Gulkand benefits: స్వీట్ పాన్‌లో వాడే గుల్కండ్ దేంతో చేస్తారు? ఇంట్లో చేసి వాడారంటే రుచి, ఆరోగ్యం-know how gulkand is made and know its health benefits and usage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gulkand Benefits: స్వీట్ పాన్‌లో వాడే గుల్కండ్ దేంతో చేస్తారు? ఇంట్లో చేసి వాడారంటే రుచి, ఆరోగ్యం

Gulkand benefits: స్వీట్ పాన్‌లో వాడే గుల్కండ్ దేంతో చేస్తారు? ఇంట్లో చేసి వాడారంటే రుచి, ఆరోగ్యం

Koutik Pranaya Sree HT Telugu
Jul 20, 2024 11:30 AM IST

Gulkand DIY, benefits: స్వీట్ పాన్ కి అంత టేస్ట్ ఇచ్చేది ఏంటో తెలుసా? పాన్ లో రాసే గుల్కండ్. దీన్ని మన డైట్ లో ఎలా చేర్చుకోవచ్చో చూడండి.

గుల్కండ్ లాభాలు
గుల్కండ్ లాభాలు (shutterstock)

స్వీట్ పాన్ అంటే మీకిష్టమా? మీరు తినే ఆ పాన్ కు రుచి ఇచ్చేది ఏంటో తెల్సా? గుల్కండ్.. దీన్ని పాన్ కు తీపిదనం తేవడానికి వాడతారు. గుల్కండ్ లో గుల్ అంటే గులాబీ, కండ్ అంటే తీపి అని అర్థం. ఇదొక సూపర్ ఫుడ్ . కడుపు సంబంధించిన వ్యాధులకు గుల్కండ్ తినడం మేలు చేస్తుంది. గుల్కండ్ ను దేశీ గులాబీ రేకులు, చక్కెరతో తయారు చేస్తారు. కొంతమంది దీనిని రోజ్ జామ్ అని పిలుస్తారు. మెదడు అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం పొందడంలో కూడా గుల్కండ్ చాలా మంచిదని చెబుతారు. దీని ప్రభావం వల్ల శరీరం చల్లగా ఉంటుంది, దీని వినియోగం మెదడులోని నరాలను రిలాక్స్ చేస్తుంది. గుల్కండ్ కేవలం పాన్ కే పరిమితం కాకుండా అనేక భారతీయ వంటకాల రుచిని పెంచడానికి కూడా ఉపయోగిస్తారు.

గుల్కండ్ ఎలా తయారు చేయాలి?

250 గ్రాముల దేశీ గులాబీ తాజా రేకులను తీసుకోండి. నీటితో బాగా కడిగి గుడ్డపై ఆరబెట్టాలి. నీళ్లన్నీ ఎండిపోయేలా ఫ్యాన్ కింద కాసేపు ఉంచాలి. 500 గ్రాముల పంచదార తీసుకుని దాన్ని పౌడర్ చేసుకోవాలి. దీన్ని గులాబీ రేకుల్లో కలపాలి. అలాగే ఒక టీస్పూన్ యాలకుల పొడి, అర టీస్పూన్ సోంపు పొడి కలపాలి. ఒక గాజు జార్ లో నింపి 10-12 రోజుల పాటు ఎండలో ఉంచితే పంచదార కరిగి గులాబీ రేకుల్లో బాగా కలిసిపోతుంది. అద్భుతమైన గుల్కండ్ సిద్ధం అయినట్లే.

గుల్కండ్ ఇలా తినొచ్చు..

1) గుల్కండ్ లో కొద్దిగా జీడిపప్పు పొడి, బాదం పొడి మిక్స్ చేసి జామ్ లాగా బ్రెడ్ మీద అప్లై చేయొచ్చు. వీటితో పాటు గుల్కండ్ లో కొబ్బరి పొడి కలిపి పిల్లల కోసం తీపి క్రిస్పీ పరాఠాలు తయారు చేయొచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.

2. గుల్కండ్ ను కొద్దిగా పాలలో వేసి మిక్సీ పట్టాలి. దీన్ని పాయసంలో కలపాలి. ఖీర్ రుచి అంత బాగా ఎలా వస్తుందో ఊహించరు. సువాసన కూడా అద్భుతంగా ఉంటుంది.

3) జీడిపప్పు మఖానా రోల్ తయారు చేసేటప్పుడు మధ్యలో గుల్కండ్ ను రాసుకోవాలి. చూడ్డానికి బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది.

4) మిల్క్ షేక్, లస్సీ లేదా బాదాం షేక్ లాంటివి తయారు చేసేటప్పుడు దానికి కొద్దిగా గుల్కండ్ జోడించడం వల్ల రుచి బాగుంటుంది.

5) చల్లటి నీటిలో కొద్దిగా గుల్కండ్, కొద్దిగా నిమ్మరసం, తేనె, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసి తాగాలి. తేమ, వేడి వాతావరణంలో ఆరోగ్యం బాగుంటుంది.

6) చల్లటి చిక్కటి పాలు లేదా పెరుగులో కొద్దిగా రోజ్ సిరప్, గుల్కండ్ వేసి డెజర్ట్ లా ఒక గిన్నెలో వేసి పైన తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కలతో సర్వ్ చేయాలి.

7) కొబ్బరి లడ్డూ తయారు చేసేటప్పుడు లడ్డూ మధ్యలో గుల్కండ్, ఇంకేవైనా గింజలతో కలిపి నింపాలి. లడ్డూ రుచి, పోషణ రెండూ పెరుగుతాయి.

ఇలా చేస్తే 6 నెలలైనా ఉంటుంది:

గుల్కండ్ ను మార్కెట్ నుండి కొనుగోలు చేసినా లేదా ఇంట్లో తయారుచేసినా, అది చాలా కాలం ఉంటుంది. సీసా నుండి గుల్కండ్ తీసినప్పుడల్లా పొడి చెంచాను ఉపయోగించాలి. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్ లో పెడితే ఈ గుల్కండ్ ను ఆరు నెలల పాటు సులభంగా వాడుకోవచ్చు.

గుల్కండ్ లాభాలు:

ఇది ఆయుర్వేదంలో ఉత్తమ ఔషధాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. గుల్కండ్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి ఉదర సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు లేదా పాలతో అర టీస్పూన్ నుండి ఒక టీస్పూన్ గుల్కండ్ కలిపి క్రమం తప్పకుండా తినండి.

ఎండాకాలంలో కొందరికి తరచూ ముక్కు కారే సమస్య వస్తుంటుంది. గుల్కండ్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

గుల్కండ్ తినడం వల్ల నోటి పూతలకి మేలు జరుగుతుంది. ఇది పిత్తాన్ని తగ్గించడం ద్వారా అల్సర్లలో చికాకును తగ్గిస్తుంది.

రాత్రి పడుకునేటప్పుడు గుల్కండ్ కలిపిన పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది ఎందుకంటే ఇది మనస్సును శాంతపరుస్తుంది. ఇది ఒత్తిడి, అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Whats_app_banner