Spotting Vs Periods: రక్తస్రావం తక్కువగా అయితే అవి పీరియడ్స్ కాకపోవచ్చు.. స్పాటింగ్ లక్షణాలివే
Spotting Vs Periods: నెలసరి సమయంలో అయ్యే రక్త స్రావానికి, పీరియడ్స్ మధ్యలో వచ్చే స్పాటింగ్‌కు వ్యత్యాసం ఉంది. వీటి మధ్య తేడాలు తప్పకుండా తెలిసుండాలి. అయితేనే దాని వెనకున్న ఆరోగ్య సమస్యలను తొందరగా గుర్తించగలుగుతారు.
నెలసరి పూర్తయిపోయిన తర్వాత మీకు మళ్లీ మరో పీరియడ్ రాకముందే మధ్యలో కొద్దిగా రక్త స్రావం కనిపిస్తుంటే దాన్ని స్పాటింగ్ అనొచ్చు. పీరియడ్స్ సమయంలో అయ్యే రక్తస్రావానికి, దీనికి తేడా ఉంది. కొద్దిమందిలో ఇది సాధారణమే అయినా కొన్నిసార్లు మాత్రం సమస్యలకు సంకేతం అవ్వొచ్చు. కాబట్టి పీరియడ్స్, స్పాటింగ్ మధ్య తేడాలు తెల్సుకోండి.
స్పాటింగ్ అంటే?
సాధారణంగా నెలసరి సమయంలో కాకుండా ఆ తర్వాత, నెలసరి మధ్యలో అయ్యే రక్తస్రావాన్ని స్పాటింగ్ అంటారు. అయితే నెలసరి లాగా కాకుండా చాలా తక్కువ రక్తస్రావం అవుతుంది. దానికోసం ఎలాంటి పీరియడ్ ప్రొడక్ట్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు.
స్పాటింగ్ ఎలా ఉంటుంది?:
- యోని నుంచే వచ్చే డిశ్చార్చి రంగు ఎరుపు లేదా బ్రౌన్ రంగులో ఉంటుంది.
- కొన్ని గంటల నుంచి రోజుల దాకా స్పాటింగ్ కనిపించొచ్చు.
- నెలసరి అయ్యాక మధ్యలో ఎప్పుడైనా కనిపిస్తుంది.
- కొంతమంది మహిళల్లో ఈ సమయంలో నెలసరి లాగే పొత్తికడుపు నొప్పి వస్తుంది.
స్పాటింగ్ ఎందుకు అవుతుంది?
1. ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలల్లో స్పాటింగ్ కనిపించొచ్చు. ప్రెగ్నెన్సీ నిర్ధరణ అయిన మొదట్లో ఇది కనిపిస్తుంది. ఫలదీకరణం చెందిన అండం గర్భాశయ గోడలకు అంటుకుంటుంది. ఈ సమయంలో తేలికపాటి రక్తస్రావం కనిపిస్తుంది. దీన్నే చాలా మంది నెలసరి అనుకుని భయపడతారు.
2. పీసీఓఎస్: అమ్మాయిల్లో వచ్చే హార్మోన్ల మార్పుల్లో ఇది పెద్ద వ్యాధి. పీసీఓఎస్ సమస్య వల్ల పీరియడ్స్ సరైన సమయంలో రావు. కాబట్టి నెలసరి మధ్యలో రక్తస్రావం కనిపిస్తే ఈ సమస్యకు సంకేతమేమో గమనించుకోవాలి.
3. పెరి మోనోపాజ్: 45 నుంచి 55 ఏళ్ల మధ్యలో వయస్సును పెరి మోనోపాజ్ అంటారు. అప్పుడే పీరియడ్స్ పూర్తిగా ఆగిపోడానికి శరీరం సిద్దం అవుతోంది. ఈస్ట్రోజెన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది.స్పాటింగ్ కూడా కనిపించొచ్చు.
4. ఇన్ఫెక్షన్లు: శృంగారం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లాంటివి స్పాటింగ్‌కు కారణం కావచ్చు.
స్పాటింగ్, పీరియడ్స్ మధ్య తేడాలు:
- పీరియడ్స్ లో స్పాటింగ్ కన్నా రక్త స్రావం ఎక్కువవుతుంది.
- పీరియడ్స్ సమయంలో అయ్యే రక్తస్రావం సాధారణంగా ఎరుపు రంగులో, క్లాట్స్ తో ఉంటుంది. స్పాటింగ్ సమయంలో బ్రౌన్ లేదా లేత రంగులో రక్తస్రావం అవుతుంది. క్లాట్స్ ఉండవు.
- పీరియడ్స్ మూడు నుంచి ఏడు రోజులు వరకు ఉంటే.. స్పాటింగ్ కొన్ని గంటల నుంచి రోజుల వరకు అవ్వచ్చు.
- పొత్తికడుపులో నొప్పి, బ్లోటింగ్, భావోద్వేగాలు ఎక్కువగా అవ్వడం లాంటివి పీరియడ్స్ సంకేతాలు. స్పాటింగ్ లో చాలా మందిలో ఏ సంకేతాలు ఉండకపోవచ్చు.