Brain Toys for Kids: పిల్లలకు ఇలాంటి బొమ్మలు కొనిస్తే.. మెదడుకు పదును..
Brain Toys for Kids: పిల్లల తెలివితేటలు పెంచేందుకు రకరకాల బొమ్మలు కొనివ్వొచ్చు. ఏ వయసులో ఎలాంటి బొమ్మలు కొనిస్తే మంచిదో వివరంగా తెలుసుకోండి.
నెలల పిల్లలు మొదలుకుని ఎదిగే పిల్లల వరకు వారి మెదళ్లు చాలా చురుగ్గా పని చేస్తాయి. ఆ సమయంలో వారు చాలా ఎక్కువ విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అందుకనే చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించడం, ఏ వస్తువు ఎలా పని చేస్తోంది? ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని అర్థం చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. మరి ఈ సమయంలో వారికి ఇచ్చే బొమ్మల విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. ఊరికే ఏదో ఒక బొమ్మ కొని తెచ్చేయడం అన్నట్లు కాకుండా మెదడుకు పదును పెట్టే బొమ్మలను కొని ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందువల్ల వారి మెదళ్లు మరింత చురుగ్గా పని చేస్తాయి. కొత్త కొత్త విషయాలను ఎంతో ఉత్సుకతతో నేర్చుకుంటారు. అందుకనే వారికి బ్రెయిన్ టాయ్స్ ని తప్పకుండా అందుబాటులో ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటేంటో తెలుసుకుందామా?
రెండేళ్ల వరకు:
నెలల వయసు నుంచి ఏడాది, రెండేళ్ల వరకు వయసున్న పిల్లలకు ఏబీసీడీలు, వన్ టూ త్రీలు, ఆకారాలు... లాంటివి పెట్టే బోర్డ్ గేమ్స్‌ని అందుబాటులో ఉంచాలి. సరైన చోట సరైన అక్షరాన్ని పెట్టడం కోసం వారి మెదడు చురుగ్గా పని చేస్తుంది. అలాగే కంటికి, చేతికీ మధ్య కోఆర్డినేషన్ కూడా మెరుగుపడుతుంది. వాటిలో ఉన్న రంగుల్ని మనం చెబుతూ ఉండటం వల్ల వారు రంగుల్ని కూడా గుర్తించ గలుగుతారు.
మూడేళ్ల పిల్లలకు:
అదే మూడు సంవత్సరాలు, అంతకు మించిన వయస్సు ఉన్న పిల్లలకు ఫ్లాష్‌కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. జంతువులు, వస్తువులు, పువ్వులు, కూరగాయలు లాంటివి ఎలా ఉంటాయి? వాటి పేర్లు ఏంటి? లాంటి వాటిని వీటి ద్వారా వారు నేర్చుకుంటారు. ఎడ్యుకేషనల్ ట్యాబ్‌లు కూడా వీరు మెదళ్లు పదును అవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిలో డ్రాయింగ్, కలర్ ఫిల్లింగ్ లాంటివి చేయడం ద్వారా వారిలోని క్రియేటివిటీ పెరుగుతుంది. ఈ వయసులోనే కళాత్మకను పెంపొందించడం అత్యవసరం.
పజిళ్లు..:
ఇప్పుడు మార్కెట్‌లో మనకు చాలా రకాల పజిల్ గేమ్స్, జిగ్సా లాంటివి అందుబాటులో ఉంటాయి. ఇలాంటి వాటిని పిల్లలకు అందుబాటులో ఉంచాలి. వీటి వల్ల సమస్యల్ని పరిష్కరించగల తెలివితేటలు పిల్లల్లో పెరుగుతాయి. రకరకాల ఆకారాల్లో బిల్డింగులు కట్టడానికి బ్లాక్స్ ఉన్న గేమ్‌లు దొరుకుతాయి. వాటి వల్ల పిల్లల్లో సృజనాత్మకత, ఊహాత్మక శక్తి పెరుగుతాయి. రకరకాల ఆకారాలను ఊహించుకుని వారు భవనాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల మెదడు పదునవుతుంది. ఏఏ ఆకారాలను ఉపయోగించినప్పుడు ఏఏ స్ట్రక్చర్లు వస్తాయనే దానిపైనా వీరికి అవగాహన పెరుగుతుంది. ఈ అవగాహనలు భవిష్యత్తులో వీరికి పనికి వస్తాయి.