Mango Side Effects : మామిడి పండు ఎప్పుడు తినాలి? అతిగా తింటే సమస్యలే
Mango Side Effects : మామిడిపండ్లు అంటే ఇష్టం లేదని చెప్పే వారు ఉండరేమో. కొంతమందికి ఒక్క మామిడి పండు తింటే తృప్తి కలగదు. కడుపునిండా తిన్నా.. ఇంకా తినాలని తహతహలాడుతుంటారు. అదే మామిడి పండు రుచి ప్రత్యేకత. అయితే ఎప్పుడు తినాలి? ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి?
అసలే వేసవి కాలం.. రోడ్డు మీదకు వెళ్తే.. బోలెడు మామిడి పండ్లు(Mango Fruits) కనిపిస్తాయి. కచ్చితంగా కొనుక్కొని వచ్చి.. తినాలి అనిపిస్తుంది. కానీ మామిడిపండు ఎక్కువగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు(Health Issues) వస్తాయి. అతిగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.
శరీరంలో చక్కెర పెరుగుతుంది. మీకు డయాబెటిస్ లేకపోయినా, మీరు మామిడిపండ్లను ఎక్కువగా తింటే, చక్కెర కంటెంట్ తరచుగా అలసటను కలిగిస్తుంది. మామిడిని ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా మీకు డయాబెటిస్ ఉంటే మామిడి పండ్లను మితంగా తినండి.
కొంతమందికి పాలతో అలెర్జీ వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వారు మామిడి పండును అతిగా తింటే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల చర్మం(Skin) దురద, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. మామిడిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. ఎక్కువగా తినడం వల్ల బరువు(Weight) పెరగవచ్చు. మీరు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఒక రోజులో 330 గ్రాముల కంటే ఎక్కువ తినవద్దు, అంటే ఒక మామిడిపండు తింటే సరిపోతుంది.
మార్కెట్లో చాలా మామిడి పండ్లు ఉంటాయి. కృత్రిమంగా పండినవి తినొద్దు. పండ్లను కృత్రిమ పొడిని ఉపయోగించి పండిస్తే సరిగా పండవు. సహజంగా పండిన మామిడి పండు తింటే తియ్యగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. పౌడర్ కారణంగా పండిన మామిడికాయలను తినకపోవడమే మంచిది. పిల్లలకు అలాంటి పండు ఇవ్వకండి. వాటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
మామిడిపండును ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన అరగంట తర్వాత తినడం చాలా మంచిది. ఇలా తినడం వల్ల మన శరీరం అందులోని పోషకాలను గ్రహించేలా చేస్తుంది. మిల్క్ షేక్, జ్యూస్ చేసి కూడా తాగొచ్చు. దానికంటే మామిడిపండును అలాగే తినడం ఇంకా మంచిది.
మామిడి పండ్లు ఎక్కువగా తింటే ఇంకో సమస్య కూడా ఉంది. ఇవి అతిగా తింటే.. వేడి చేస్తుంది. ఈ విషయాన్ని ఇంట్లో పెద్దలు కూడా చెబుతారు. వీటికి చలువ చేసే గుణం ఉండదు. అయితే తినడానికి ముందు వీటిని నీళ్లలో నానబెడితే వేడీ చేసే లక్షణం తగ్గుతుందని చెబుతారు. మరీ ఎక్కువగా మామిడి పండ్లు తిన్నా.. మెుటిమల సమస్యలు వస్తాయి.