Amla Jam: పిల్లలు ఉసిరికాయల్ని ఇష్టంగా తినాలంటే.. ఈ ఉసిరి జామ్ రెసిపీ ప్రయత్నించండి..
Amla Jam: పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినగలిగే ఉసిరి కాయ జామ్ తయారీ చాలా సులభం. దాన్నెలా తయారు చేయాలో పక్కాగా తెలుసుకోండి.
ఉసిరికాయలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఈ కాలంలో ఎక్కువగా లభ్యం అయ్యే వీటిలో సీ విటమిన్ అధికంగా ఉంటుంది. దీనితో పాటు బీ కాంప్లెక్స్ విటమిన్లు, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్, కెరోటిన్ లాంటి పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఉన్న ఈ కాయల్ని తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలని అనుకునే వారు వీటిని తినడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి పేగుల ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. జీర్ణ సమస్యలు లేకుండా చేస్తాయి. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుల్ని తగ్గించడంలోనూ ఇవి సమర్థవంతంగా పని చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పని చేయడంలోనూ ఇవి సహకరిస్తాయి. ఇన్ని లాభాలున్న వీటిని తినాలంటేనే అసలు సమస్య మొదలవుతుంది.
మన దగ్గర ఉసిరి కాయల్ని ఎక్కువగా పచ్చడి రూపంలోనూ, క్యాండీల రూపంలోనూ తినే అలవాటు ఉంటుంది. అయితే పిల్లలు వీటిని తినేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి వారికి కూడా కొన్ని రకాలుగా చేసి పెట్టడం వల్ల వారు లొట్టలేసుకుంటూ తింటారు. ఆ రెసిపీ ఏంటంటే..
ఉసిరి కాయ జామ్ :
ఉసిరి కాయ జామ్ అనేది ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటుగా పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తినగలిగేలా ఉంటుంది. 20 కమలా ఫలాలను తినడం వల్ల ఎంత సీ విటమిన్ వస్తుందో కేవలం వంద గ్రాముల ఉసిరి కాయల్ని తింటే అంత వస్తుంది. ఇది పిల్లల రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది.
అరకేజీ వరకు ఉసిరి కాయల్ని తీసుకోండి. మీ రుచికి తగినంతగా బెల్లం, కొద్దిగా యాలకుల పొడిని సిద్ధం చేసుకుంటే సరిపోతుంది.
- ముందుగా ఉసిరి కాయల్ని తీసుకుని శుభ్రంగా కడుక్కుని గిన్నెలో వేసి అవి మునిగేంత వరకు నీటిని పోసుకోవాలి. వాటిని మెత్తగా అయ్యే వరకు స్టౌ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి.
- తర్వాత నీటిని వంచేసి చల్లారనివ్వాలి. గింజలు తీసేసి ముక్కల్ని వేరు చేసుకోవాలి.
- వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేయాలి. ఇప్పుడు మరో పేన్ పెట్టి స్టౌ ముట్టించాలి. దానిలో ఈ ఉసిరి పేస్ట్‌ని, బెల్లం పొడిని వేసి కలియబెడుతూ ఉండాలి.
- అది కొంత సేపటికి ఉడికి దగ్గరబడి రంగు మారుతుంది. ఆ సమయంలో అందులోకి మెత్తగా దంచిన యాలుకల పొడిని వేసి కలియబెట్టండి. జెల్లీ మాదిరిగా తయారైనప్పుడు కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టౌ కట్టేయండి.
- చల్లారిన తర్వాత ఓ గాజు సీసాలోకి తీసుకుని మూత పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోండి. కనీసం రెండు, మూడు నెలల వరకు ఇది తాజాగా రుచిగా పాడు కాకుండా ఉంటుంది.
అయితే సీ విటమిన్ ఎక్కువగా ఉన్న పండ్లను, కూరగాయలను వేడి చేయడం వల్ల అది తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి వాటిని వీలైనంత వరకు తాజాగా తినడమే ఉత్తమం. అలా వీలు కాని పక్షంలో మాత్రమే ఇలాంటి రెసిపీలను ప్రయత్నించాలి.