Amla Candy Recipe: స్టౌ వెలిగించక్కర్లేకుండా ఇలా ఉసిరి క్యాండీ చేసిచూడండి.. అదుర్స్‌!-know how to make amla candy recipe at home without heat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amla Candy Recipe: స్టౌ వెలిగించక్కర్లేకుండా ఇలా ఉసిరి క్యాండీ చేసిచూడండి.. అదుర్స్‌!

Amla Candy Recipe: స్టౌ వెలిగించక్కర్లేకుండా ఇలా ఉసిరి క్యాండీ చేసిచూడండి.. అదుర్స్‌!

HT Telugu Desk HT Telugu
Nov 15, 2023 04:41 PM IST

Amla Candy Recipe: ఉసిరికాయల్ని వేడిచేయకుండానే ఆమ్లా క్యాండీని తయారు చేయొచ్చు. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు కూడా. వాటినెలా తయారు చేయాలో చూసేయండి.

ఆమ్లా క్యాండీ
ఆమ్లా క్యాండీ (freepik)

రోజుకో ఆమ్లా క్యాండీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో సీ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా అది మనల్ని కాపాడుతుంది. అందుకనే సంవత్సరం పొడవుగా రోజుకో ఉసిరి క్యాండీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంట్లో పిల్లలు, పెద్దలు కూడా దీన్ని ఒకటి తినేందుకు ప్రయత్నించాలి. మరి ఆరోగ్యకరమైన ఆమ్లా క్యాండీని పోషకాలు పోకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

ఉసిరి క్యాండీలు ఎలా చేయాలంటే:

ముందుగా ఉసిరి కాయల్ని కడిగి ఆరబెట్టుకోవాలి. మంచిగా ఎండ ఉన్న రోజు ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పోసుకోవాలి. అలా చేయడం వల్ల గింజ నుంచి తేలికగా ఉసిరి ముక్కలు ఊడి వస్తాయి. ఇప్పుడు వాటిని చీరికలుగా ముక్కలు కోసుకోవాలి. గింజల్ని తీసేయాలి. ఇలా తీసి పెట్టుకున్న ముక్కలకు సరిపడా బెల్లం పొడిని తీసుకోవాలి. ఒక గాజు సీసా తీసుకుని అందులో ఒక పొర బెల్లం పొడి, ఒక పొడి ఉసిరి ముక్కలు వేసుకుంటూ రావాలి. తర్వాత మూత పెట్టేసి మూడు రోజుల పాటు అలా ఉంచేయాలి.

మూడు రోజుల తర్వాత మూత తీసి చిక్కంతో ముక్కల్ని వడగట్టేయండి. రసం వేరుగా, ఉసిరి ముక్కలు వేరుగా చేయండి. ఇలా వచ్చిన రసాన్ని కాస్త నీరు కలిపి షర్బత్‌లా తాగేయండి. దీనిలో పుష్కలంగా సి విటమిన్‌, ఐరన్లు ఉంటాయి. ఇవి మన రక్త వృద్ధికి తోర్పడతాయి. అలాగే బెల్లం రసం నుంచి తీసి పెట్టిన ముక్కల్ని ఎండలో ఆరబొయ్యండి. ఇలా మూడు నాలుగు రోజుల పాటు గలగల్లాడే వరకు ఎండబెట్టండి. నాలుగు రోజుల తర్వాత కావాలనుకుంటే పైన కాస్త పంచదార పొడి చల్లి కోట్‌ చేయండి. తర్వాత వీటిని ఎయిర్‌ టైట్‌ సీసాలోకి తీసుకుని మూత పెట్టుకోండి. అంతే.. ఎంతో హెల్దీగా ఉండే ఆమ్లా క్యాండీ సిద్ధమైపోయినట్లే. దీన్ని మనం అసలు వేడి చేయలేదు. కాబట్టి దీనిలోని పోషకాలు ఎక్కువగా నష్టపోవు. కాబట్టి వీటిని తిన్నప్పుడు అవి పుష్కలంగా మనకు అందుతాయి.

వీటిని రోజుకొకటి చొప్పును క్రమంతా తింటూ ఉంటే శరీరంలోని కణజాలం అంతా బాగు అవుతుంది. ఎముకలు బలోపేతం అవుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్ల లాంటివి దరి చేరకుండా ఉంటాయి. జీవ క్రియ, గుండె, కాలేయ పని తీరులు మెరుగవుతాయి. చర్మం, జట్టు ఆరోగ్యకరంగా మారి కాంతులీనుతూ ఉంటుంది.

Whats_app_banner