Nutrients for children and women: పిల్లలు, మహిళలకు అవసరమైన 5 విటమిన్లు ఇవే-know 5 essential nutrients for children and women for special needs of their health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nutrients For Children And Women: పిల్లలు, మహిళలకు అవసరమైన 5 విటమిన్లు ఇవే

Nutrients for children and women: పిల్లలు, మహిళలకు అవసరమైన 5 విటమిన్లు ఇవే

HT Telugu Desk HT Telugu
Jan 30, 2023 10:04 AM IST

Nutrients for children and women: పిల్లలు, మహిళలకు అవసరమైన 5 విటమిన్లను నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, మహిళల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఈ 5 విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి.

పిల్లలు, మహిళల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మీ ఆహారంలో 5 విటమిన్లు తప్పనిసరిగా ఉండాలి
పిల్లలు, మహిళల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మీ ఆహారంలో 5 విటమిన్లు తప్పనిసరిగా ఉండాలి (Unsplash)

పిల్లల ఎదుగుదల, మహిళల ఆరోగ్య సంరక్షణలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. మంచి ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి అవసరమైన పోషకాలను తగినంతగా తీసుకోవడం అవసరం. పోషక అవసరాలు వయస్సు, లింగం, శారీరక శ్రమ స్థాయిల ఆధారంగా మారుతూ ఉంటాయి. పిల్లలు, మహిళలకు గల ప్రత్యేకమైన పోషకాహార అవసరాలను తీర్చడానికి పోషకాలు మెండుగా ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. నిర్దిష్ట వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి వారికి ఇతరుల కంటే కొన్ని పోషకాలు ఎక్కువగా అవసరం కావచ్చు. ఉదాహరణకు పెరుగుతున్న పిల్లలకు వారి ఎదుగుదలకు తోడ్పడటానికి ఎక్కువ కాల్షియం అవసరం అయినట్లే గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ఐరన్ అవసరం.

మానసిక ఆరోగ్య నిపుణులు, రౌండ్ గ్లాస్ సంస్థ మెంటల్ హెల్త్ గ్లోబల్ హెడ్ ప్రకృతి పోద్దార్ ఈ అంశాలపై హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో మాట్లాడారు. హెల్తీ డైట్ మాత్రమే కాకుండా, హెల్తీ లైఫ్‌స్టైల్ అనుసరించడం కూడా ముఖ్యమని అన్నారు.

‘ఫిట్‌నెస్, మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ (జాగరూకత), సమాజానికి తిరిగి ఇవ్వడం, విశ్వానికి హాని చేయకపోవడం వంటి మంచి అలవాట్లు అనుసరించాలి. ఇవన్నీ కలిస్తే సంపూర్ణ శ్రేయస్సు కోసం పాటుపడినట్టే. గొప్ప ఆనందం, ఆరోగ్యం, సామరస్యంతో జీవించడానికి సాధ్యపడేలా చేస్తాయి..’ అని వివరించారు. మహిళలు, పిల్లలకు అవసరమైన కొన్ని పోషకాలను ఆమె సూచించారు.

1. ఐరన్:

ఐరన్ ఆకు కూరలు, చిక్కుళ్లు, బీట్‌రూట్, పుట్టగొడుగులు, సోయాబీన్, ఆపిల్, అరటి పండ్లు, ఖర్జూరాలు, అలాగే విటమిన్ సీ అధికంగా ఉన్న పండ్లలో విరివిగా ఉంటుంది. అలాగే మాంసంలోనూ, ముఖ్యంగా లివర్‌లోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీర ఆరోగ్యానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ లోపం ఏర్పడితే ఎనీమియా (రక్తహీనత)కు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఏర్పడుతుంది.

2. కాల్షియం

ఎముకలు, దంతాల నిర్మాణం, ఎదుగుదలలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తం గడ్డకట్టడం, గుండె సక్రమ పనితీరుకు కాల్షియం అవసరం. కౌమార దశకు చేరుకునే ముందు పిల్లల్లో ఎదుగుదల వేగంగా ుంటుంది. రోజూ కనీసం 800 ఎంజీ కాల్షియం అవసరం అవుతుంది. పాలు, పెరుగు, చీజ్ వంటి వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే నువ్వులు, అరటి పండ్లు, ఆపిల్స్, ఆకు కూరలు వంటి వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

3. విటమిన్ డీ:

విటమిన్ డీకి సన్‌షైన్ విటమిన్‌గా పేరుంది. సూర్యరశ్మి నుంచి నేరుగా విటమిన్ డీ లభిస్తుంది. కాల్షియం శోషణకు ఇది చాలా అవసరం. పిల్లల్లో తప్పనిసరిగా అవసరమైన పోషకం ఇది. అలాగే గర్భం దాల్చిన వారికి, మెనోపాజ్ దశ వచ్చిన వారికి విటమిన్ డీ చాలా అవసరం. విటమిన్ డీ పుట్టగొడుగుల్లో కూడా లభిస్తుంది. పాలు, కొవ్వు ఉండే సాల్మన్ వంటి చేపలు, గుడ్లల్లో విటమిన్ డీ లభిస్తుంది.

4. విటమిన్ బీ:

విటమిన్ బీ కాంప్లెక్ విటమిన్. 8 విభిన్న విటమిన్ల శ్రేణిని కలిగి ఉంటుంది. శరీరంలోని విభిన్న కార్యకలాపాలు సక్రమంగా నడవాలంటే ఈ బీ కాంప్లెక్స్ విటమిన్ అవసరం అవుతుంది. ఎదుగుదల, పటిష్టత, నాడులు, కండరాలు బలోపేతం కావడం, ఆరోగ్యకరమైన గర్భధారణకు ఇవన్నీ అవసరం అవుతాయి. గుడ్లు, మాంసం, చేపలు, పాలు వంటి జంతు ఆధారిత ఆహారాల్లో బీ విటమిన్లు లభిస్తాయి. అలాగే పుట్టగొడుగులు, తృణ ధాన్యాలు, అవకాడో వంటి వాటిల్లో కూడా బి విటమిన్ లభిస్తుంది.

5. ఫోలిక్ యాసిడ్:

మహిళలు, పిల్లల ఆరోగ్యానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవశ్యమైన పోషకం. బీ విటమిన్‌లో భాగమైన ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాలు ఏర్పడడడానికి, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఫోలిక్ యాసిడ్ అవసరం. మహిళల్లో ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఇది చాలా కీలకపాత్ర పోషిస్తుంది. తగినంత ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే జన్మ సంబంధిత లోపాలు తగ్గుతాయి. ముఖ్యంగా శిశువు మెదడు, వెన్నుముకకు సంబంధించి నిర్మాణ లోపాలు ఎదురవవు. నారింజ, ఆకు కూరలు, బీన్స్, పచ్చి బఠానీల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభిస్తుంది.

జాగరూకతతో తినడం అలవరచుకుని ఈ పోషకాలన్నీ మీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. శ్వాస సరిగ్గా తీసుకోవడం వల్ల ఆహారం రుచికరంగా, సువాసనలతో ఆస్వాదించవచ్చు. జాగరూకతగా ఉంటే మనం తినే ఆహారం విషయంలో మనం సానుకూలంగా ఉండగలుగుతాం. రుచిని, వాసనను ఆస్వాదించడానికి ఆహారాన్ని నెమ్మదిగా నమలాలి.