Mango rasam: కమ్మటి, పుల్లటి మామిడి రసంతో.. కడుపు నిండా తినేస్తారు
Mango rasam: వేసవిలో మామిడి కాయతో, పండ్లతో చాలా రకాలుగా వంటలు చేస్తుంటాం. ఒకసారి ఈ రుచికరమైన మామిడి రసం కూడా ప్రయత్నించి చూడండి.
చింతపండుతోనో, నిమ్మరసంతోనో చారు పెడుతుంటాం. ఇది మామిడి కాయలు దొరికే సమయం కాబట్టి రుచిగా ఉండే మామిడి కాయతో రసం లేదా చారు చేసి చూడండి. ముద్దపప్పుతో లేదా చారు ఒక్కటే పోసుకుని అన్నం తిన్నా రుచిగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
2 పచ్చిమామిడి కాయల ముక్కలు
3 కప్పుల నీళ్లు
1 టేబుల్ స్పూన్ నూనె
సగం స్పూన్ ఆవాలు
సగం స్పూన్ జీలకర్ర
సగం స్పూన్ ఇంగువ
2 ఎండుమిర్చి
1 చెంచా కారం
1 చెంచా ఉప్పు
1 కరివేపాకు రెమ్మ
2 పచ్చిమిర్చి
పావు చెంచా పసుపు
చిన్న బెల్లం ముక్క
తయారీ విధానం:
- ముందుగా పచ్చి మామిడి కాయ తొక్కతీసి, ముక్కలుగా చేసుకోవాలి.
2. ఒక ప్యాన్ లో కప్పు నీళ్లు పోసి మామిడి కాయ ముక్కలు వేసుకోవాలి.
3. మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
4. ముక్కలు అవే నీళ్లలో మెదిపి ఇంకాసేపు ఉడికించాలి.
5. ఈలోపు మరో ప్యాన్ లో నూనె వేసుకుని, ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, బెల్లం, పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి.
6. ఈ తాలింపులో ఉడికించుకున్న మామిడి కాయ నీళ్లతో సహా వేసేయాలి. ఒక ఉడుకు వచ్చేదాకా కలుపుతూ ఉండండి. రెండు నిమిషాలు ఉడికిస్తే మామిడి కాయ రసం సిద్ధం.