Steam Exhale | శీతాకాలంలో నోటి నుంచి ఆవిరి ఎందుకు వస్తుందో తెలుసా? కారణం ఇదే!
చలికాలంలో లేదా ఏదైనా చల్లని ప్రదేశాలకు వెళ్లినపుడు పొగమంచులా మీ నోటి నుండి ఆవిరి రావడం మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. నోటి ద్వారా గాలి వదులుతున్నపుడు ఇలా జరుగుతుంటుంది. అందుకు గల కారణాలు తెలుసుకోండి.
చలికాలంలో పొగమంచులా మీ నోటి నుండి ఆవిరి రావడం మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. నోటి ద్వారా గాలి వదులుతున్నపుడు ఇలా జరుగుతుంటుంది. ఏదైనా చల్లని ప్రదేశాలకు వెళ్లినపుడు కూడా ఇలాగే జరుగుతుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా..? ఎప్పుడైనా ఆలోచించారా? సరే, నోటి నుంచి ఆవిరి ఎందుకు వస్తుందో, ఎలాంటి సందర్భాల్లో ఇలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి శరీర ఉష్ణోగ్రత సుమారుగా 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ (36-37 డీగ్రీ సెలియస్) గా ఉంటుంది. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆ గాలిని మనం పీల్చుకున్నపుడు అది మన శరీర ఉష్ణోగ్రతను గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఇది వదిలినపుడు ఆవిరిలా బయటకు వెళ్తుంది.
ఫిజిక్స్ ప్రకారం చెప్పాలంటే.. శీతాకాలంలో లేదా శీతల ప్రదేశాలలో బయట వాతావరణం నుంచి పీల్చుకున్న చల్లటి గాలి మన శ్వాసలోని వెచ్చని తేమతో కలిసి పొగమంచు లాంటి మేఘంలా కనిపించే చిన్నచిన్న నీటి బిందువులుగా ఘనీభవం చెందుతుంది. ఇది మీ శ్వాసకు సంబంధించిన ద్రవ రూపమే.
సాధారణంగా మనం పీల్చి, వదిలే గాలి మనకు కనిపించదు కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అణువులు వాయు స్థితి నుంచి మరో స్థితికి మారుతాయి, అణువులు ఒకచోటకు చేరుతాయి కాబట్టి ఈ శ్వాస మనకు కనిపిస్తుంది. బయట వాతావరణం ఎంత చల్లగా ఉంటే అంత స్పష్టంగా ఆవిరి మన నుంచి బయటకు వెళ్తుంది.
ఈ సిద్ధాంతం ప్రకారం, బయటి వాతావరణం కంటే మన ఒంట్లో వేడే ఎక్కువ ఉన్నపుడు ఇలాగే ఆవిరి సృష్టి జరుగుతుంది. అప్పుడు మనం కూడా ప్రెషర్ కుక్కర్ లాగా ఆవిరి వదలడం చేయవచ్చు.
వేసవిలో నోటి నుండి ఆవిరి ఎందుకు రాదు?
వేసవిలో బయటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో శరీరం నుండి తేమ బయటకు వచ్చినప్పుడు, దాని అణువుల గతిశక్తి తగ్గదు, అణువులు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. అంటే తేమ వాయు స్థితిలోనే ఉంటుంది. నీటి బిందువులతో కూడిన ఆవిరిగా మారదు. కాబట్టి మనం బయటకు గాలి వదిలినపుడు ఎలాంటి మార్పు కనిపించదు.
సంబంధిత కథనం