ఇదివరకు కాయాకష్టం చేసి డబ్బు సంపాదించేవాళ్లు. బరువులెత్తి, ఒళ్లు వంచి, ఎంతో కొంత శ్రమిస్తేనే డబ్బు వచ్చేది. కానీ ఆరోగ్యంగా ఉండేవాళ్లు. ఇప్పుడు ఉన్నచోటే కూర్చుని, కళ్ల ముందు కంప్యూటర్ పెట్టుకుని టికటిక చూస్తూ, టకటక నొక్కుతూ పని చేస్తున్నాం. ఇక వేరే ప్రపంచమే లేదన్నట్లు దాంట్లో రోజంగా ముఖం పెట్టుకుని చూస్తేనే పనవుతుంది. రోజులో మనం మెలకువ ఉండే సమయంలో 90 శాతం మన కళ్ల ముందు ఫోన్ లేదా కంప్యూటర్ ఉంటోంది. మరి అంతలా స్క్రీన్ చూస్తే మన కళ్ల పరిస్థితి ఏం కావాలి. అస్సలు నిర్లక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ భారిన పడొచ్చు.
కళ్లు అలసటగా అనిపించడం
దృష్టిలో స్పష్టత తగ్గడం
పొడిబారిన కళ్లు
తలనొప్పి
మెడ, భుజంలో నొప్పి
కళ్లు ఎరుపెక్కడం
మీ మోచేతును సమాంతరంగా చాచితే మీ కంప్యూటర్ స్క్రీన్‌కు మీరు హౌ ఫైవ్ ఇవ్వగలుగుతున్నారా? అయితే మీ స్క్రీన్ మీకు చాలా దగ్గరుగా ఉన్నట్లు. కాస్త దూరంగా స్క్రీన్ ఉంచి పనిచేయాల్సిందే. లేదంటే మీ కళ్ల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దానికోసం మీ ల్యాప్‌టాప్ లో టెక్ట్స్ ఫోంట్ సైజ్ పెంచుకోండి సరిపోతుంది. దూరంగా ఉన్నా పనైపోతుంది.
ఆఫీసుకు వెళ్లగానే కుర్చీ ఎత్తు పెంచేసి కంప్యూటర్ మన ముఖంలో కనిపించేలా సెట్ చేసుకుంటాం. అది ముమ్మాటికి తప్పు. మీరు కంప్యూటర్ కన్నా కనీసం ఐదు ఇంచుల ఎత్తులో ఉండాలి. స్క్రీన్ చూడాలంటే మీ కళ్లని మాత్రం కాస్త కిందికి చూసేలా ఉండాలి. దాంతో మీ కన్నులో కొద్ది భాగానికి కనురెప్ప అడ్డుగా ఉంటుంది. దాంతో కళ్లు తేమగా ఉంటాయి.
మనం మామూలుగా నిమిషానికి కనీసం ఇరవై సార్లయినా కనురెప్పలు కొడతాం. కానీ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఆ సంఖ్య సగం కన్నా తక్కువే. అందుకే కళ్లు పొడిబారిపోతాయి. అందుకే కనీసం ఇరవై నిమిషాలకోసారి ఇరవై ఫీట్ల దూరంలో ఉన్న ఏ వస్తువునయినా కనీసం ఇరవై సెకన్ల పాటూ చూడాలి. దీంతో కళ్లు తేమ కోల్పోవు.
మీరు రోజు మొత్తంలో మరీ ఎక్కువ సేపు స్క్రీన్ మీదే ఉండాల్సి ఉంటే ముందుగా కంటి వైద్యుల్ని కలవండి. వాళ్లు మీ కళ్లకు నప్పే అద్దాలు సూచిస్తారు. సమస్య వచ్చాక కాకుండా ముందే వైద్య సలహా తీసుకోవడం మంచిదే.
మీరు ఎలాంటి వెలుతురులో పని చేస్తున్నా మీరున్న పరిసరాల్లో ఎక్కువగా వెలిగేది మీ స్క్రీన్ అయి ఉండాలి. మీరు బాగా వెలుతురున్న గదిలో లేదా ఆఫీసు పరిసరాల్లో ఉంటే మీ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఆ వెలుతురు కన్నా ఎక్కువగా ఉండాలి. చీకటి గదిలో అయితే తక్కువగా ఉండాలి. మీ కళ్లు మీ స్క్రీన్ వెలుతురు సరిగ్గా లేకపోతే కొన్ని సంకేతాలు ఇస్తూనే ఉంటాయి. అలిసి పోయినట్లు అనిపిస్తుంది. దాన్ని బట్టి వెలుతురు మార్చుకోండి.
టాపిక్