Stress: 43 శాతంమంది భారతీయ టెక్కీలలో తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి… చెబుతున్న కొత్త అధ్యయనం
Stress: భారతీయ టెక్కీలు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు ఒక అధ్యయనం చెబుతోంది. దాదాపు 43% మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ కొత్త పరిశోధన తేల్చింది. వెన్నునొప్పి, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టు తెలిపింది.
Stress: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జీవితంపై ఎంతోమందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. వారు ఎక్కువ జీతాలు తీసుకుంటారని, వారానికి ఐదు రోజులే పని చేస్తారని, మిగతా రెండు రోజులు క్లబ్బులు, పబ్బులు, పార్టీలలో మునిగి తేలుతారని అంటారు. నిజానికి వాళ్లు ఒత్తిళ్ళలో కూరుకుపోతున్నట్టు ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. భారతీయ సాంకేతిక నిపుణులు ఎక్కువ గంటల పాటు పనిచేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్టు ఈ పరిశోధన తేల్చింది. దాదాపు 43 శాతం మంది ఇలా తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు ఈ కొత్త అధ్యయనం చెప్పింది.
ఉద్యోగులకు హెల్త్ కేర్ బెనిఫిట్స్ అందించే సంస్థ ‘ష్యూరిటీ వన్’. ఈ సంస్థ భారతీయ టెక్కీల ఆరోగ్యం పై అధ్యయనాన్ని నిర్వహించింది. భారతీయ సాంకేతిక నిపుణులు పని సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నట్టు తెలిపింది. మనదేశంలో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వారానికి 52 గంటల పాటు పనిచేస్తున్నారని, దాదాపు 50 శాతం మంది ఇలా పనిచేస్తున్నట్టు చెప్పింది అధ్యయనం.
టెక్కీలలో కనిపించే ఆరోగ్య సమస్యలు
భారతీయ సాంకేతిక నిపుణులలో కనీసం 55 శాతం మంది అర్ధరాత్రి పూట పనిచేయడం వల్ల ఆరోగ్యం సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని వివరించింది. వీరిలో ఎసిడిటీ, పొట్ట సమస్యలు, వెన్నునొప్పి, మెడనొప్పి, నిద్ర పట్టకపోవడం, కండరాల గట్టిగా మారడం, కంటి చూపు తగ్గడం, బరువు పెరగడం వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే తలనొప్పి కూడా తీవ్రంగా పడుతున్నట్టు గుర్తించింది అధ్యయనం.
నిద్రలేమి వల్ల ఊబకాయం బారిన పడటం, మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు, ఆందోళన, డిప్రెషన్, మద్యం తాగడం వంటి సమస్యల బారిన పడుతున్నట్టు గుర్తించింది. అంతేకాదు 74 శాతం మంది భారతీయ టెక్కీలు పని ఒత్తిడి కారణంగా తమ కుటుంబంలో జరిగే ఫంక్షన్లకు పండుగలకు కూడా హాజరు కాలేకపోతున్నారు. దీని వల్ల వారు వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని చెబుతోంది.
ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా కుంగిపోవడం వల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని వివరిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ టెక్ టాలెంట్ పైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు టెక్కీలను ఎక్కువగా కష్టపెట్టడం వల్ల భవిష్యత్తులో ఆ ప్రభావం కనిపించే అవకాశం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం వివరిస్తోంది.
ఉద్యోగులు బర్న్ అవుట్ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కంపెనీలదే అని చెబుతోంది ఈ అధ్యయనం. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను అందించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉన్నట్టు పరిశోధన కర్తలు వివరిస్తున్నారు.
టాపిక్