Japanese parenting: జపనీయుల పిల్లలు ప్రపంచంలోనే ఆరోగ్యవంతులు.. వాళ్ల పేరెంటింగ్ సీక్రెట్స్ ఇవే
Japanese parenting: జపనీయుల పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక విధానాలు పాటిస్తారు. అవేంటో తెల్సుకుందాం. వీలైతే మనమూ పాటిద్దాం.
పిల్లల ఆరోగ్యం విషయంలో జపనీయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జపనీయల పిల్లలు ప్రపంచంలోని అందరి పిల్లల్లో కన్నా ఆరోగ్య వంతులట. దానికి కారణం వాళ్ల పెంపకమే. వీళ్లలో ఊబకాయం తక్కువ, శారీరక ఫిట్‌నెస్ ఎక్కువ. ప్రతి దేశంలోనూ ఆరోగ్యంగా ఉండే పిల్లలుంటారు. కానీ జపనీయుల్లో ఈ సంఖ్య ఎక్కువ. అలాగనీ దానికి చాలా క్లిష్టమైన విధానాలేమీ వాళ్లు పాటించట్లేదు. చాలా సింపుల్ పద్ధతులతో దీన్ని వాళ్లు సాధిస్తున్నారు. పిల్లల ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషించేవి ఇల్లు, స్కూల్. ఈ రెండు చోట్లా వాళ్లు ప్రత్యేక విధానాలు పాటిస్తున్నారు. వాళ్లు పాటించే ఈ విధానాలే పిల్లలు ఇలా ఉండటానికి కారణ . అవేంటో తెల్సుకుని మనమూ పాటిద్దాం.
జపనీయుల విధానాలు:
1. పోషకాలున్న ఆహారం:
జపనీయులు ఎక్కువగా తాజాగా, ఎలాంటి ప్రాసెస్ చేయని ఆహారాన్నే ఎక్కువగా తింటారు. సాంప్రదాయ జపనీయుల తిండిలో కూరగాయలు, పండ్లు, సముద్ర ఆహారం, మాంసాలు, ధాన్యాలు సమపాళ్లలో ఉంటాయి. అలాగా చాలా మితంగా భుజిస్తారు. చిన్న ప్లేట్లలో తింటారు. దానివల్ల వాళ్లు తినే ఆహారం మీద నియంత్రణ వస్తుంది. వీటిలో పాటే ఎక్కువ పులియబెట్టిన ఆహారాలు తింటారు. ఊరబెట్టిన కూరగాయలూ తీసుకుంటారు. వీటిలో ప్రొబయాటిక్స్ ఎక్కువగా ఉండటమే కారణం.
ఇంట్లో ఇదే విధానాలు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు. మన ఇంట్లోనూ పిల్లలకు ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు పెట్టకుండా చూస్కోవాలి. శాకాహారం ఎక్కువగా తినేలా చూడాలి. చిన్న వయసు నుంచి అన్ని రకాల రుచులను పరిచయం చేయాలి. స్వీట్లకు బదులు పండ్లు, పెరుగు లాంటివాటివి అలవాటు చేయాలి. పెద్ద ప్లేట్లకు బదులు చిన్న బౌల్స్, ప్లేట్లలో తినడం మొదలుపెట్టొచ్చు.
2. స్కూళ్లలో ఫుడ్ రూల్స్:
జపనీయులు స్కూళ్లో కూడా ఆరోగ్య గురించి ప్రత్యేకంగా వివరిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి నేర్పిస్తారు. స్కూళ్లలో ఫుడ్ రూల్స్ కూడా ఉంటాయి. ఎక్కువ తీపి, కొవ్వు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ పాఠశాలకు తీసుకురావడం నిషిద్దం. గర్భవతిగా ఉన్న తల్లికి డాక్టర్లు షోకికు అనే విధానం ఫాలో అవ్వమని చెబుతారు. దీని అర్థం ఫుడ్ ఎడ్యుకేషన్. పిల్లలకు పోషణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి చిన్న వయసులోనే చెప్పడం. వాళ్లకు ఎలాంటి ఆహారం మేలు చేస్తుందని చిన్న వయసు నుంచే చెప్పాలి. ఎందుకు తినాలో చెప్పాలి. శరీరానికి, ఈ భూమికి, ఆహారానికి ఉన్న సంబంధాన్ని చెప్పడం.
3. మిత భోజనం:
తినేటప్పుడు ఆహారానికి గౌరవం ఇస్తారు. పిల్లలకు దీన్ని నేర్పుతారు. నిదానంగా తినేలా, ప్రతి ముద్ద బాగా నమిలేలా, ఆస్వాదిస్తూ తినడం నేర్పిస్తారు. అలాగే వాళ్ల ఆకలిని అర్థం చేసుకోవడం నేర్పుతారు. కుటుంబమంతా కలిసే భోజనం చేస్తారు. మనం కూడా తినేటప్పుడు ఇంట్లో టీవీ పెట్టుకుని కూర్చోకుండా మంచి వాతావరణంలో భోంచేయాలి. పిల్లలకు తినే విధానం నేర్పించాలి. ఆకలిని, కడుపు నిండినప్పుడు చెప్పడాన్ని నేర్పించాలి. కొవ్వు, కేలరీలంటూ అనవసరమైన చర్చలు పెట్టకండి. బదులుగా ఆహారం ఎక్కడనుంచి వచ్చింది? దాని రుచి ఏంటి? గుణాలేంటి? ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ వాళ్ల తినే గుణాన్ని మెరుగుపరుస్తాయి.
4. శారీరక శ్రమ:
జపనీయుల జీవన విధానంలో శారీరక శ్రమ భాగంగా ఉంటుంది. స్కూళ్లో, ఇంట్లో పిల్లలకు వ్యాయామాలు చేయడం అలవాటు చేస్తారు. ప్రకృతిలో బయట ఆడుకోవడం, నడిచి వెళ్లడం లాంటివి చేస్తారు. మనమూ వీటిని అలవాటు చేయాలి. కుటుంబమంతా కలిసి పార్కుకు వెళ్లడం, ప్రకృతిలో గడపడం చేయాలి. పిల్లలతో కలిసి సమయం గడపాలి. దీనవల్ల వాళ్లకు అలవాటు అవ్వడంతో పాటూ మీకు వాళ్లతో సమయం గడిపినట్లుంటుంది.