Baby care myths: కాటుక నుంచి వాకర్ దాకా పిల్లల విషయంలో ఈ తప్పులు చేయొద్దు..
Baby care myths: పిల్లలకు వాకర్ లో నడక నేర్పించడం నుండి వాళ్ల కళ్లకు కాజల్ రాయడం వరకు తల్లిదండ్రులు తరచుగా కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటో తెల్సుకోండి.
కొత్తగా తల్లిదండ్రులు అయిన వాళ్లు తరచుగా పిల్లల సంరక్షణ గురించి గందరగోళానికి గురవుతారు. ఇంట్లో పెద్దలు, చుట్టుపక్కల వారు అనేక రకాల సలహాలు ఇస్తారు. అవి చాలవన్నట్లు ఇంటర్నెట్‌లో బోలెడంత సమాచారం అందుబాటులో ఉంటోంది. ఇవన్నీ తెల్సుకుని అయోమయంలో పడిపోతారు. ఏది మంచిదో తెలీదు. అలాంటి వాటిలో మీ బిడ్డకు అస్సలే మేలు చేయని కొన్ని అపోహల గురించి తెల్సుకోండి.
కళ్లకు కాటుక:
పిల్లల కనుబొమ్మలపై, కళ్లకు కాటుక పెడతారు చాలామంది. కాటుక పెడితే కను రెప్పలు, కనుబొమ్మలు నల్లగా అవుతాయని కొందరంటారు. లేదంటే కళ్లు పెద్దవిగా అందంగా తయారవుతయాని మరికొందరు చెబుతారు. కానీ ఈ రెండింట్లో నిజం ఏ మాత్రం లేదు. కళ్లు జన్యుపరమైన పోలికలను కలిగి ఉంటాయి తప్ప కాటుక పెడితే మార్పు రాదు. వైద్యులు కూడా కాటుక కళ్లలో పెట్టకూడదనే చెబుతున్నారు. కాటుకలో ఉండే రసాయనాలు బిడ్డకు హాని చేస్తాయని మర్చిపోకండి. కేవలం బొట్టు పెట్డడానికి మాత్రమే కాటుక వాడండి చాలు.
టూత్ పేస్ట్:
పిల్లలకు మూడేళ్లు దాటిన తర్వాతే టూత్ పేస్ట్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతకన్నా తక్కువ వయసున్న పిల్లలకు పేస్ట్ వాడాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల దంతాలను శుభ్రపరచడానికి బ్రష్ ను మాత్రమే గోరువెచ్చని నీటిలో ముంచి కడిగితే సరిపోతుంది. .
వాకర్ వాడటం:
నడక తొందరగా వచ్చేయాలనే ఆతృతతో చాలా మంది పిల్లలకు వాకర్ వాడతారు. అది ముమ్మాటికీ తప్పు. కాళ్లలో పూర్తిస్తాయిలో బలం రాకముందే వాకర్ వాడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. పైగా వాకర్ ఎత్తు వాళ్ల ఎత్తుకన్నా ఎక్కువుంటే కాలి బొటన వేలు మీద ఎత్తుకు వచ్చినట్లు నిలబడి నడవటం మొదలుపెడతారు. క్రమంగా ఇదే అలవాటయిపోతుంది. వయసు పెరిగినా కూడా అలాగే కాలి బొటన వేళ్ల మీద నడుస్తారు. కాబట్టి వాకర్ శ్రేయస్కరం కాదు.
స్క్రీన్ టైమ్:
చిన్న పిల్లలు ఎప్పుడూ మొబైల్ చూస్తూ ఉంటే, అది వారిని శారీరకంగానే కాకుండా కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. స్క్రీన్ టైమ్ కారణంగా చిన్న పిల్లలు ఊబకాయులుగా మారతారు. బయటికి వెళ్లి ఆడుకోరు. కొంతమంది పిల్లలు దీనివల్ల ఆలస్యంగా మాట్లాడటం మొదలు పెడుతున్నారు.
క్రీములు వాడటం:
రోజూ మంచి నాణ్యమైన నూనెతో మసాజ్ చేసి స్నానం చేయిస్తే పిల్లల చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. అవనవసరంగా రసాయనాలున్న క్రీముల జోలికిపోకండి. వాటివల్ల పిల్లల చర్మం పాడవుతుంది.
ఆహారాలు:
ఆరు నెలల తర్వాత బిడ్డకు ఇతర ఆహారాలు, పండ్లు వంటి వాటిని తినిపించడం మొదలుపెట్టాలి. ఎందుకంటే పాలు మాత్రమే అన్ని పోషకాలను ఈ వయసు పిల్లలకు అందిచకపోవచ్చు . దీనివల్ల పిల్లల్లో రక్తహీనత వంటి వ్యాధులు రావచ్చు.
పౌడర్ వేయడం:
చెమట బాగా వచ్చినప్పుడు, ఏవైనా ర్యాషెస్ వచ్చినప్పుడు వైద్యుల సూచించిన పౌడర్లు ఏమైనా వేస్తే పరవాలేదు. కానీ, అనవసరంగా ప్రతిరోజు ఎక్కువ పౌడర్ ముఖానికి, శరీరానికి వాడటం వల్ల ఉపయోగం లేదు. కొన్ని రకాల శ్వాసకోశ ఇబ్బందులు వీటివల్ల రావచ్చని వైద్యులు చెబుతున్నారు.