Haircare with Egg: కోడిగుడ్డును ఎలా ఉపయోగిస్తే జుట్టు రాలడం ఆగుతుందో తెలుసుకోండి-learn how to use egg to stop hair fall haircare tips in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Haircare With Egg: కోడిగుడ్డును ఎలా ఉపయోగిస్తే జుట్టు రాలడం ఆగుతుందో తెలుసుకోండి

Haircare with Egg: కోడిగుడ్డును ఎలా ఉపయోగిస్తే జుట్టు రాలడం ఆగుతుందో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Nov 01, 2024 04:30 PM IST

Haircare with Egg: జుట్టు పెరుగుదలలో కోడిగుడ్డుది ప్రధాన పాత్ర. అయితే దాన్ని ఎలా వాడాలో తెలిసినవారు చాలా తక్కువ. జుట్టు రాలడాన్ని ఆపి, జుట్టు పెరిగేందుకు కోడిగుడ్డు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

కోడిగుడ్డుతో హెయిర్ కేర్
కోడిగుడ్డుతో హెయిర్ కేర్ (Pixabay)

కోడిగుడ్డును ఆహారంగానే కాదు అందం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఆహారపరంగా కోడి గుడ్డు తినడం వల్ల ఒక సంపూర్ణ భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దీనిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అయితే కోడిగుడ్డును ఉపయోగించి జుట్టును అందంగా పెంచుకోవచ్చు. జుట్టు రాలిపోతున్నవారు ఎలా కోడిగుడ్డును ఉపయోగించి ఆ సమస్య నుంచి బయట పడాలో తెలుసుకోండి.

ఆధునిక కాలంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో జుట్టు రాలడం ప్రధానమైనది. వారి జుట్టు చివర్లు పొడిగా, విచ్చిపోతున్నట్టు అవుతున్నాయి. అలాగే దువ్వినప్పుడు జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. ఇలాంటివారు కోడిగుడ్డును ఉపయోగించి జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. గుడ్లలో విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి జుట్టు పెరుగుదల వేగాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది.

కలబందతో గుడ్డు

కోడిగుడ్డును కలబందను ఉపయోగించి జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. గుడ్డులోని పచ్చ సొనను విడదీసి ఒక చిన్న గిన్నెలో వేయండి. కావాలనుకుంటే గుడ్డులోనే తెల్ల సొన కూడా వాడవచ్చు. ఇప్పుడు ఆ గిన్నెలో కలబంద రసాన్ని వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని వారానికి మూడు నాలుగు సార్లు జుట్టుకు అప్లై చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య త్వరగా తగ్గుతుంది. కలబంద జుట్టుకు పోషణను అందిస్తుంది. ప్రయోజనాలను కలిగిస్తుంది. జుట్టు పెరుగుదలకు కోడిగుడ్డులోని పోషకాలు ఎంతో ఉపయోగపడతాయి.

పొడి జుట్టుతో ఇబ్బంది పడుతున్న వారు ఒక గిన్నెలో గుడ్డులోని పచ్చసోనను వేయాలి. తెల్ల సొన తీసి పడేయాలి. ఆ పచ్చ సొనలో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తరచూ జుట్టుకు మాస్కులా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిగా ఉండడం తగ్గి మెరుపు సంతరించుకుంటుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

హెన్నాతో కోడిగుడ్డు

తరచూ హెన్నా పెట్టుకునే వారి సంఖ్య ఎక్కువే. ఇలా హెన్నా పెట్టుకునేటప్పుడు కోడిగుడ్డును కూడా అందులో కలిపి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల హెన్నా పొడి వేయండి. అందులోనే అరకప్పు కంటే తక్కువ నీటిని వేసి బాగా కలపండి. ఇప్పుడు రెండు టీ స్పూన్ల పాలు, రెండు కోడిగుడ్లను కూడా వేసి బాగా కలపండి. ఈ మాస్క్ ను మొత్తం జుట్టుకు పట్టించండి. కేవలం హెన్నా మాత్రమే కాదు ఇందులో మెంతికూర కూడా వేసి కలపవచ్చు. ఇలా జుట్టుకు అప్లై చేసుకున్నాక అరగంట పాటు అలా వదిలేయాలి. తర్వాత తేలికపాటి షాంపూతో స్నానం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే మీ జుట్టులో పెరుగుదల కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

గుడ్డులోని తెల్లసొనతో

గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఒక గిన్నెలో గుడ్డులోని తెల్ల సొనను వేయాలి. అందులో ఒక స్పూన్ ఆలివ్ నూనె లేదా బాదం నూనె కలపాలి. అలాగే ఒక స్పూన్ పెరుగును కూడా వేయాలి. ఈ మూడింటిని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంట పాటు అలా జుట్టును వదిలేసి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. జుట్టు ఎదుగుదలకు కావలసిన పోషకాలు అన్నీ ఈ హెయిర్ ప్యాక్ లో ఉంటాయి. వారానికి రెండు మూడు సార్లు ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Whats_app_banner