Acidity home remedies: ఈ సింపుల్ ఇంటి చిట్కాలు.. ఎసిడిటీని తగ్గించేస్తాయి..
Acidity home remedies: అదే పనిగా తేన్పులు, ఆహారం జీర్ణం అవకపోవడం.. ఎసిడిటీ వల్ల వచ్చే ఇబ్బందులు. వీటినుంచి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో బయటపడొచ్చు. అవేంటో తెలుసుకోండి.
అసిడిటీ చిట్కాలు (istock)
ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న ప్రధాన సమస్య గ్యాస్. ఊరికే తేనుపులు రావడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆహారం తినాలన్నా తినలేకపోవడం లాంటి అసిడిటీ సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇలాంటి వారు తమ రోజు వారీ పనుల్లో భాగంగా కొన్నింటిని పాటిస్తూ ఉంటే సమస్య కొంత వరకు పరిష్కారం అవుతుంది. అయితే మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. కానీ సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.
గ్యాస్ సమస్య తగ్గించే చిట్కాలు:
- ఐదారు ఎండుద్రాక్ష పండ్లను తీసుకోండి. వాటిని రాత్రి పూట నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగి మీ రోజును ప్రారంభించండి. ఇది మీ జీర్ణ శక్తిని పెంచుతుంది. పేగుల పని తీరును మెరుగుపరిచి గ్యాస్ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఇది రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది.
- రాత్రి అన్నంలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోరు వెచ్చటి పాలు పోసి తోడు పెట్టండి. దీన్ని ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల పొట్టకు చెప్పలేనన్ని ప్రయోజనాలు ఉంటాయి. మంచి బ్యాక్టీరియా పేగుల్లోకి చేరతాయి. దీంతో ఇది మీ అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.
- గులాబీ రేకులను ప్రోసెస్ చేసి చేసే గుల్కండ్ ఉంటుంది కదా. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను గుల్కండ్ వేసి కలపండి. నిద్ర పోవడానికి వెళ్లే ముందు ఈ గుల్కండ్ నీటిని తాగండి. ఇది మీ శరీరంలో ఉన్న వేడిని తగ్గించి అసిడిటీ సమస్యల నుంచి కాపాడుతుంది.
- రోజు మొత్తంలో ఎప్పుడు గ్యాస్ అనిపించినా వేడి నీటిని లేదా గోరు వెచ్చటి నీటిని తాగండి. దీని వల్ల క్షణాల్లో సమస్య తగ్గుముఖం పడుతుంది.
- అలాగే ఈ సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అలోవెరా జ్యూస్‌ని ప్రయత్నించవచ్చు. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల పేగుల్లో పుండ్లలాంటివి ఉంటే తగ్గుతాయి. అలాగే దీనిలో ఉండే విటమిన్‌లు, అమీనో యాసిడ్లు తదితరాలు అసిడిటీని తగ్గించడంలో సహకరిస్తాయి. ఈ జ్యూస్‌ని తాగేందుకు బజారులో దొరికే దాన్నే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా దీన్ని తయారు చేసుకోవచ్చు. కలబంద నుంచి గుజ్జును తీసి నీటిని చేర్చి పల్చటి జ్యూస్‌లా చేసుకోవాలి. రోజుకు రెండు మూడు సార్లు దీన్ని తాగాల్సి ఉంటుంది. వేగంగా ఉపశమనం కలగాలి అనుకునే వారు దీన్ని క్రమం తప్పకుండా వారం రోజుల పాటు తాగితే చాలు. ఫలితం కనిపిస్తుంది.
టాపిక్