Breakfast recipe: టేస్టీ మెంతికూర పూరీలు, ఈ కొలతలతో చేస్తే నూనె పీల్చవు-make methi puri with these measurements wont absorbs oil ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe: టేస్టీ మెంతికూర పూరీలు, ఈ కొలతలతో చేస్తే నూనె పీల్చవు

Breakfast recipe: టేస్టీ మెంతికూర పూరీలు, ఈ కొలతలతో చేస్తే నూనె పీల్చవు

Koutik Pranaya Sree HT Telugu
Oct 06, 2024 06:30 AM IST

Breakfast recipe: మెంతికూర ఫ్లేవర్ తో పూరీలు చేసి చూడండి. రుచి కొత్తగా ఉంటుంది. తాజా మెంతికూరతో లేదంటే కసూరీ మేతీతోనూ వీటిని చేసుకోవచ్చు. మెంతికూర పూరీల రెసిపీ ఎలాగో చూడండి.

మెంతికూర పూరీలు
మెంతికూర పూరీలు

అల్పాహారంలోకి పూరీలు అప్పుడప్పుడు తినొచ్చు. కాస్త జిహ్వ తృప్తి ఉంటుంది. అయితే ఎప్పుడూ ఒకేలా చేసేవి కాకుండా కాస్త ఫ్లేవర్ మారేలా మెంతికూరతో పూరీలు చేసి చూడండి. తాజా మెంతి కూర లేకపోతే కసూరీ మెంతిని వాడైనా చేసుకోవచ్చు. వాటి తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.

మెంతికూర పూరీల తయారీకి కావాల్సినవి:

ఒకటిన్నర కప్పు గోదుమపిండి

ఒక కట్ట మెంతికూర (సన్నగా తరుగుకోవాలి) లేదా 4 చెంచాల కసూరీ మేతీ

సగం చెంచా కారం

సగం చెంచా గరం మసాలా

సగం చెంచా సన్నగా తరిగిన అల్లం ముక్కలు

సగం చెంచా జీలకర్ర పొడి

సగం చెంచా ధనియాల పొడి

పావు చెంచా వెల్లుల్లి ముద్ద

పావు టీస్పూన్ పసుపు

పావు టీస్పూన్ వాము

తగినంత ఉప్పు

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

మెంతి పూరీ తయారీ విధానం:

1. ముందుగా మెంతికూరను శుభ్రంగా కడుక్కుని సన్నగా కట్ చేసుకోవాలి. ఒకవేళ కసూరీ మేతీ వాడితే కొద్దిగా నీళ్లతో కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంతో అది మెత్తగా అయిపోతుంది.

2. ఇప్పుడు కడాయి లేదా పాత్ర తీసుకుని అందులో మెంతి కూర వేసుకోవాలి. అందులో పావు కప్పు నీళ్లు పోసుకుని మూత పెట్టి రెండు నిమిషాలు ఆకుని మగ్గించుకోవాలి.

3. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, మెంతికూర లేదా నానబెట్టుకున్న కసూరీ మేతీ, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, వాము, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముద్ద, చెంచా నూనె, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి.

4. ఈ పిండిలో నీళ్లు పోసుకుంటూ గట్టిగా పూరీలు ఒత్తుకునే వీలుగా కలుపుకోవాలి.

5. కలుపుకున్న పిండి మీద మూత లేదా తడిగుడ్డ కప్పేసి కనీసం పావుగంట పక్కన పెట్టుకోవాలి.

6. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పిండి వేసుకుంటూ పూరీలు ఒత్తుకోవాలి.

7. కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని వేడెక్కాక పూరీలు వేసుకోవాలి.

8. ఒక వైపు పొంగాక మరో వైపు వేసుకొని సన్నం మంట మీద ఉంచుకోవాలి. కాస్త రంగు మారాక తీసుకుంటే సరిపోతుంది.

9. ఈ పూరీలు పల్లీ చట్నీతో లేదా ఆలూ కర్రీతో అయినా సర్వ్ చేయొచ్చు.

మెంతికూరను రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రుచి పెరగడంతో పాటూ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీంట్లో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లేవిన్, కాపర్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, బి6, విటమిన్ సి లతో పాటూ చాలా పోషకాలుంటాయి. దీంట్లో పీచు శాతమూ ఎక్కువే. కొలెస్ట్రాల్ తగ్గించడానికి మెంతికూర సాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయుల్ని కూడా నియంత్రిస్తుంది. కాబట్టి మెంతికూరతో వీలైనన్ని రకాల వంటలు చేయడానికి ప్రయత్నించండి.

Whats_app_banner