిన్లను విడుదల చేస్తుంది. ఇది మన దంతాలకు, కడుపుకు అస్సలు మంచిది కాదు. కాబట్టి టీని తక్కువ సేపు మరిగిస్తే కాస్త మేలు.

పంచదారకు బదులుగా ఇవి

తీపిగా చేయడానికి చక్కెర, బెల్లం ఉపయోగిస్తాం. చక్కెర హానికరమైన ప్రభావాలు మనందరికీ తెలుసు. కానీ ఆయుర్వేదం ప్రకారం, టీలో బెల్లం వేయడమూ మంచిది కాదు. బదులుగా ముడి చక్కెర లేదా రా షుగర్ , పటిక బెల్లం వాడొచ్చు. వీటితో కాస్త ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టీ ఆస్వాదించవచ్చు.

టీ తాగే సమయం

మనం సాధారణంగా తప్పు సమయంలో టీ తాగుతాం. దీనివల్ల శరీరానికి ఎక్కువ హాని. ఉదయం లేవగానే లేదా ఏదైనా తినగానే టీ తాగే అలవాటుంటే మార్చుకోవాలి. అల్పాహారం, భోజనం చేశాక కనీసం రెండు మూడు గంటలు టీ తాగకూడదు. లేదంటే ఆహారం లోని పోషకాలు శరీరానికి చేరవు.

ఇవి కలిపితే ఆరోగ్యం

టీని ఆరోగ్యంగా మార్చడానికి దాంట్లో కొన్ని మసాలా దినుసులు వేయొచ్చు. ఇవి టీ రుచిని పెంచడంతో పాటు, టీని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. యాలకులు, లవంగాలు, అల్లం, దాల్చినచెక్క, సోంపు, అతిమధురం లాంటివి టీలో వేసి మరిగించొచ్చు. ఇవన్నీ మీ శరీరానికి ఔషధంగా పనిచేస్తాయి. ఒకసారి ఆయుర్వేద నిపుణులను కలిసి మీ శరీరానికి నప్పే ఏదైనా దినుసును రోజూవారీ టీ లో చేర్చుకుని తాగొచ్చు.

ఎక్కువ ప్రమాదమే

మీరు ఎంత టీ ప్రియులైనా సరే పరిమితంగానే తాగాలి. దాన్నెంత ఆరోగ్యకరంగా మార్చినా సరే అతి మాత్రం చేటు చేస్తుంది. కాబట్టి రోజుకు రెండు కప్పులను మించి టీ తాగడం అస్సలు మంచిది కాదని గుర్తుంచుకోండి.

Whats_app_banner