Lunar Eclipse: రేపే చంద్రగ్రహణం, ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏం చేయకూడదు?-lunar eclipse tomorrow what should pregnant women not do during this eclipse ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lunar Eclipse: రేపే చంద్రగ్రహణం, ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏం చేయకూడదు?

Lunar Eclipse: రేపే చంద్రగ్రహణం, ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏం చేయకూడదు?

Haritha Chappa HT Telugu
Mar 24, 2024 06:00 AM IST

Lunar Eclipse: కొత్త ఏడాదిలో తొలి గ్రహణం వచ్చేస్తోంది. మార్చి 25న తొలి చంద్రగ్రహణం. ఆ రోజునే హోలీ పండుగ. గ్రహణ రోజున గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

చంద్ర గ్రహణం
చంద్ర గ్రహణం (Pixabay)

Lunar Eclipse: గ్రహణాలకు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహణ సమయంలో చేయకూడని పనులు, చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. చంద్రగ్రహణం అంటే సూర్యుడు, చంద్రుని మధ్యకి భూమి వచ్చినప్పుడు ఏర్పడే ఒక ఖగోళ సంఘటన. దీనివల్ల భూమి నీడ చంద్రుని ఉపరితలంపై పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు ఇలా చంద్రగ్రహణం వస్తుంది. భూమి నీడ చంద్రుపై పడి చంద్రుడు సరిగా కనిపించడు.

గ్రహణం కనిపిస్తుందా?

ఈ చంద్రగ్రహణం మన దేశంలో పెద్దగా కనిపించే అవకాశం లేదు. కానీ జపాన్, యూరోప్, అమెరికా దేశాల్లో మాత్రం దీన్ని చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నా అనేక సంస్కృతులలో గ్రహణానికి, గర్భిణీ స్త్రీలకు మధ్య అనుబంధం ఉన్నట్టు చెప్పుకుంటారు. ఆ సమయంలో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం చంద్రగ్రహణం రోజూ గర్భిణీ స్త్రీలు సురక్షితంగా ఉండాలని, లేకుంటే బిడ్డలకు కొన్ని సమస్యలు రావచ్చని అంటారు. అందుకే గర్భిణీ స్త్రీలను గ్రహణం సమయంలో పూర్తిగా ఇంట్లోనే ఉండమని సూచిస్తోంది జ్యోతిష్య శాస్త్రం.

గ్రహణ సమయంలో ఎక్కువ మంది గర్భిణీలు ఏది తినడానికీ, తాగడానికీ ఇష్టపడరు. కాబట్టి గ్రహణం మొదలవడానికి ముందే ఎక్కువ నీటిని గర్భిణీలు తాగాలి. గ్రహణం ముగిసే వరకు వారు తాగకూడదు అనుకుంటేనే ఇలా చేయాలి. దాహం వేస్తున్నా... నీళ్లు తాగకుండా ఉంటే డిహైడ్రేషన్ సమస్య మొదలు కావచ్చు. కాబట్టి గ్రహణం సమయంలో పట్టింపులు ఉన్న గర్భిణులు గ్రహణం మొదలవడానికి ముందే ఎక్కువ నీటిని తాగాలి.

గ్రహణం సమయంలో గర్భిణీలు ఎక్కువ ఆందోళనకు గురవుతారు. దీనికి కారణం పూర్వం నుంచి చెప్పే కొన్ని కథలు ఆ సమయంలో కొన్ని వస్తువులు ముట్టుకోకూడదని అంటారు. శరీరంపై గోక్కోకూడదని, కత్తులు పట్టుకోకూడదని, తలుపు గడియలు వేయకూడదని చెబుతారు. దీని వల్ల వారిలో చాలా ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఆ సమయంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎంత విశ్రాంతిగా ఉంటే అంత మంచిది.

గ్రహణం మొర్రి వస్తుందా?

నిజానికి గ్రహణ సమయంలో గర్భిణీలు తలుపున గడియలు, కత్తి పట్టుకోవడం, శరీరంపై గోక్కోవడం వల్ల గ్రహణం మొర్రి వస్తుందని ఎక్కడ శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించలేదు. కానీ పూర్వం నుంచి ఆ నమ్మకాలు అలానే ఉన్నాయి. కాబట్టి వాటిని నమ్మే వారి సంఖ్య చాలా ఎక్కువ. సాధారణ రోజుల్లో గర్భిణీలు ఎంత ప్రశాంతంగా ఉంటారో ఎలాంటి జీవితాన్ని గడుపుతారో.. గ్రహణ సమయంలో కూడా అలాంటి జీవితాన్ని గడపవచ్చు. తల్లికీ బిడ్డకు ఎలాంటి సమస్యలు రావు.

Whats_app_banner