Vankaya Pachadi: కాల్చిన వంకాయతో ఇలా స్పైసీ చట్నీ చేసేయండి, ఇది మన పూర్వీకుల రెసిపీ
Vankaya Pachadi: కాల్చిన వంకాయతో టేస్టీ చట్నీ చేసుకోవచ్చు. దీన్ని మన పూర్వీకుల నుంచి చేసుకుంటున్నారని చెబుతారు. ఇక్కడ మేము వంకాయ టమాటా కలిపి ఎలా చట్నీ చేయాలో ఇచ్చాము.
Vankaya Pachadi: వంకాయతో చేసుకున్న వంటకాలు మీకు నచ్చకపోతే ఒకసారి స్పైసీ వంకాయ టమాటా పచ్చడి ప్రయత్నించండి. ఇది కాల్చిన వంకాయలతో చేసే రెసిపీ. పూర్వకాలం నుండి కాల్చిన వంకాయతో చేసే చట్నీ ఎంతో ఫేమస్. ఇప్పటికీ గ్రామాల్లో బొగ్గులపై కాల్చిన వంకాయలతో ఈ చట్నీ చేస్తారు. ఈ వంకాయ చట్నీలో టమోటాలు కలిపి చేస్తే రుచి అదిరిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. వంకాయ చట్నీ రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము తెలుసుకోండి.
కాల్చిన వంకాయతో చట్నీ రెసిపీకి కావలసిన పదార్థాలు
వంకాయలు - అరకిలో
టమాటాలు - పావు కిలో
ఇంగువ - చిటికెడు
నూనె - తగినంత
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ఆవాలు - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
మినప్పప్పు - రెండు స్పూన్లు
మెంతులు - పావు స్పూన్
ఎండుమిర్చి - రెండు
పచ్చిమిర్చి - ఎనిమిది
కాల్చిన వంకాయ చట్నీ రెసిపీ
1. వంకాయలను కాడలతో సహా శుభ్రంగా కడగాలి.
2. మీకు ఇంట్లో బొగ్గుల పొయ్యి ఉంటే ఆ బొగ్గుల మీద ఈ వంకాయలను కాల్చండి.
3. లేదా గ్యాస్ బర్నర్ పై నేరుగా కాల్చుకోవచ్చు. తొక్క కాస్త నల్లగా మారేవరకు కాల్చుకోవాలి.
4. తర్వాత వాటిని చల్లార్చి పైన తొక్కను తీసేయాలి.
5. ఈ కాల్చిన వంకాయలు మెత్తగా మారతాయి.
6. వాటిని చాకుతో కోసి లోపల పురుగులు లేకుండా చూసుకోవాలి.
7. ఈ వంకాయలను చేతితో మెదిపితే మెత్తగా అయిపోతాయి. అలా మెదిపి ఒక గిన్నెలో వేసుకోవాలి.
8. టమోటాలను కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
9. ఆ నూనెలో మెంతి గింజలు, మినుములు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి.
10. అందులోనే టమోటో ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి.
11. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించాలి.
12. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ టమోటోలను మిశ్రమాన్ని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.
13. ఈ మిశ్రమాన్ని మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకుంటే టేస్టీగా ఉంటుంది.
14.ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి. ఆ నూనెలో కచ్చాపచ్చాగా రుబ్బుకున్న టమోటా మిశ్రమాన్ని వేయండి.
15. అలాగే ముందుగా మెదిపి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి బాగా కలుపుకోండి.
16. పైన కొత్తిమీర తరుగును చల్లుకోండి. ఇది బాగా దగ్గరగా మగ్గాక స్టవ్ కట్టేయండి. అంతే టేస్టీ టేస్టీ కాల్చిన వంకాయ పచ్చడి రెడీ అయినట్టే.
17. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచి వేరు.
18. సాధారణ పచ్చళ్ళతో పోలిస్తే వంకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.
వంకాయ ఉపయోగాలు
వంకాయ రెసిపీలు ఎంతోమంది తినడానికి ఇష్టపడరు. నిజానికి వంకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు తినాల్సిన ఆహారాల్లో వంకాయ ఒకటి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా అడ్డుకుంటుంది. మధుమేహం రాకుండా నిరోధిస్తుంది. దీనిలో ఫోలేట్, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి3, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఉన్న కొవ్వులను కరిగిస్తుంది. శరీరంలోని అవయవాల అన్నిటికీ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు వంకాయను తినడం ప్రారంభించండి.