Itchy feet remedies: పాదాల వేళ్ల మధ్యలో దురదా? ఈ చిట్కాలతో రిలీఫ్-know what are the best remedies for itchy foot in monsoon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Itchy Feet Remedies: పాదాల వేళ్ల మధ్యలో దురదా? ఈ చిట్కాలతో రిలీఫ్

Itchy feet remedies: పాదాల వేళ్ల మధ్యలో దురదా? ఈ చిట్కాలతో రిలీఫ్

Koutik Pranaya Sree HT Telugu
Jul 04, 2024 10:30 AM IST

Itchy feet remedies: చెమట, వర్షపు నీటిలో ఎక్కువసేపు నానిన షూ వేసుకోవడం, లేదంటే ఎక్కువగా నీళ్లలో ఉండాల్సి రావడం వల్ల పాదాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు వస్తాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలో చూడండి.

పాదాల దురదకు చిట్కాలు
పాదాల దురదకు చిట్కాలు (shutterstock)

వర్షాకాలం అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ చెమటతో కూడిన వాతావరణంతో చర్మ అలెర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రకరకాలుగా రావచ్చు. అథ్లెట్ ఫూట్, చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు, గోర్లు దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇలా అనేక రూపాల్లో కనిపిస్తాయి. ఇవి కాకుండా, అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఇది వచ్చే ప్రమాదం ఉంది. వర్షపు నీటిలో నానిన బూట్లు లేదా పాదాలలో ఎక్కువసేపు చెమట పట్టడం వల్ల పాదాలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. ఈ సమస్య ఉంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటించి చూడండి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా ఒక సహజ క్రిమినాశిని. ఇది దురద తగ్గించి మరో చోటికి సంక్రమించకుండా చేస్తుంది. దానికోసం 2 టీస్పూన్ల బేకింగ్ సోడాను 2 కప్పుల వేడి నీటిలో వేసి బాగా కలపాలి. ఈ నీటిలో పాదాలను నానేలా కనీసం పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటూ ఉంచాలి. దీనివల్ల చర్మానికి ఉపశమనం దొరుకుతుంది. దురద తగ్గుతుంది.

వేప ఆకులు:

వేప ఆకులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి దురద, ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం, వేప ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీరు చల్లారిన తర్వాత దురద, లేదా చర్మం ఇన్ఫెక్షన్ సోకిన చోట రాసుకోవాలి. దీనివల్ల దురద తగ్గుతుంది.

టీ ట్రీ ఆయిల్:

యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు టీ ట్రీ ఆయిల్ లో ఉంటాయి. ఇవి దురదను తగ్గించడానికి, ఇన్ఫెక్షన్ కు సంబంధించిన బ్యాక్టీరియాను నశింపజేయడానికి సాయపడతాయి. అయితే ఇదొక ఎసెన్షియల్ కాబట్టి దీన్ని నేరుగా వాడకూడదు. ఏదైనా క్యారియర్ లో కలిపి వాడుకోవాలి. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె లో ఐదారు చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి రాసుకోవాలి. రోజుకు రెండు సార్లు సమస్య ఉన్నచోట రాసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ పాదాల ఇన్ఫెక్షన్, దురదకు గొప్ప నివారణిగా పని చేస్తుంది. దీనికోసం యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన నిష్పత్తిలో తీసుకోవాలి. ఒక టబ్ లో ఈ మిశ్రమం పోసుకుని అందులో పాదాలు మునిగేలా ఉంచాలి. కనీసం పావుగంగ సేపు ఉంచిన తర్వాత పాదాలను నీటితో కడిగేసుకుంటే చాలు. ఇలా రోజుకు ఒకసారి చేస్తే సరిపోతుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి ప్రయోజనం చేకూరుస్తాయి. దురద సమస్యను తొలగిస్తాయి. కొబ్బరి నూనెను గోరు వెచ్చగా చేసి సమస్య ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. చర్మానికి ఇది తేమ అందిస్తుంది. దాంతో దురద నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.

Whats_app_banner