Lungs Detox drinks: ఊపిరితిత్తుల్ని శుభ్రం చేసే నాలుగు డిటాక్స్‌ డ్రింకులు..-know to to make four easy lungs detox drinks at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lungs Detox Drinks: ఊపిరితిత్తుల్ని శుభ్రం చేసే నాలుగు డిటాక్స్‌ డ్రింకులు..

Lungs Detox drinks: ఊపిరితిత్తుల్ని శుభ్రం చేసే నాలుగు డిటాక్స్‌ డ్రింకులు..

Koutik Pranaya Sree HT Telugu
Oct 14, 2023 11:32 AM IST

Lungs Detox drinks: ఊపిరితిత్తులను శుభ్రం చేసే డిటాక్స్ డ్రింకులను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. వాటిలో ఉత్తమమైన నాలుగు డ్రింక్స్ తయారీ విధానం చూసేయండి.

ఊపిరితిత్తులకోసం డిటాక్స్ డ్రింకులు
ఊపిరితిత్తులకోసం డిటాక్స్ డ్రింకులు (freepik)

మన శ్వాస వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించేవి ఊపిరితిత్తులు. ఇవి ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటేనే మనం రోజూ చక్కగా శ్వాసించగలం. శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ని అందించగలం. ఇవి ఏ మాత్రం అనారోగ్యానికి గురైనా, ఇన్ఫెక్షన్ల బారిన పడినా దగ్గు, శ్వాస ఆడకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మరి ఏదైనా రోగం వచ్చిన తర్వాత మందు వాడుకోవడం కంటే దాన్ని రాకుండా చూసుకోవడం ఉత్తమం కదా. అందుకనే వారానికి ఓసారైనా ఊపిరితిత్తుల డిటాక్స్‌ డ్రింకులను తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వాటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

1. పుదీనా అల్లం టీ :

గ్యాస్‌ మీద గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పెట్టండి. అందులో కాస్త అల్లం, పుదీనాలను వేసి ఒక గ్లాసుకు మరగనివ్వండి. తర్వాత దాన్ని వడగట్టి అర స్పూను నిమ్మరసం కలపండి. తీపి కావాలనుకుంటే తేనె, పంచదార, స్వీటర్లలో దేన్నైనా వేసుకోవచ్చు. కాని ఇవి లేకుండా తాగడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ టీ ఎంతో రిఫ్రెషింగ్‌గా, యాంటీ ఆక్సిడెంట్లో నిండి ఉంటుంది. ఊపిరితిత్తుల్ని చక్కగా శుభ్రం చేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థకూ మంచిది.

2. తేనెతో వేడి నీళ్లు :

శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టి వేయడంలో వేడి నీరు ఉత్తమమైన ఆప్షన్‌ అని చెప్పవచ్చు. వీటితో తేనెను కలిపి తాగడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా మారతాయి. దుమ్మ, పుప్పొడి రేణువుల్లాంటి వాటితో మెరుగ్గా పోరాడతాయి. తేనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వాపుల్లాంటివి తగ్గుముఖం పడతాయి. దీంతో శ్వాసకోస సంబంధమైన వ్యాధులు రాకుండా ఉంటాయి.

3. అల్లం టీ :

పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీళ్లు పెట్టండి. దానిలో అర ఇంచు అల్లం ముక్క, చిటికెడు పసుపు వేసి బాగా మరిగించండి. దాన్ని వడగట్టి తాగండి. పసుపులో ఉండే కుర్క్యమిన్‌ క్యాన్సర్‌తో పోరాడుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువ. అందుకనే ఇది యాంటీ క్యాన్సరస్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ టాక్సిక్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీర అవయవాల్లో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. దీనికి అల్లాన్ని కలిపి తాగడం వల్ల ఊపిరితిత్తులు మెరుగవుతాయి.

4. క్యారెట్‌, బీట్‌రూట్‌ స్మూతీ :

మిక్సీలో కాసిన్ని క్యారట్‌, బీట్‌రూట్‌, యాపిల్‌ ముక్కలను చేర్చి స్మూతీలా చేసుకోండి. వీటిలో పీచు పదార్థం, విటమిన్‌ సీలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల్లాంటివి తగ్గుముఖం పడతాయి. ఊపిరితిత్తులు శుభ్రపడి మెరుగ్గా పని చేస్తాయి.

Whats_app_banner