Diwali Recipes 2023: పండుగ రోజు షుగరున్న వారూ తినగలిగే స్వీట్‌ రెసీపీలివిగో..-know how to make diabetes friendly sweet recipes for this diwali ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know How To Make Diabetes Friendly Sweet Recipes For This Diwali

Diwali Recipes 2023: పండుగ రోజు షుగరున్న వారూ తినగలిగే స్వీట్‌ రెసీపీలివిగో..

HT Telugu Desk HT Telugu
Nov 12, 2023 11:00 AM IST

Diwali Recipes 2023: పండగ రోజున నోరు తీపి చేసుకోవాలన్నా కట్టడి చేసుకుంటున్నారా? అయితే షుగర్ పేషెంట్లు కూడా తినగలిగే కొన్ని కమ్మటి స్వీట్ రెసిపీలున్నాయి. అవెలా చేయాలో చూసి మీరూ ప్రయత్నించండి.

డయాబెటిక్ స్వీట్స్
డయాబెటిక్ స్వీట్స్ (freepik)

దీపావళి పండుగ అంటేనే ఇంట్లో రకరకాల తీపి పదార్థాలు నోరూరిస్తాయి. బూరెలు, కేసరి, హల్వా, సున్నుండలు, మిఠాయిలు.. ఇలా రక రకాల స్వీట్లను తయారు చేసి పెడతారు. అయితే మధుమేహంతో ఉన్న వారికి మాత్రం ఇవన్నీ తినడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. చక్కెర స్థాయిలు మళ్లీ పెరిగిపోతాయేమోనన్న ఆందోళన ఉంటుంది. అలాంటి సంశయాలేమీ లేకుండా వీరూ చక్కగా తినగలిగే కొన్ని తీపి పదార్థాలు ఉన్నాయి. ఆ రెసిపీలేంటో, తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం.

గులాబ్‌ జామూన్‌లు :

గులాబ్‌ జామూన్‌లు అనగానే పంచదార పాకంలో వేసి తయారు చేస్తారు. దీన్ని షుగరున్న వారు తినడం ఎలా? అని కంగారు పడకండి. దీని తయారీలో చిన్న మార్పుతో వీరూ తప్పకుండా వీటిని తినొచ్చు. అదెలాగంటే స్టీవియాతో. స్టీవియా ఆకుల పొడిని సహజమైన స్వీటెనర్‌గా చెబుతారు. ఇది మామూలు పంచదారతో పోలిస్తే రెండు మూడు వందల రెట్లు ఎక్కువ తీయగా ఉంటుంది. ఇది మనం తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని యునైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తేల్చింది. పైగా ఇది పూర్తిగా షుగర్‌ ఫ్రీ. దీంతో తీపి వల్ల ఇబ్బంది అవుతుందేమోనన్న అనుమానమే అక్కర్లేదు. కాస్త నీటిని మరిగించి అందులో తగినంత స్టీవియా పొడిని వేసుకుని పొంగు వచ్చాక కాస్త యాలకుల పొడి, రోజ్‌సిరప్‌ లాంటి వాటిని వేసుకుని సిరప్‌ తయారు చేసుకోవాలి. అందులో వేయించిన వేడి వేడి గులాబ్‌ జామూన్‌లను జార విడిస్తే సరి. చల్లారాక చక్కగా ఆరగించేయవచ్చు.

నట్స్‌ లడ్డూ :

కాజూ, బాదాం, ఖర్జూరం, అంజీరా.. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ అన్నింటినీ తీసుకోండి. వాటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ చేసుకోండి. మరీ మెత్తగా అయితే అంత బాగోదు. వాటిలో కాస్త అవిశె గింజలు, గుమ్మడి గింజల్లాంటి వాటినీ చిన్నగా ముక్కల్లా చేసి, లేదా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. కాస్త నెయ్యిని, యాలకుల పొడిని వేయండి. తీపి ఎక్కువ కావాలనుకుంటే కాస్త ఖర్జూరాన్ని ఎక్కువగా వేసుకోండి. అన్నింటినీ బాగా కలిపి ఉండలుగా చేసుకోండి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికీ చాలా మంచిది. అదనంగా చక్కెర వేయలేదు కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులూ చక్కగా తినేయొచ్చు.

పాయసం :

దీపావళికి అందరిళ్లల్లో ఎక్కువగా చేసుకునేది పాయసం. అయితే దీనిలో బెల్లం లేదా పంచదార వేసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందే. మామూలుగా పాయసం తయారు చేసిన తర్వాత చివరిగా పంచదార లేదా బెల్లాన్ని వేస్తారు కదా. ఆ దశలో పంచదార వేయడానికి ముందే కాస్త పాయసాన్ని పక్కకు తీయండి. అందులో కాస్త కుంకుమపువ్వు, ఖర్జూరం ముక్కలు, చిన్న అరటి పండు ముక్కలు వేసి కలిపేయండి. తీపి చేర్చి తయారు చేసినదాని కంటే దీన్ని తినడం వల్ల తక్కువ గ్లూకోజ్‌ లోపలికి చేరుతుంది.

WhatsApp channel