Runny nose: ముక్కు కారడం ఆగట్లేదా.. ఈ చిట్కాలతో, ఆహారాలతో వెంటనే రిలీఫ్-how to stop runny nose with home remedies know some special tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Runny Nose: ముక్కు కారడం ఆగట్లేదా.. ఈ చిట్కాలతో, ఆహారాలతో వెంటనే రిలీఫ్

Runny nose: ముక్కు కారడం ఆగట్లేదా.. ఈ చిట్కాలతో, ఆహారాలతో వెంటనే రిలీఫ్

Koutik Pranaya Sree HT Telugu
Published Jul 13, 2024 02:00 PM IST

Runny nose: జలుబు అయినప్పుడు ముక్కు కారడం ఆగకపోతే ఏ పనీ చేయలేము. దీన్ని వెంటనే తగ్గించే చిట్కాలు చూడండి.

ముక్కు కారడం తగ్గించే చిట్కాలు
ముక్కు కారడం తగ్గించే చిట్కాలు (freepik)

జలుబు చేసిందంటే చాలు ముక్కు కారడం ఆగదు చాలా మందిలో. రోజంతా కర్చీఫ్ తోనే, టిష్యూతోనే ముక్కు తుడిచి తుడిచి ఎర్రగా అయిపోతుంది. ముక్కు దగ్గర నొప్పి, మంట వస్తుంది. దీన్నుంచి వెంటనే ఉపశమనం ఇచ్చే కొన్ని మార్గాలు చూడండి.

ముక్కు కారడం ఆపే చిట్కాలు:

1. జలనేతి:

ఎప్పుడో ఒకసారి జలుబు చేయడం కాకుండా మీరు తరచూ జలుబు బారిన పడితే జలనేతి వల్ల ఉపశమనం దొరుకుతుంది. మార్కెట్ల జలనేతి పాట్ దొరుకుతుంది. సలైన్ వాటర్ నింపి దీంతో చిన్న పాటి ప్రక్రియ చేస్తే వెంటనే జలుబు నుంచి ఉపశమనం ఉంటుంది

2. కాప్సైసిన్:

పచ్చిమిర్చిలో ఉండే క్యాస్పైసిన్ ముక్కు దిబ్బడ నుంచి వెంటనే ఉపశమనం ఇస్తుంది. అందుకే కాస్త కారంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే జలుబు చేసినప్పుడు ఉపశమనం అనిపిస్తుంది. క్యాప్సైసిన్ ఉన్న నాజల్ స్ప్రే కూడా వైద్యుల సలహాతో వాడొచ్చు. ఇది ముక్కు కారడాన్ని తగ్గిస్తుంది.

3. వేడి కాపడం:

నుదురు, ముక్కు, చెంపల మీద వేడి కాపడం పెట్టడం వల్ల ముక్కు కారడం తగ్గుతుంది. వేడి నీళ్లలో ముంచి పిండేసిన టవెల్ దీనికోసం వాడొచ్చు. ముఖం మీద ముఖ్యంగా నుదురు, ముక్కలు, చెంపల మీద కాపడం వల్ల శ్వాస తీసుకోవడం సులువవుతుంది. అంతేకాక వేడినీటితో స్నానం చేసినా కాస్త ఫలితం ఉంటుంది.

4. హెర్బల్ టీ:

అల్లం, మిరియాలు, పెప్పర్ మింట్ లాంటి హెర్బల్ టీలు తాగితే వెంటనే ఉపశమనం దొరుకుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

అల్లం టీ: చిన్న అల్లం ముక్క తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి. కప్పు నీల్లలో కనీసం అయిదు నిమిషాలు మరిగించుకుని వడకట్టుకుని తాగితే వెంటనే ఉపశమనం ఉంటుంది.

హనీ టీ: కప్పు నీళ్లను బాగా మరిగించాలి. స్టవ్ కట్టేసి కప్పులో పోసుకుని చెంచా తేనె, అరచెక్క నిమ్మరసం కలుపుకుని వేడిగా తాగితే ముక్కు కారడం కాస్త తగ్గుతుంది.

5. ఆవిరి పట్టడం:

ఆవిరి పట్టడం వల్ల శ్వాస తీసుకోవడం కాస్త సులవవుతుంది. ఒక పాత్రలో వేడి నీళ్లు పోసుకుని కాస్త దూరంలో ముఖం వంచి ఉంచి ఆవిరి పట్టాలి. ఆ నీళ్లలో నీలగిరి (యూకలిప్టస్) నూనె లేదా పెప్పర్ మింట్ నూనె రెండు మూడు చుక్కలు వేయాలి. వీటిని పీల్చుకుంటే వెంటనే ఉపశమనం ఉంది. వేడి నీటికీ మీ ముఖానికి కనీసం 10 ఇంచుల దూరం ఉండాలి. 5 నిమిషాలైనా ఆవిరి పట్టాలి. తర్వాత ఒకసారి ముక్కు శుభ్రం చేసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.

6. నీళ్లు బాగా తాగడం:

జలుబు చేసినప్పుడు నీళ్లు తాగాలనిపించదు. దానివల్ల సమస్య ఇంకా ఎక్కువవుతుంది. నీళ్లు ఎంత ఎక్కువ తాగితే ఇన్ఫెక్షన్ అంత తొందరగా తగ్గుతుంది.

7. విటమిన్ సి:

జలుబు చేసిందంటే పుల్లటి పండ్లు తినొద్దంటారు. కానీ నిజం కాదు. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. స్ట్రాబెర్రీ, ఆరెంజ్, క్యాప్సికం, బ్రకోలీ లాంటివి తీసుకోవాలి. అలాగే తాజా నారింజ రసం కూడా తాగొచ్చు. జలుబు చేసినప్పుడు వీటికి దూరంగా ఉండక్కర్లేదు.

Whats_app_banner