Know about Jaggery: పంచదార బదులు బెల్లం వాడితే మంచిదా కాదా తెలుసుకోండి..
Know about Jaggery: పంచదారకు బదులుగా బెల్లం వాడితే ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేంటో మీరూ వివరంగా తెలుసుకోండి.
మనం రోజూ టీలు, కాఫీలు మొదలుకుని మిఠాయిలు, స్వీట్ల వరకు అన్నింటిలోనూ పంచదారను వాడేస్తుంటాం. బెల్లాన్ని ఐదు(పంచ) సార్లు కరిగించి రసాయనాలను కలిపి తెల్లగా దీన్ని తయారు చేస్తారు. కాబట్టే దీనికి పంచదార అనే పేరొచ్చింది. భారతీయులు ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా బెల్లాన్నే వాడేవారు. బ్రిటీషు వారు ఈ పంచదార వాడకాన్ని మనకు అలవాటు చేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అంతకంతకూ దీని వాడకం పెరుగుతూ ఉందే తప్ప తగ్గడం లేదు. దీని వాడకం వల్ల మనకు కొలెస్ట్రాల్, మధుమేహం, గుండెజబ్బులు, మెదడులో రక్తం గడ్డ కట్టడం.. లాంటివి క్రమంగా పెరుగుతున్నాయి. దీన్ని మన ఆరోగ్యానికి విష పదార్థం అని వైద్యులు చెబుతున్నారు. దీని స్థానంలో మళ్లీ తప్పకుండా బెల్లాన్ని వాడటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడం వల్ల మీరూ దీన్ని వాడేందుకు ఆసక్తి చూపిస్తారు.
బెల్లం ఎందుకు వాడాలంటే..
- బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనలో రక్త వృద్ధి జరుగుతుంది. అనీమియా రాకుండా ఉంటుంది. అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహకరిస్తుంది. దీనివల్ల జీవ క్రియ మెరుగవుతుంది. మరీ ముఖ్యంగా మహిళలు దీన్ని కచ్చితంగా పంచదారకు బదులుగా వాడటం అలవాటు చేసుకోవాలి.
- దీని వల్ల కీళ్లలో నొప్పులు తగ్గుతాయి. చిటికెడు పసుపు కలిపిన పాలలో కాస్త బెల్లం వేసుకుని రోజూ తాగడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. తద్వారా ఎముకల ద్వారా వచ్చే ఇబ్బందులన్నీ తగ్గుముఖం పడతాయి.
- మన శరీరంలో అత్యంత ముఖ్య పాత్ర పోషించే కాలేయాన్ని బెల్లం డిటాక్స్ చేస్తుంది. దానిలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థాలను బటయకు పంపించి వేయడంలో సహకరిస్తుంది. దీని వల్ల అది మరింత ఆరోగ్యంగా పని చేస్తుంది.
- బెల్లం తినడం వల్ల జింక్, సెలీనియం లాంటి మినరళ్లు లభిస్తాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలను దెబ్బతినకుండా చేస్తాయి. అందువల్ల రోగ నిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.
- ఒక్కోసారి కొందరికి మరీ నీరసంగా, బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటి వారు కాస్త బెల్లం తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. నీరసం తగ్గుతుంది.
- కొంచెం అల్లంతో కలిపి బెల్లం తీసుకుంటే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- కొందరు గ్యాస్ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల అరుగుదల బాగుంటుంది. గ్యాస్ తగ్గుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే పంచదారకు బదులుగా దీన్ని వాడటాన్ని అలవాటు చేసుకోవాలి.
గమనిక : తెల్లగా ఉండే బెల్లం తయారీలో ఎక్కువగా రసాయనాలను వాడతారు. కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని వాడుకోవాలనుకునే వారు నల్ల బెల్లాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి.