Jogging During Winter । చలికాలంలో జాగింగ్ సురక్షితమేనా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Jogging During Winter: చలికాలంలో జాగింగ్ చేయడం సురక్షితమేనా? ప్రయోజనాలు ఏం ఉన్నాయి, ఇబ్బందులేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ తెలుసుకోండి.
శీతాకాలంలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుంది. సీజన్ మారింది కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యాయామం చేసే విధానంలోనూ మార్పు రావాలి. ఏ వ్యాయామం ప్రారంభించే ముందైనా వార్మప్ తప్పనిసరి అని మనకు తెలిసిందే. అయితే ఈ చలికాలంలో వ్యాయామానికి ముందు చేసే వార్మప్ సమయం ఎక్కువ ఉండాలి. పది నిమిషాలకు బదులుగా పదిహేను నిమిషాలు వార్మప్‌లో గడిపేలా ప్లాన్ చేయండి. ఎందుకంటే చలికి కండరాలు గట్టిపడిపోతాయి, మీరు శరీరంలోపలి నుంచి సరైన వేడిని ఇవ్వకుండా వ్యాయామం చేస్తే కండరాల ఒత్తిడికి గురవుతాయి, కండరాల తిమ్మిరి, నొప్పులతో బాధపడవచ్చు.
అలాగే చలికాలంలో వ్యాయామం అనంతరం శరీరం చల్లబరచటానికి శరీరానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కూల్ డౌన్ ప్రక్రియ తక్కువ ఉండేలా చూసుకోవాలి. స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం ఆదర్శవంతంగా ఉంటుంది.
మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి చలికాలంలో కూడా జాగింగ్ చేయవచ్చు. చలికాలంలో జాగింగ్ చేస్తే కొన్ని ప్రయోజనాలు, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. చలికాలంలో జాగింగ్ చేయడం వల్ల శరీరంలోని నిరోధక శక్తి పెరుగుతుంది. తేలికపాటి లేదా మితమైన పరుగుతో మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సహేతుకమైన వేగంతో పరిగెత్తడం, నడవడం ద్వారా అది శరీరంలోని సహజ రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.
చలికాలంలో జాగింగ్ చేస్తున్నపుడు మీ శ్వాసక్రియపై శ్రద్ధ వహించండి. సరైన శ్వాస- తీసుకోవడం చాలా అవసరం. నోటి ద్వారా పొడి, చల్లని గాలిని పీల్చడం మానుకోండి. చల్లటి శ్వాసతో మీ శ్వాసకోశ, శ్లేష్మ పొరలు చల్లగా మారుతాయి. తద్వారా ఊపిరితిత్తులలో మంటతో పాటు, దగ్గును కలిగిస్తుంది. మీరు ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతుంటే, మరిన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. దీనికి పరిష్కారంగా మీ నోటి ముందు సన్నని గుడ్డను లేదా ముసుగుగా ధరించడం. ఇది మీరు పీల్చే గాలిని వెచ్చగా, తేమగా మార్చడానికి సహాయపడుతుంది.
అలాగే చలికాలం వ్యాయామం చేసే దుస్తులు కూడా డబుల్ లేయర్ కలిగి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచేవి ఎంచుకోవాలి. పొగమంచు కారణంగా చీకటిగా ఉంటుంది కాబట్టి, ప్రమాదాలు నివారించేదుకు మీ దుస్తులు రేడియం రిఫ్లెక్టర్స్ కలిగి ఉంటే మంచిది.
సంబంధిత కథనం