Calcium-rich Foods । ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి కాల్షియం అధికంగా లభించే ఆహారాలు ఇవే!-calciumrich foods that will make your bones stronger and heart healthier ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Calcium-rich Foods । ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి కాల్షియం అధికంగా లభించే ఆహారాలు ఇవే!

Calcium-rich Foods । ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి కాల్షియం అధికంగా లభించే ఆహారాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Jun 17, 2023 10:38 AM IST

Calcium-rich Foods: ఎముకలు దృఢంగా ఉండాలంటే, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు మనకు కాల్షియం అవసరం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.

Calcium-rich Foods
Calcium-rich Foods (istock)

Calcium Health Benefits: శరీరంలో ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు మనకు కాల్షియం అనే పోషకం చాలా అవసరం. మన శరీరం పెరిగేకొద్దీ అందుకు అనుగుణంగా ఎముకలను నిర్మించడానికి మాత్రమే కాకుండా, వయసుకు తగినట్లుగా కండరాలు కదలడానికి, ఎముకల సాంద్రతను, వాటిలో బలాన్ని కాపాడడంలోనూ కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మీ మెదడు నుంచి శరీరంలోని ప్రతి భాగానికి సందేశాలను తీసుకువెళ్లడానికి నరాలకు కాల్షియం అవసరం. రక్త నాళాలు మీ శరీరం అంతటా రక్తాన్ని తరలించడంలో కాల్షియం సహాయపడుతుంది, మీ శరీరంలోని అనేక విధులను ప్రభావితం చేసే హార్మోన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.

రక్తం గడ్డకట్టడంలో, కండరాలు సంకోచించడంలో, గుండె లయలను సాధారణంగా ఉంచడంలో, నరాల పనితీరును నియంత్రించడంలో కాల్షియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రసవానంతరం స్త్రీలలో తల్లిపాలు (Breast Milk) ఉత్పత్తి బాగా జరగాలంటే కూడా అందుకు కాల్షియం అవసరం అవుతుంది. కాబట్టి శరీరానికి సంబంధించి ఇన్ని రకాల అవసరాల కోసం మనకు కాల్షియం చాలా కావాలి.

కాల్షియంను మనం రోజువారీగా తీసుకునే ఆహారం ద్వారా పొందవచ్చు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా మీ శరీరానికి చాలా ప్రయోజనం చేకూరుతుంది. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు (Calcium-rich Foods) ఏవో, కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.

డెయిరీ ఉత్పత్తులు

పాలు, పెరుగు సహా ఇతర పాల ఉత్పత్తులు కాల్షియంకు అద్భుతమైన వనరులు. కాల్షియం శోషణలో సహాయపడే ప్రోటీన్, విటమిన్ డి, ఫాస్పరస్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా ఇవి అందిస్తాయి. అయితే పాలు, ఇతర డెయిరీ ఉత్పత్తులను తీసుకునేటపుడు మీ క్యాలరీలను అదుపులో ఉంచుకోవడానికి తక్కువ కొవ్వు లేదా స్కిమ్డ్ మిల్క్ రకాలను ఎంచుకోండి.

సోయా ఉత్పత్తులు

సోయాబీన్స్ తో తయారు చేసే టోఫులో కాల్షియం సాంద్రత ఎక్కువగా ఉంటుంది. దీనిని వివిధ రకాలుగా వండుకొని తినవచ్చు. అలాగె సోయా పాలు, ఇతర సోయా ఉత్పత్తులు కూడా కాల్షియంతో నిండుగా ఉంటాయి. మీరు పూర్తిగా శాకాహారులు అయి ఉంటే కాల్షియం పోషకం పొందడానికి డెయిరీ ఉత్పత్తులకు బదులుగా మొక్కల ఆధారిత ఆహారమైన సోయా ఉత్పత్తులను తీసుకోవచ్చు.

చేపలు

కొన్ని రకాల చేపలలో కాల్షియంతో సమృద్ధిగా ఉంటుంది. సాల్మన్, సార్డినెస్ వంటి చేపలు కాల్షియంకు అద్భుతమైన మూలాలు. ఇవి కాల్షియంతో పాటుగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కూడా కలిగి ఉంటాయి. శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. చేపలు తినడం ద్వారా మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందుతాయి.

ఆకు కూరలు

కాలే, బచ్చలికూర, కొల్లార్డ్ గ్రీన్స్, బ్రోకలీ వంటి ఆకు కూరలు వివిధ విటమిన్లు, ఖనిజాలతో నిండి. వీటిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే ఆకుకూరలు తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి, కాబట్టి ఇలాంటివి ఎక్కువ తినాలి.

చిక్కుళ్ళు

తెల్లశనగలు, బ్లాక్ బీన్స్ మొదలైన కాయధాన్యాలు, చిక్కుళ్ళలో కాల్షియం నిండుగా ఉంటుంది, అలాగే ఇవి శాకాహార ప్రోటీన్ వనరులు కూడా. ఈ కాల్షియం అధికంగా ఉండే కాయధాన్యాలతో అనేక రకాల రుచికరమైన వంటకాలను చేసుకొని రోజూ తినవచ్చు.

గింజలు - విత్తనాలు

గింజలు, విత్తనాలు ఎప్పుడైనా తినగలిగే ఆరోగ్యకరమైన చిరుతిండి. వీటిలో కాల్షియంతో సహా అవసరమైన పోషకాలు నిండుగాఅ ఉంటాయి. బాదం, నువ్వులు, సబ్జా గింజలు, అవిసె గింజలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని వివిధ వివిధ అహారాలలో చల్లుకోవడం, మీ వోట్‌మీల్ గిన్నెలో కలపడం లేదా క్రంచీ స్నాక్‌గా తినడం ఇలా ఏ విధంగానైనా తినేందుకు మీ ఆహారంలో చేర్చుకోండి.

క్వినోవా

క్వినోవా ఎన్నో పోషకాలు నిండిన చిరుధాన్యం. ఇది కాల్షియంకు మంచి మూలం మాత్రమే కాకుండా ప్రోటీన్, డైటరీ ఫైబర్‌ను కూడా అదనంగా అందిస్తుంది. క్వినోవాను అన్నంగా వండుకోవచ్చు, రోటీలు, ఇడ్లీలు చేసుకోవచ్చు. సలాడ్‌లలోనూ వేసుకొని క్వినోవాను ఆస్వాదించవచ్చు.

పండ్లు

నారింజ, కివి, నేరేడు పండు, ద్రాక్షపండ్లలో కూడా కొద్ది మొత్తంలో కాల్షియం ఉంటుంది. అయితే వీటిలో అదనపు పోషకాలు, విటమిన్లు ముఖ్యంగా విటమిన్ సితో నిండి ఉంటాయి, ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.

అయితే శరీరంలో కాల్షియం శోషణ జరగాలంటే అందుకు విటమిన్ డి అవసరం. కాబట్టి సూర్యరశ్మి ద్వారా లేదా సప్లిమెంట్ల రూపంలో విటమిన్ డి పొందడానికి ప్రయత్నించండి.

సంబంధిత కథనం