Roti Roll: మిగిలిన చపాతీలతో ఇలా రోటీ రోల్ చేసేయండి, చాలా సింపుల్ రెసిపీ
Roti Roll: ఇంట్లో చపాతీలు మిగిలిపోతే ఇలా టేస్టీ రోటీ రోల్ చేసేయండి. కూరగాయలతో, పోషకాలతో రుచిగా ఉండే సింపుల్ రెసిపీ ఇది. దీని తయారీ చూసేయండి.
రోటీ రోల్ రెసిపీ
చపాతీలు మిగిలిపోతే ఆనందించాల్సిందే. ఎందుకంటే దాంతో ఎంతో రుచిగా ఉండే రోటీ రోల్ చేయొచ్చు. ఉదయం అల్పాహారంలోకి ఇలా చేసిస్తే ఒక్క చపాతీతోనే కడుపు నిండిపోతుంది. ఎంతో రుచిగానూ తిన్నట్టుంటుంది. దాన్ని సింపుల్ గా, రుచిగా ఎలా చేయొచ్చో చూడండి.
రోటీ రోల్ కోసం కావాల్సిన పదార్థాలు:
2 చపాతీలు
చెంచాడు టమాటా సాస్
1 ఉల్లిపాయ
1 టమాటా
సగం ముక్క కీరదోస
పన్నీర్ (ఆప్షనల్)
1 క్యాప్సికం
కాస్త చీజ్ తురుము
సగం టీస్పూన్ మిరియాల పొడి
కొద్దిగా ఉప్పు
చెంచాడు బటర్
రోటీ రోల్ తయారీ విధానం:
- కావాల్సిన పదార్థాలన్నీ ఒక్క చోట పెట్టుకుంటే రోటీ రోల్ తయారీ సగం పూర్తయినట్లే.
- పదార్థాలన్నీ ఒద్దిగ్గా పెట్టుకోవడమే కాస్త పనంతే. దానికోసం చపాతీని పీజ్జా లాగా నాలుగు సమ భాగాలుగా అనుకోండి.
- ఒక భాగంలో కాస్త టమాటా సాస్ రాయండి. మీద ఉల్లిపాయ ముక్కలు పెట్టండి.ః
- మరో భాగంలో పన్నీర్ సన్నటి ముక్కలు లేదా తురుము వేసుకోండి.
- మూడో భాగంలో టమాటా ముక్కలు, కీరదోస ముక్కలు, క్యాప్సికం ముక్కలు గుండ్రంగా తరిగినవి పెట్టుకోండి.
- చివరి నాలుగో భాగంలో మీకిష్టం ఉన్నంత చీజ్ తురుముకోండి. మీద కాస్త మిరియాల పొడి, ఉప్పు చల్లుకోండి.
- ఇప్పుడు ఒక భాగం దగ్గర చాకుతో గాటు పెట్టండి. ఇక ఒక దాని మీద మరో భాగం వచ్చేలా చపాతీని మడచాలి.
- పెనం పెట్టుకుని కాస్త బటర్ వేసుకుని వేడెక్కాక ఈ రోటీని పెట్టుకుని రెండు వైపులా క్రిస్పీగా కాల్చుకుంటే చాలు. టేస్టీ రోటీ రోల్ రెడీ.
- ఇంకా సింపుల్ గా చేయాలనుకుంటే రోటీ రెండు సగ భాగాలనుకోండి. ఒక భాగంలో ముందు టమాటా సాస్ రాయండి. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, టమాటా, కీరదోస ముక్కలు పెట్టుకోండి.
- మీద కాస్త చీజ్, పన్నీర్ తురుముకుని దోసలాగా సగం మడిచేయండి. దీన్ని పెనం మీద బటర్ వేసుకుని కాల్చుకుంటే సరిపోతుంది.