Chicken Fry: నూనె అవసరం లేకుండా టేస్టీగా చికెన్ ఫ్రై ఇలా చేసేయండి, ఇది ఎంతో ఆరోగ్యకరం-make a tasty chicken fry without the need for oil recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Fry: నూనె అవసరం లేకుండా టేస్టీగా చికెన్ ఫ్రై ఇలా చేసేయండి, ఇది ఎంతో ఆరోగ్యకరం

Chicken Fry: నూనె అవసరం లేకుండా టేస్టీగా చికెన్ ఫ్రై ఇలా చేసేయండి, ఇది ఎంతో ఆరోగ్యకరం

Haritha Chappa HT Telugu
Sep 24, 2024 11:30 AM IST

Chicken Fry: చికెన్ ఫ్రై అంటే ఇష్టమా? కాకపోతే నూనె అధికంగా ఉంటుందని తినలేక పోతున్నారా? మీకోసమే ఇక్కడ నూనె లేకుండా చికెన్ ఫ్రై రెసిపీ చెప్పాము.

చికెన్ వేపుడు రెసిపీ
చికెన్ వేపుడు రెసిపీ

Chicken Fry: చికెన్ ఫ్రై అంటే నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టం. కానీ చికెన్‌ను వేయించాలంటే నూనె ఎక్కువ అవసరం పడుతుంది. ఆ నూనెను అధికంగా తినడం కూడా ప్రమాదమే. అందుకే ఎక్కువమంది చికెన్ ఫ్రై అప్పుడప్పుడు తినేందుకు ఇష్టపడతారు. ఇక్కడ మేము నూనె అవసరం లేకుండానే చికెన్ వేపుడు ఎలా చేయాలో చెప్పాము. అలాగని ఇది రుచిగా ఉండదు అనుకోకండి. నూనె వేసి వండే చికెన్ కన్నా ఇది రెట్టింపు రుచిని అందిస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు ఎలాగో తెలుసుకోండి.

చికెన్ ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు

చికెన్ ముక్కలు - కిలో

కొబ్బరి పాలు - అరకప్పు

ఉల్లిపాయలు - రెండు

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - అరకప్పు

పచ్చిమిర్చి - రెండు

పసుపు - అర స్పూను

కారం - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

లవంగాలు - ఐదు

యాలకులు - మూడు

దాల్చిన చెక్క - రెండు ముక్కలు

మిరియాలు - నాలుగు

జీలకర్ర - ఒక స్పూను

ధనియాలు - మూడు స్పూన్లు

అల్లం - ఒక ముక్క

వెల్లుల్లి రెబ్బలు - ఐదు

నిమ్మరసం - ఒక స్పూను

చికెన్ ఫ్రై రెసిపీ

1. నూనె లేకుండా చికెన్ ఫ్రై‌ను టేస్టీగా చేయవచ్చు.

2. నూనెకు బదులు ఇక్కడ మనము కొబ్బరి పాలను ఉపయోగిస్తాము.

3. మిక్సీ జార్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసి పొడి చేయండి.

4. అందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల ముక్కల్ని కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోండి. ఈ మొత్తం మసాలా మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్‌ను వేసి శుభ్రంగా కడగండి.

6. కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేయండి. లేదా ఫ్రిడ్జ్ లో పెట్టండి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొబ్బరి పాలను వేయండి.

8. కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడు చేసిన చికెన్‌ని కూడా వేయండి. మూత పెట్టి దాన్ని ఉడికించండి.

9. ఇది అరగంట వరకు బాగా ఉడుకుతుంది.

10. మసాలా పేస్ట్‌లోనే అన్నీ వేసాము కాబట్టి ప్రత్యేకంగా కూరలో ఏమీ వేయాల్సిన అవసరం లేదు.

11. ఇది దగ్గరగా ఫ్రై లాగా అయ్యే వరకు వేయించుకోవాలి.

12. తర్వాత పైన కరివేపాకులు, కొత్తిమీర తరుగు జల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.

13. రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. ఒక్కసారి దీన్ని మీరు తిని చూడండి. మీకు నచ్చడం ఖాయం.

ఈ చికెన్ ఫ్రై ఆరోగ్యకరమైన పద్ధతిలో వండాము. కాబట్టి ఎంత తిన్నా మంచిదే. ముఖ్యంగా కొబ్బరి పాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. చికెన్‌లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండూ కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా కొబ్బరి పాలలో వండిన ఏ వంట అయినా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రై చేసుకుని చూడండి. మీకు నచ్చడం ఖాయం.