Ginger Candy: పిల్లలకు జలుబు, దగ్గుతో ఇబ్బందా? జింజర్‌ క్యాండీని చేసి ఇవ్వండిలా!-make tasty ginger candy at home for kids for cough and cold ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ginger Candy: పిల్లలకు జలుబు, దగ్గుతో ఇబ్బందా? జింజర్‌ క్యాండీని చేసి ఇవ్వండిలా!

Ginger Candy: పిల్లలకు జలుబు, దగ్గుతో ఇబ్బందా? జింజర్‌ క్యాండీని చేసి ఇవ్వండిలా!

Koutik Pranaya Sree HT Telugu
Oct 08, 2023 05:15 PM IST

Ginger Candy: దగ్గు, జలుబు ఉన్నప్పుడు అల్లం రసం ఇస్తే పిల్లలు తాగరు. దానికి బదులుగా జింజర్ క్యాండీలు చేసివ్వండి. ఇష్టంగా తినేస్తారు. మీ పని తేలిక అవుతుంది.

జింజర్ క్యాండీ
జింజర్ క్యాండీ (pexels)

వర్షాకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, శ్వాస కోశ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నో విధానాలను పాటిస్తూ ఉంటాం. ఆవిరి పట్టుకోవడం, మిరియాల పాలు తాగడం, పసపు టీ తాగడం లాంటి ఎన్నో చిట్కాలను అవలంబిస్తూ ఉంటాం. వీటిని పాటించడం వల్ల కొంత వరకు ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందనే చెప్పవచ్చు. ఈ సమస్యకు జింజర్‌ క్యాండీ కూడా మంచి పరిష్కారాన్ని చూపుతుంది. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారూ కాస్త ఇష్టంగా తింటారు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో, ఏ మోతాదులో తినాలో ఇక్కడ వివరంగా ఉంది. తెలుసుకోండి.

అల్లం ఎందుకు?

అల్లంలో జింజెరాల్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలూ దీనిలో సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇది వాపుల్ని, నొప్పుల్ని తగ్గిస్తుంది. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. జీవ క్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడంలోనూ సహకరిస్తుంది. అందుకనే వీటిని క్యాండీలుగా చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పెద్దవారూ తినవచ్చు.

ట్యాంగీ జింజర్‌ క్యాండీ :

రెండు చిన్న అల్లం ముక్కలను తీసుకోండి. దాన్ని రోడ్లో చితకొట్టి ముద్దలా చేయండి. దాంట్లో పది చుక్కల నిమ్మ రసాన్ని వేయండి. ఒక టేబుల్‌ స్పూను మిరియాల పొడి, ఒక టీ స్పూను వాము పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, చిటికెడు ఉప్పు, కాస్త చాట్‌ మసాలాలను చేర్చండి. వీటన్నింటినీ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోండి. వీటిని తినే కాసేపు ముందు తీసి బయట పెట్టుకుని గది ఉష్ణోగ్రతకు రానీయండి. మూడు పూటలా వీటిని ఒక్కొక్కటిగా తినడం వల్ల గొంతు మంట, గొంతు నొప్పి, జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే జీర్ణ శక్తీ పెరుగుతుంది.

రోస్టెడ్‌ జింజర్‌ క్యాండీ :

రెండు చిన్న అల్లం ముక్కల్ని తీసుకోండి. శుభ్రంగా కడిగి ఆరనిచ్చి పెట్టుకోండి. పొయ్యి మీద మందపాటి కడాయిని పెట్టుకోండి. దానిలో అల్లం వేసి వేయించండి. వేగిన అల్లం తొక్క తీసేసి చిన్నపాటి ముక్కలుగా కత్తిరించుకోండి. గాజు పాత్రను తీసుకుని అందులో అరకప్పు తేనె పోయండి. తర్వాత కత్తిరించి పెట్టుకున్న అల్లం ముక్కలు, నల్ల మిరియాల పొడి రెండు స్పూన్లు, దాల్చిన చెక్క పొడి అర టీస్పూన్‌, అర టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం వేసి అన్నింటినీ కలపండి. చిన్న చిన్న బిళ్లల్లా చేసుకుని మూడు పూటలా ఒక్కోటి చొప్పున తినండి. పిల్లలకైతే కాస్త తక్కువ పరిమాణంలో ఇవ్వండి. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులన్నీ తగ్గుముఖం పడతాయి.

Whats_app_banner