Kerala carrot poriyal: కేరళ స్టైల్ క్యారట్ పొరియల్ కర్రీ.. 5 నిమిషాల్లో సిద్దం..
Kerala carrot poriyal: కేరళ స్టైల్ లో క్యారట్ పొరియల్ ఎప్పుడైనా ప్రయత్నించారా? చాలా రుచిగా ఉంటుంది. దాన్నెలా చేసుకోవాలో వివరంగా చూసేయండి.
క్యారట్ పొరియాల్
కేరళ స్టైల్ కర్రీ అంటే ఆ రుచే ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కువగా కొబ్బరి వాడి చేస్తారు కాబట్టి మామూలు కూరలు కూడా ప్రత్యేకంగా అనిపిస్తాయి. అలాంటిదే క్యారట్ పొరియాల్. చాలా సింపుల్ గా ఈ కూర రెడీ అయిపోతుంది. మామూలు క్యారట్ కర్రీనే కేరళ స్టైల్ లో ఎలా విభిన్న రుచితో చేయాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు:
పావు కేజీ క్యారట్, సన్నని ముక్కలు
సగం చెంచా పెసరపప్పు
పావు చెంచా ఆవాలు
పావు చెంచా మినప్పప్పు
2 ఎండుమిర్చి
1 కరివేపాకు రెబ్బ
పావు చెంచా పసుపు
4 చెంచాల కొబ్బరి తురుము
2 పచ్చిమిర్చి, సన్నని ముక్కలు
పావు చెంచా జీలకర్ర
2 చెంచాల వంటనూనె
తగినంత ఉప్పు
తయారీ విధానం:
- ముందుగా పెసరపప్పును కడిగి పదినిమిషాల పాటూ నీళ్లలో నానబెట్టుకోవాలి ఈ లోపు కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి.
- కాస్త బరకగా ఉన్నా పరవాలేదు. అవసరమైతే ఒక చెంచా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి.
- కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు వేసుకుని వేగాక , ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి.
- ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు, పసుపు, క్యారట్ ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టుకుని వేగనివ్వాలి.
- పావు కప్పు నీళ్లు, ఉప్పు వేసి ముక్కలు మెత్తబడేదాకా మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసుకుని కలపాలి. చిన్న మంట మీద నిమిషం పాటూ ఉడకనిస్తే చాలు. వేడి వేడి క్యారట్ పొరియాల్ సిద్ధం.
టాపిక్