Baby bathing: నెలల వయసు పిల్లలకు స్నానం చేయించాలంటే భయమా? ఇలా అయితే చాలా ఈజీ
Baby bathing: చిన్నపిల్లలకు స్నానం పోయించడం సవాలే. చాలా మందికి స్నానం పోయడం రాదు కూడా. నెలల వయసున్న పిల్లలకు స్నానం పోయడం సులువయ్యేలా కొన్ని గ్యాడ్జెట్లున్నాయి. అవేంటో చూడండి.
నెలల వయస్సున్న పిల్లలకు స్నానం చేయించడం అందరికీ రాదు. అలాగనీ ప్రతిసారీ ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. ఏ అనుభవం లేని వారు కూడా పిల్లలకు స్నానం సులువుగా చేయించొచ్చు. దానికోసం ఈ కింద ఇచ్చిన సింపుల్ గ్యాడ్జెట్లు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అవేంటో చూడండి.
బాత్ మ్యాట్:
పిల్లలు కూర్చోవడం మొదలు పెట్టాక వాళ్లని పడుకోబెట్టి స్నానం చేయించడం కష్టమే. ఆరేడు నెలల నుంచి కూర్చోబెట్టి స్నానం చేయించేటప్పుడు ఈ బాత్ మ్యాట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పీట మీద, స్టూల్ మీద వాళ్లను కూర్చోబెడితే కింద పడిపోతారనే భయంతో బలం పెట్టి స్నానం పోయలేం. అదే ఈ బాత్ మ్యాట్ మీద కూర్చోబెడితే జారిపోతారనే భయం ఉండదు. కొత్తవాళ్లయినా సులభంగా పిల్లల్ని పట్టుకోవచ్చు.
బేబీ షవర్ క్యాప్:
మిగతా శరీరం అంతా సబ్బు కాస్త భయపడుతూ రాసినా, తలకు సబ్బు రాయాలంటే భయంగా ఉంటుంది. తల మీద నీళ్లు పోస్తే పిల్లలు మింగేస్తారనే భయం ఉంటుంది. అలాంటప్పుడు ఈ బేబీ షవర్ క్యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తలకు దీన్ని పెట్టేసి నీళ్లు పోస్తే నీళ్లు ముఖం మీద పడవు. నీళ్లు బయట పడేలా ఇది డిజైన్ చేస్తారు. దాంతో నీరు బయటకు దూరంగా పడిపోతాయి. సబ్బు కళ్లలో పడదు.
బేబీ బేతర్: (Baby bather)
ఆరు నెలలకన్నా చిన్న పిల్లలను సాధారణంగా కాళ్ల మీద పడుకోబెట్టి స్నానం పోస్తారు. కానీ అది కష్టం అనిపిస్తే ఈ బేబీ బేతర్ మీకొక వరం అనుకోండి. వీటి ధర అయిదు వందలు కూడా ఉండదు. పార్కుల్లో జారుడు బండ లాగా ఉంటుందింది. చిన్న పిల్లలను దీంట్లో పడుకోబెట్టి హాయిగా స్నానం పోసేయొచ్చు. నీళ్లని జారుకుంటూ కిందికి వెళ్లిపోతాయి. పిల్లలకూ సౌకర్యంగా ఉంటుంది.
బాత్ స్పాంజ్:
నెల లోపల పిల్లలకు స్పాంజి బాత్ చేయించేటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. సబ్బు నీళ్లలో ముంచి సులభంగా వాళ్ల ఒళ్లంతా తుడిచేయొచ్చు. ఇది చాలా మెత్తగా ఉండి పిల్లలకు సౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే స్నానం పోసేటప్పుడు ముఖానికి సబ్బు పెట్టడం భయం అనిపిస్తే దీంతో ఒకసారి తుడిచేస్తే సరిపోతుంది. దీంతో చర్మం మీద మృతకణాలూ తొలిగిపోతాయి. చాలా తేలికపాటి ఎక్ఫోలియేటర్ లాగానూ ఇవి పని చేస్తాయి.
బాత్ టాయ్స్:
పిల్లలకు స్నానం పోసేటప్పుడు దృష్టి మరల్చడానికి ఈ బాత్ టాయ్స్ పనికొస్తాయి. వాళ్లకు స్నానం పోసే నీళ్లలో ఈ బొమ్మలు వేశారంటే తేలుతూ ఉంటాయి. రంగుల్లో ఉండే వీటి మీద దృష్టి పడి స్నానం పోసేటప్పుడు ఇబ్బంది పెట్టరు.