Bathing Benefits: శుభ్రత కోసమే స్నానం అనుకుంటున్నారా? ప్రయోజనాలు అంతకుమించి..
Bathing Benefits: స్నానం చేయడం కేవలం పరిశుభ్రత కోసమే కాదు. దానివల్ల అనేక ఇతర ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.
శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మనం రోజూ స్నానం చేస్తుంటాం. అందువల్ల మన చర్మం, జుట్టు శుభ్రపడతాయని అనుకుంటాం. చర్మంపై పేరుకున్న మృత కణాలు, మళినాలు పోతాయని అనుకుంటాం. రోజూ రెండు పూటలా స్నానం చేయడం వల్ల అంతకు మించిన ప్రయోజనాలు ఉన్నాయి. పైగా ఇవన్నీ సైంటిఫిక్‌గా నిరూపితమయ్యాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
గుండెకు ఆరోగ్యం :
గోరు వెచ్చని లేదా చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మరీ వేడి నీళ్లతో మాత్రం స్నానం వద్దని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండె మీద లేనిపోని ఒత్తిడి తలెత్తే ప్రమాదం ఉంటుందంటున్నారు.
కండరాలు, కీళ్లకు ప్రయోజనం :
గోరువెచ్చని లేదా చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలోని కండరాలు, ఎముకలు, కీళ్లకు ప్రయోజనం చేకూరుతుంది. అవి ఉత్తేజితం అవడం ద్వారా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అందుకనే చాలా అనారోగ్యంగా ఉన్నవారు స్నానం చేసిన తర్వాత కాస్త బాగున్నట్లు అనుభూతికి లోనవుతుంటారు. నీరసంగా ఉన్న వారు, జలుబు, ఫ్లూ ఉన్నవారు ముఖ్యంగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. స్నానంతో పాటు వేడి నీటి ఆవిరీ నెమ్మదిగా లోపలికి వెళుతుంది. తద్వారా శ్వాస మెరుగై శరీరంలోకి ఎక్కువ ఆక్సిజన్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తీ మెరుగవుతుంది.
ఒత్తిడికి టబ్ బాత్ :
మీరు గనుక ఒత్తిడిలో ఉన్నట్లయితే టబ్ నిండా చల్లటి నీటిని నింపుకుని ఓ అరగంట సేపు శరీరాన్ని పూర్తిగా నీటిలో మునగనిచ్చి అలా విశ్రాంతి తీసుకోండి. దీని వల్ల మనలోని నాడీ వ్యవస్థకు చాలా ప్రయోజనం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే నడుంనొప్పి లేదా వెన్నెముకకు సంబంధించిన ఇబ్బందులతో ఉన్నప్పుడు గోరు వెచ్చని నీటితో టబ్ బాత్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వీరికి హైడ్రో థెరపీ చికిత్సా విధానాలూ అందుబాటులో ఉన్నాయి. నీటిలో ఉండే పీడనం, ఉష్ణోగ్రతలు నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
హార్మోన్ల సమతుల్యం :
కొన్ని సంతానోత్పత్తి సమస్యలకు చన్నీటి స్నానం వల్ల ఉపయోగం ఉంటుంది. అడ్రినోకోర్టికోట్రోపిక్ వంటి పిట్యూటరీ గ్రంధి విడుదల చేసే హార్మోన్లు, బీటా ఎండార్ఫినాండ్ కార్టిసాల్ వంటి ఇతర హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అలాగే వేడి నీటి స్నానం వల్ల మెదడు విడుదల చేసే సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మనల్ని ఆనందంగా ఉంచుతుంది.
టాపిక్