Digestion time: ఈ ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? మీ ఆకలిని నిర్ణయించేదిదే-know what is the digestion time for these foods like fruits and nuts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Digestion Time: ఈ ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? మీ ఆకలిని నిర్ణయించేదిదే

Digestion time: ఈ ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? మీ ఆకలిని నిర్ణయించేదిదే

Koutik Pranaya Sree HT Telugu
Sep 01, 2024 02:00 PM IST

Time for Digestion: సాధారణంగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి రెండు నుండి మూడు రోజులు పడుతుంది, కానీ పండ్లు నుండి కూరగాయలు మరియు గింజలు-విత్తనాలు వంటి ఆహారాన్ని తినడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా.

ఈ ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?
ఈ ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? (Shutterstock)

మనం ఏ ఆహారం తిన్నా అది మనకు శక్తిని, అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ నోటి ద్వారా లోపలికి చేరిన ఆహారం జీర్ణమై శక్తిగా మారడానికి సుదీర్ఘ ప్రక్రియ శరీరంలో జరుగుతుంది. మనం తినే ఆహారం ప్రభావం దీని మీద ఉంటుంది. అందుకే సులువుగా జీర్ణమై, శరీరానికి మేలు చేసే ఆహారాన్నే తీసుకోవడం మంచిది. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, విత్తనాలు వంటివి జీర్ణం కావడానికి వేర్వేరు సమయాలు పడతాయి.

కొన్ని ఆహారాలు తింటే తొందరగా ఆకలి వేస్తుంది. అవి తొందరగా జీర్ణం అవ్వడమే దానికి కారణం. మరికొన్ని తింటే ఎక్కువ సేపు పొట్టనిండుగా అనిపిస్తుంది. ఇవన్నీ అవి జీర్ణం అవ్వడానికి పట్టే సమయంలో తేడాల వల్లే..

పండ్లు జీర్ణం కావడానికి ఎంత సమయం?

వేర్వేరు పండ్లు జీర్ణం అవడానికి వేర్వేరు సమయం పడుతుంది. సాధారణంగా చాలా రకాల పండ్లు 30 నుంచి 40 నిమిషాల్లో జీర్ణం అయ్యి చిన్న ప్రేగుకు చేరతాయి. అక్కడి నుంచి వ్యర్థ పదార్థాలు పెద్ద పేగుకు చేరతాయి. కాబట్టి అల్పాహారంలో పండ్లు మాత్రమే తింటే అవి త్వరగా జీర్ణమయ్యి, తొందరగా ఆకలి వేస్తుంది.

కూరగాయలు:

సాధారణంగా అన్ని రకాల కూరగాయలను వండుకునే తింటారు. కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉండే రకాలను ఉడికించడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. శరీరంలో కూరగాయలు 30-60 నిమిషాల్లో జీర్ణం కావడం ప్రారంభిస్తాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పాలకూర, దోస, క్యాప్సికం, టమాటాలు, ముల్లంగి లాంటివి జీర్ణం అవడానికి అరగంట నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది.

అలాగే ఉడికించిన క్యాలీఫ్లవర్, బ్రొకలీ లాంటివి 40 నుంచి 50 నిమిషాల్లో జీర్ణం అవుతాయి. దుంపల్లాంటి బీట్‌రూట్, చిలగడదుంపలు, క్యారట్లు జీర్ణం అవడానికి 50 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. వాటిలో ఉండే పిండి పదార్థాల శాతం బట్టి అవి జీర్ణం అయ్యే సమయం మారుతుంది.

ధాన్యాలు, గింజలు:

వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని ఉడికించడానికీ ఎక్కువ సమయమే అవసరం. బ్రౌన్ రైస్, ఓట్స్, కార్న్ మీల్ లాంటివి జీర్ణం అవ్వడానికి గంటన్నర సమయం పడుతుంది. శనగలు, బటానీ, రాజ్మా లాంటివి అరగడానికి రెండు మూడు గంటలైనా పడుతుంది. 

గింజలు, విత్తనాలు:

ఫైబర్ శాతం వీటిలో తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కాస్త పీచు ఎక్కువుండే ఆహారాలతో కలిపి తినాలి. లేదంటే ఆలస్యంగా జీర్ణమవుతాయి. గుప్పెడు గింజలు, విత్తనాలు తింటే అవి రెండు మూడు గంటల్లో జీర్ణం అవుతాయి. రెండు మూడు గంటల పాటు కడుపులో ఉన్నప్పుడు అందులో ఆమ్లాలు, ఎంజైములు కలిసిపోయి విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ జరుగుతుంది.

ఇలా రకరకాల ఆహార పదార్థాలను నోటి నుంచి పొట్ట, చిన్న పేగు వరకు వేర్వేరు సమయాల్లో జీర్ణం అవుతాయి. ఆహారాన్ని జీర్ణం చేయడానికి పట్టే సమయం సాధారణంగా ఎంజైమ్లతో కలిసి ఆహారం విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ ద్వారా లెక్కించబడుతుంది. ఆహారం నోట్లోకి వెళ్లి విసర్జన ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండు, మూడు రోజులు పడుతుంది.

Whats_app_banner