Kidney Issues In October । షాకింగ్.. అక్టోబర్‌లో కిడ్నీ వ్యాధులు పెరుగుతాయట, కారణం ఇదే!
Kidney Issues In October: అక్టోబర్‌లో కిడ్నీ వ్యాధులు ఎక్కువవుతాయట. కిడ్నీలలో రాళ్లు ఏర్పడటం, మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సంభవిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకో ఈ స్టోరీ చదవండి.
కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎవరికైనా, ఏ సమయంలోనైనా రావచ్చు. అయితే ప్రత్యేకంగా అక్టోబర్ నెలలో ఈ కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు (Kidney Issues In October) ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా? ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఆరోగ్య నిపుణులు ఇది నిజమేనని అంటున్నారు. ఈ సీజన్‌లోని కొన్ని ప్రతికూల పరిస్థితులు మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయట, దీని కారణంగా ప్రజలు కిడ్నీ సంబంధిత సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.
దీని వెనుక కారణం ఏమిటో మరింత లోతుగా తెలుసుకుందాం. సాధారణంగా అక్టోబరు నెల చాలా వరకు ఆహ్లాదకరంగానే ఉంటుంది. అప్పుడప్పుడూ వర్షం, వెచ్చనైన ఎండల కలయిక వాతావరణంలో ఉంటుంది. అయితే భారతదేశంలో సాధారణంగా ఈ నెలలో రుతుపవనాలు తిరోగమనంలో ఉంటాయి. ఉక్కపోత, తేమ సాధారణంగా ఉంటుంది. ఈ అక్టోబర్ వేడి మన శరీరానికి ప్రతికూల మార్గాల్లో ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
అక్టోబర్ నెలకు, కిడ్నీల సమస్యలకు మధ్య బలమైన శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం అక్టోబర్‌లో కిడ్నీ వ్యాధులు ఎక్కువ కావచ్చు. ఎందుకంటే వేడి- తేమతో కూడిన వాతావరణం శరీరం నిర్జలీకరణానికి కారణమవుతుంది. ఇది మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, మూత్రపిండ ఇన్ఫెక్షన్లు, ఇప్పటికే ఉన్న మూత్రపిండ వ్యాధుల తీవ్రతరం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. నిర్జలీకరణ కారణంగా మూత్రం గాఢతకు పెరుగుతుంది, ఇది రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది. మూత్రం అధిక సాంద్రత కారణంగా, మూత్రంలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
ఇంకా తేమతో కూడిన వేడి వాతావరణం అధిక చెమటను కలిగిస్తుంది, ఇది లోబీపీకి దారితీస్తుంది. కాబట్టి మధుమేహం, బీపీ మందులు లేదా హృదయ సంబంధ ఔషధాలు తీసుకునే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని గ్లోబల్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అయిన డాక్టర్ శృతి తపియావాలా పేర్కొన్నారు.
అక్టోబర్‌లో కిడ్నీ వ్యాధులు.. నివారణ మార్గాలు
1. నీరు తగినంత తాగాలి. సహజ పానీయాలైన కొబ్బరి నీరు, మజ్జిగ, గ్రీన్ టీ మొదలైనవి తీసుకుంటూ ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి.
2. కిడ్నీలకు హాని కలిగించే పెయిన్ కిల్లర్‌లను ఉపయోగించడం మానేయాలి. ఇబుప్రోఫెన్, డైక్లోఫెనాక్, నిమెసులైడ్, కాక్సిబ్స్ వంటి కాక్స్ 2- ఇన్హిబిటర్స్ వంటి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు) తీసుకోవద్దు. డీహైడ్రేషన్ కు గురైనపుడు ఇలాంటి మందులు తీసుకుంటే అది తీవ్రమైన మూత్రపిండాల నష్టాన్ని కలిగిస్తుంది.
3. వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి అనేక మందులు తీసుకునే వారయితే, మందుల మార్పు గురించి మీ వైద్యుడిని సంప్రదించండి.
4. అధిక సోడియం, ప్రాసెస్ చేసిన మాంసాహారం వంటివి కిడ్నీలకు హానికరం. కిడ్నీ ఆరోగ్యం కోసం తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవడం చాలా అవసరం.
5. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు మూత్రపిండాలకు హానికరం. ఇతర వ్యక్తుల కంటే ధూమపానం చేసేవారికి కాలక్రమేణా మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
సంబంధిత కథనం
టాపిక్