Raisins and Saffron for sleep: ఎండుద్రాక్ష, కుంకుమపువ్వుతో.. నిద్ర లేమి దూరం
Raisins and Saffron for sleep: ఎన్ని చిట్కాలు పాటించినా నిద్ర మాత్రం పట్టట్లేదా. అయితే ఎండుద్రాక్ష, కుంకుమ పువ్వును ఇలా వాడి చూడండి. తప్పకుండా ఫలితం ఉంటుంది.
ఉరుకుల పరుగుల జీవితాల్లో ఈ మధ్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య నిద్రలేమి. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల సేపు నిద్రపోవడం ఆరోగ్యకరం. లేదంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఒత్తిడి, ఆందోళనల వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, బీపీ లాంటి వాటితో బాధ పడాల్సి వస్తుంది. మరి చక్కగా నిద్ర పట్టాలంటే ఇంట్లో ఉండే పదార్థాలు కొన్ని మనకు బాగా పనికి వస్తాయి. వాటిని ఎలా ఎప్పుడు తినాలో తెలిస్తే చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది. అవేంటంటే..
ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు :
ఎండు కిస్‌మిస్‌ని తీసుకుని వాటిని నాలుగు గంటల పాటు నానబెట్టండి. తర్వాత వాటిని బాగా మ్యాష్ చేసి నీటిని వడకట్టండి. దాంట్లో కుంకుమ పువ్వు, కాస్త జాజికాయ పొడిని కలపండి. మరోసారి వడగట్టి ఆ నీటిని నిద్రపోవడానికి గంట ముందు తాగండి. ఇది శరీరానికి చలవ చేస్తుంది. దీంతో కళ్లు మూతలు పడి నిద్ర వచ్చేస్తుంది.
పాలలో తేనె చేర్చి :
పాలను కాచి చల్లార్చాలి. అవి గోరు వెచ్చగా అయ్యాక దానిలో ఓ టీ స్పూన్ స్వచ్ఛమైన తేనెను కలపాలి. వాటిని నిద్రపోవడానికి ముందు తాగితే హాయిగా నిద్ర పడుతుంది. అలాగే పాలను మరిగించేప్పుడు అందులో రెండు కాస్త యాలకుల పొడిని లేదా దాల్చిన చెక్క పొడిని వేయండి. తర్వాత తేనెను కలుపుకుని తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
వాల్‌నట్స్, పిస్తా :
బాదాం, వాల్నట్స్, పిస్తా తదితర నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ల వల్ల సుఖంగా నిద్ర పడుతుంది. కాబట్టి నిద్రకు రెండు గంటల ముందు వీటిని బాగా నమిలి తినాలి. వీటి వల్ల శరీరంలో నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ విడుదలవుతుంది. దీని వల్ల చక్కగా నిద్ర పడుతుంది.
స్నానం చేయండి :
నిద్రపోయే ముందు కచ్చితంగా స్నానం చేయండి. చలికాలంలో అయితే గోరు వెచ్చని నీటితో చేసేందుకు ప్రయత్నించండి. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రం కావడమే కాకుండా ఒత్తిడి, ఆందోళన.. లాంటివీ తగ్గుతాయి. అందుకనే శరీరం నుంచి బరువు దిగిపోయినట్లుగా తేలికగా అనిపిస్తుంది. అలాంటప్పుడు సహజంగానే నిద్ర ముంచుకొస్తుంది.
అరటిపండు :
నిద్రపోవడానికి రెండు గంటల ముందు అరటిపండును తినేందుకు ప్రయత్నించండి. దీనిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అందువల్ల హాయిగా నిద్ర పడుతుంది.
విప్ప పువ్వు :
నిద్రలేమి సమస్యలకు విప్పపువ్వు చెక్ పెడుతుంది. రెండు విప్ప పువ్వులను నోట్లో వేసుకుని చప్పరించి మింగేయాలి. ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.