Leaves For Diabetes: రోజూ ఈ ఆకులు ఆహారంలో తింటే.. షుగర్ సహజంగానే కంట్రోల్‌లో ఉంటుంది..
Leaves For Diabetes: రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండాలంటే కొన్ని ఆకుల్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. వాటివల్ల సహజంగానే షుగర్ అదుపులో ఉంటుంది. అవేంటో తెల్సుకోండి.
ఇవాళ రేపు.. మధుమేహం అనేది చాలా సర్వ సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. ఏ ఇంట్లో చూసినా డయాబెటిక్ పేషెంట్లు కనిపిస్తున్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వాకింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం, మందులు తీసుకోవడం ద్వారా దీన్ని అంతా నియంత్రణలో ఉంచుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఆహారంలో కొన్ని ఆకు కూరలని తప్పకుండా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రణలో ఉంచగల ఆ ఆకులు ఏమిటో అవగాహనతో ఉండటం ఎవ్వరికైనా సరే అవసరం.
మెంతి ఆకులు :
మెంతుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నట్లే మెంతి ఆకుల్లోనూ ఈ లక్షణాలు ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇవి మెరుగుపరుస్తాయి. శరీరం ఎక్కువ గ్లూకోజ్‌ని శోషించుకోనీయకుండా చేస్తాయి. రోజుకు పది గ్రాముల మెంతుల్ని గాని, మెంతి ఆకుల్ని గాని తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ రిస్క్ చాలా వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడయ్యింది.
కరివేపాకు :
కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఓ ప్రత్యేకమైన పీచు పదార్థం ఉంటుంది. దాని వల్ల కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
మునగాకు :
మునగ చెట్టు ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఎక్కడైనా సరే ఇవి తేలికగా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా చక్కెర వ్యాధి ఉన్న వారు ఈ ఆకుల్ని తరచుగా తినడం వల్ల లాభాలుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిల్ని ఇది నియంత్రిస్తుంది. వాపుల్ని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరంలో ఏర్పడే నష్టాల్ని తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది.
జామ ఆకులు :
మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి. టైప్ 2 డయాబెటీస్ రిస్క్ ని ఇవి బాగా తగ్గిస్తాయి. ఈ ఆకుల రసాన్ని తీసుకుని తాగడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ తగిన స్థాయిలో విడుదల అవుతుంది. దీనిలో విటమిన్ సీ, పొటాషియం లాంటి ఖనిజాలు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అలాగే గుండెనూ అనారోగ్యాల బారిన పడకుండా చేస్తాయి.
తులసి ఆకులు :
2017లో జరిగిన ఓ అధ్యయనంలో తులసి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మందులా పని చేస్తున్నట్లు తేలింది. ప్రీడయాబెటిక్, డయాబెటిక్ స్థితుల్లో ఉన్న వారు దీన్ని రోజూ తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు తగ్గినట్లుగా వెల్లడయ్యింది. అధిక కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్ లాంటివీ దీని వల్ల తగ్గుతున్నట్లు తేలింది.
డయాబెటిక్ లక్షణాలు ఉన్న వారు పై ఆకులన్నింటినీ రోజు వారీ డైట్‌లో భాగంగా తీసుకుంటూ ఉండటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.