Broccoli benefits: ఈ కారణాలు తెలిస్తే.. బ్రొకలీ తప్పకుండా తింటారు..-know health benefits of eating broccoli in regular diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Broccoli Benefits: ఈ కారణాలు తెలిస్తే.. బ్రొకలీ తప్పకుండా తింటారు..

Broccoli benefits: ఈ కారణాలు తెలిస్తే.. బ్రొకలీ తప్పకుండా తింటారు..

HT Telugu Desk HT Telugu
Nov 20, 2023 07:15 PM IST

Broccoli benefits: ఈ మధ్య బ్రోకలీ చాలా చోట్ల విరివిగా దొరుకుతోంది. అయినా చాలా మందికి దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం అలవాటు అవ్వలేదు. అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తప్పకుండా తినడం మొదలెట్టేస్తారు.

బ్రోకలీ పోషకాలు
బ్రోకలీ పోషకాలు (pexels)

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. అందుకు రకరకాల ఆరోగ్యకరమైన ఆహారాలను మన రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. అందుకోసం మనం బ్రోకలీని తప్పకుండా తరచుగా తినే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. విటమిన్ సీ, కే, ఏలు దొరుకుతాయి. వీటితో పాటుగా ఫోలేట్, పొటాషియం, మాంగనీసు లాంటివీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రక్త స్రావం జరుగుతున్నప్పుడు గడ్డకట్టడానికి సహకరిస్తాయి. ఇవే అనుకుంటే పొరపాటేనండీ. ఇంకా దీని వల్ల ప్రయోజనాలు బోలెడున్నాయి.

1. ఫైబర్ అధికంగా ఉంటుంది:

బ్రోకలీలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగుల కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాల పెరుగుదలకు సహకరిస్తుంది.

2. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు:

బ్రోకలీలో సల్ఫోరాఫేన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లను దరి చేరనీయవు. రొమ్ము, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్లతో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

3. గుండె ఆరోగ్యం:

బ్రోకలీలో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. దీనిలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, రక్త పోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా హృదయ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

4. ఎముక ఆరోగ్యం:

ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం. కాల్షియంని ఇవి బాగా శోషించుకోవాలంటే కే విటమిన్‌ ఉండాలి. ఇవి రెండూ బ్రోకలీలో పుష్కలంగా ఉంటాయి.

5. నియంత్రణలో బరువు:

దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు పోషకాలూ అధికంగా ఉంటాయి. అందువల్ల దీన్ని తిన్న తర్వత పొట్ట నిండిపోయినట్లుగా ఉంటుంది. అందువల్ల అతిగా తినకుండా ఉంటాం. తద్వారా బరువవు నియంత్రణలో ఉంటుంది.

6. మెరుగైన కంటి దృష్టి:

బ్రోకలీలో ల్యూటిన్, జియాక్సంతిన్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ సమ్మేళనాలు వయస్సు ఆధారంగా వచ్చే శుక్లాలను, ఇతర దృష్టి సమస్యలను తగ్గిస్తాయి.

7. డిటాక్సిఫికేషన్‌:

బ్రోకలీలో ఉన్న సల్ఫోరాఫేన్‌ అనేది శరీరాన్ని డిటాక్స్‌ చేయడానికి సహాయపడుతుంది. ఇది శరీరం నుండి హానికరమైన, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడే ఎంజైమ్‌లను ప్రోత్సహిస్తుంది.

Whats_app_banner