Chana Carrot Curry: శనగపప్పు క్యారట్ కూర.. పది నిమిషాల్లో రెడీ..
Chana Carrot Curry: శనగపప్పు క్యారట్ కూర పదే నిమిషాల్లో సిద్ధమయ్యే రెసిపీ. దీని తయారీ ఎలాగో వివరంగా, పక్కా కొలతలతో సహా చూసేయండి.
శనగపప్పు క్యారట్ కూర (flickr)
ఇంట్లో ఒకట్రెండు క్యారట్లు, కాస్త శనగపప్పు ఉంటే టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. క్యారట్ లేకుండా కేవలం శనగపప్పుతో అయినా ఈ కూర వండేయొచ్చు. మరీ పప్పులా మెత్తగా కాకుండా కాస్త పొడిపొడిగా శనగపప్పు ఉడికించుకుని చేస్తాం ఈ కూర. దీని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి. చపాతీలోకి, అన్నంలోకి ఈ కూర బాగుంటుంది.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు శనగపప్పు
2 చెంచాల కొబ్బరి తురుము
1 ఉల్లిపాయ, సన్నని ముక్కలు
2 పచ్చిమిర్చి చీలికలు
2 క్యారట్, సన్నటి ముక్కలు
2 చెంచాల వంటనూనె
పావు టీస్పూన్ ఆవాలు
పావు టీస్పూన్ జీలకర్ర
పావు చెంచా మినప్పప్పు
3 వెల్లుల్లి రెబ్బలు
2 ఎండుమిర్చి
తగినంత ఉప్పు
కరివేపాకు కొద్దిగా
కొద్దిగా కొత్తిమీర తరుగు
తయారీ విధానం:
- ముందుగా శనగపప్పను శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా పొడిగా ఉడికించుకోవాలి.
- ఇప్పుడు ప్యాన్‌లో నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపటలాడనివ్వాలి. మినప్పప్పు కూడా వేసుకుని వేయించాలి. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకుని నిమిషం ఆగాలి.
- పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కాస్త రంగు మారేదాకా వేయించుకోవాలి. క్యారట్ ముక్కలు కూడా వేసి కలియబెట్టాలి.
- ఉప్పు వేసుకుని కలుపుకుని మూతపెట్టి క్యారట్ ముక్కలు మెత్తబడేదాకా ఆగాలి. ఇప్పుడు ఉడికించుకున్న శగనపప్పును వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. ఒక కప్పు నీళ్లు పోసుకుని మూత పెట్టుకోవాలి.
- చివరగా పప్పు మెత్తబడ్డాక కొబ్బరి తురుము, కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే సరి. వేడివేడిగా శనగపప్పు, క్యారట్ కర్రీ సిద్ధం.